breaking news
taxi fare
-
Hyderabad: క్యాబ్‌లు, ఆటోల్లో అడ్డగోలు వసూళ్లు.. ప్రేక్షకపాత్రలో రవాణాశాఖ
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి జూబ్లీబస్‌స్టేషన్‌కు మధ్య దూరం కేవలం రెండున్నర కిలోమీటర్లు. ఆర్టీసీ చార్జీ రూ.10 ఉంటుంది. కానీ కాస్త లగేజీతో ఉన్న ప్రయాణికుడు ఏదో ఒక ఆటో బుక్ చేసుకోవాలనుకొని ఆశిస్తే కనీసం రూ.100 సమర్పించుకోవలసిందే. రాత్రి ఎనిమిది దాటినా, తెల్లవారు జామున ఐదైనా ఈ చార్జీ కాస్తా రూ.150 కూడా దాటొచ్చు. ► ఉప్పల్ బస్టాండ్ నుంచి మెట్రో స్టేషన్ వరకు రెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఆటోలో వెళ్లాంటే రూ.80 పైనే వసూలు చేస్తారు. ► ఖైరతాబాద్, ఎర్రమంజిల్, పజగుట్ట, తదితర మెట్రో స్టేషన్ల నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఎక్కడికెళ్లినా సరే రూ.100 పైన సమర్పించుకోవలసిందే. ► ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో, మెట్రో రైళ్లలో చెల్లించే చార్జీలకు ఇది రెట్టింపు. బర్కత్‌పురా నుంచి సికింద్రాబాద్ వరకు నేరుగా ఆటోలో వెళితే రూ.350 నుంచి రూ.400 వరకు చెల్లించాల్సిందే. మీటర్లు లేని ఆటోల్లో మాత్రమే కాదు. ఓలా, ఉబెర్, రాపిడో వంటి క్యాబ్ అగ్రిగేటర్ సంస్థలకు అనుసంధానంగా ఉన్న ఆటో రిక్షాల్లోనూ చార్జీల మోత మోగుతోంది. ఎలాంటి నియంత్రణ లేకుండా అడ్డగోలుగా వసూలు చేస్తున్నారు. అగ్రిగేటర్ సంస్థలు అందుబాటులోకి వచ్చిన తరువాత ఆటో రిక్షాలపైన రవాణాశాఖ నియంత్రణ కొరవడింది. దీంతో అన్ని రకాల ఆటోలు ప్రయాణికులపై నిలువుదోపిడీ కొనసాగిస్తున్నాయి. తప్పనిసరి పరిస్థితు ల్లో ఆటోలో వెళ్లే వారి జేబులను లూఠీ చేస్తున్నారు. క్యాబ్ ఆటోల్లోనూ అంతే... మీటర్లు లేని ఆటోల్లో డ్రైవర్లు ఇష్టారాజ్యంగా వసూళ్లకు దిగితే అగ్రిగేటర్ సంస్థలకు చెందిన ఆటోలు బుకింగ్ సమయంలోనే హడలెత్తిస్తున్నాయి. కొద్దిపాటి దూరానికే రూ.వందల్లో చార్జీలు విధిస్తున్నాయి. ఈ సంస్థల చార్జీలకు ఎలాంటి ప్రామాణికత లేకపోవడం గమనార్హం. సాధారణంగా ఆటోలు, క్యాబ్‌లలో మోటారు వాహన చట్టం ప్రకారం మీటర్ రీడింగ్ ద్వారా చార్జీలను నిర్ధారించవలసిన రవాణాశాఖ చాలా ఏళ్ల క్రితమే చేతులెత్తేసింది. కర్ణాటక తరహా ఆంక్షలేవీ... అగ్రిగేటర్ సంస్థల ఆటోలపైన తాజాగా కర్ణాటక రవాణాశాఖ ఆంక్షలు విధించింది. రెండు కిలోమీటర్ల దూరానికే రూ.వందకు పైగా వసూలు చేస్తున్న ఓలా,ఉబెర్, రాపిడో ఆటోలను మూడు రోజుల పాటు రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. అదే తరహాలో హైదరాబాద్‌లోనూ ఆంక్షలు విధించి అడ్డగోలు చార్జీలను అరికట్టాలని యునైటెడ్ ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్ ప్రధాన కార్యదర్శి బీటీ శ్రీనివాసన్ డిమాండ్ చేశారు. ఏళ్లు గడిచినా పత్తాలేని మీటర్లు గ్రేటర్ హైదరాబాద్‌లో ఆటోరిక్షాలకు 2012లో మీటర్లను బిగించారు. మొదటి 1.6 కిలోమీటర్లకు రూ.20 , ఆ తరువాత ప్రతి కిలోమీటర్‌కు రూ.11 చొప్పున రవాణాశాఖ చార్జీలను నిర్ణయించింది. ఆటోడ్రైవర్లు కచ్చితంగా ఈ నిబంధన పాటించాలి. నిబంధనలకు విరుద్ధంగా చార్జీలు వసూలు చేసే ఆటోలపైన ఆర్టీఏ అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకొనేందుకు అవకాశం ఉంది. కానీ మీటర్లు బిగించిన మొదటి ఏడాది కాలంలోనే డ్రైవర్లు ఈ నిబంధనలను తుంగలో తొక్కారు. మీటర్లకు సీళ్లు వేయడంలో తూనికలు కొలతల శాఖ విఫలమైంది. మీటర్ రీడింగ్ లేకుండా ఇష్టారాజ్యంగా చార్జీలు వసూలు చేసే ఆటోరిక్షాలపైన ఆర్టీఏ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో ఆటోడ్రైవర్లు మీటర్ రీడింగ్‌ను పూర్తిగా గాలికి వదిలేసి అడ్డగోలు వసూళ్లకు దిగారు.మీటర్ రీడింగ్‌పైన చార్జీలు చెల్లించాలనుకొంటే అది సాధ్యం కాదు. ఎందుకంటే నగరంలో ఏ ఒక్క ఆటోకు కూడా ఇప్పుడు మీటర్లు పని చేయడం లేదు. ‘మీటర్ వేయాలని అడిగితే దౌర్జన్యానికి దిగినంత పని చేస్తారు. వాళ్లు అడిగినంత ఇచ్చి రావడమే మంచిది.’ అని సీతాఫల్‌మండికి చెందిన కిరణ్ ఆందోళన వ్యక్తం చేశారు. (క్లిక్: వనపర్తి–మంత్రాలయం మధ్య నేషనల్ హైవే!) -
‘ఎయిర్పోర్ట్ నుంచి ట్యాక్సీకి రూ.10,000’
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి యూపీలోని 250 కిమీ పరిధిలోని ప్రాంతాలకు వెళ్లే ట్యాక్సీలకు భారీ మొత్తంలో రూ 10,000 నుంచి రూ.12,000 చార్జీలుగా నిర్ణయించిన యూపీఎస్ఆర్టీసీ నిర్ణయం వివాదాస్పదమైంది. ఢిల్లీకి సమీపంలోని నోయిడా, ఘజియాబాద్‌లకు వెళ్లే క్యాబ్‌లకు కూడా ఇదే భారీ మొత్తం వసూలు చేయాలని యూపీఎస్ఆర్టీసీ తీసుకున్న నిర్ణయంపై సోషల్ మీడియాలో విమర్శలు చెలరేగడంతో యూపీ ప్రభుత్వం వెనక్కితగ్గింది. చార్జీలను పునఃసమీక్షించేందుకు యూపీఎస్ఆర్టీసీ కమిటీని నియమించింది. వందే భారత్ మిషన్ కింద విదేశాల నుంచి ఢిల్లీకి తిరిగివచ్చే ప్రయాణీకులు అక్కడి నుంచి నోయిడా, ఘజియాబాద్ సహా యూపీలోని 250 కిమీ పరిధిలోని ప్రాంతాలకు క్యాబ్‌కు రూ 10,000, ఎస్‌యూవీకి అయితే రూ 12,000 చెల్లించాలని యూపీఎస్ఆర్టీసీ ఎండీ రాజశేఖర్ నోయిడా, ఘజియాబాద్ ప్రాంతీయ మేనేజర్లకు ఉత్తర్వులు జారీ చేశారు. ఢిల్లీ విమానాశ్రయం నుంచి యూపీలోని క్వారంటైన్ సెంటర్లకు తాము నడిపే సర్వీసులు పూర్తి ఉచితమని, ట్యాక్సీ సేవల కోసం నిర్ణయించిన చార్జీలపై సమీక్షించేందుకు కమిటీని నియమించామని, 24 గంటల్లో కమిటీ తమ నివేదికను సమర్పిస్తుందని యూపీఎస్ఆర్టీసీ ఎండీ రాజశేఖర్ ప్రకటించారు. చదవండి : ఢిల్లీలో బీభత్సం సృష్టించిన వడగండ్ల వాన -
టాక్సీలో 850 కి.మీ. తిరిగి.. డబ్బు లేదన్నాడు!
హాయిగా టాక్సీ ఎక్కి, 850 కిలోమీటర్ల ప్రయాణం చేసిన తర్వాత తన దగ్గర డబ్బు లేదని చేతులెత్తేశాడట. ఈ విచిత్ర ఘటన జపాన్‌లో జరిగింది. ఉద్యోగం సద్యోగం ఏమీ లేని తకఫుమి అరిమా (26) అనే ఈ వ్యక్తి టోక్యోకు దక్షిణంగా ఉన్న యొకొహొమా నగరంలో టాక్సీ ఎక్కాడు. నైరుతి జపాన్‌లోని షికొకు ద్వీపంలో గల మట్సుయమ అనే ప్రాంతానికి తీసుకెళ్లాలని డ్రైవర్‌ను కోరాడు. అక్కడకు వెళ్లిన తర్వాత డబ్బులు ఇస్తానని చెప్పడంతో డ్రైవర్ సరేనని తీసుకెళ్లాడు. రాత్రి మొత్తం దాదాపు 9 గంటల పాటు ప్రయాణం చేసిన తర్వాత గమ్యానికి చేరుకున్నారు. తీరా అక్కడకు వెళ్లిన తర్వాత మొత్తం టాక్సీ మీటర్ చూస్తే మనోడికి గుండె గుభేల్మంది. దాదాపు 1.75 లక్షల రూపాయల బిల్లు వచ్చింది. కానీ తన వద్ద అసలు డబ్బులే లేవని అరిమా చెప్పాడు. దాంతో ఏం చేయాలో అర్థం కాని టాక్సీ డ్రైవర్.. పోలీసులను పిలిచి విషయం చెప్పాడు. వాళ్లొచ్చి అరిమాను అరెస్టు చేశారు. చేతిలో డబ్బులు లేనప్పుడు అంతదూరం అది కూడా టాక్సీలో ఎందుకు వెళ్లాల్సి వచ్చిందనే విషయం మాత్రం ఇంకా తెలియలేదు.