కమిట్‌ అయితే.. పిప్పి పిండి చేస్తారు! | Bengaluru Techie Rejects Rs 20 Lakh Hike You Know Why He Takes Decision | Sakshi
Sakshi News home page

కమిట్‌ అయితే.. పిప్పి పిండి చేస్తారు!

Sep 1 2026 4:34 PM | Updated on Sep 1 2026 4:37 PM

Bengaluru Techie Rejects Rs 20 Lakh Hike You Know Why He Takes Decision

కార్పొరేట్ ప్రపంచంలో పదోన్నతి, భారీ వేతన పెంపుల కోసం ఉద్యోగులు నిత్యం శ్రమిస్తుంటారు. ఏటా 10-15 శాతం వేతన పెంపు కోసమే కంపెనీలు మారే సంస్కృతి పెరిగిపోతున్న ప్రస్తుత కాలంలో బెంగళూరుకు చెందిన ఒక ఐటీ నిపుణుడు తీసుకున్న నిర్ణయం కార్పొరేట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఏడాదికి ఇప్పటికే రూ.45 లక్షల ప్యాకేజీ పొందుతున్న 31 ఏళ్ల సాఫ్ట్‌వేర్ డెవలపర్ కంపెనీ ఆఫర్ చేసిన మరో రూ.20 లక్షల అదనపు వేతన పెంపును (మొత్తం రూ.65 లక్షల ప్యాకేజీ) నిరాకరించాడు.

‘యు-ఎబిలిటీ’(UAbility) వ్యవస్థాపకుడు రోహన్ ధావన్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన వివరాల ప్రకారం.. సదరు టెకీకి లభించిన పదోన్నతితో బాధ్యతలు, పని ఒత్తిడి రెట్టింపు కానున్నాయి. వారంలో నాలుగు రోజులు రాత్రి వేళల్లో అమెరికా బృందాలతో సమావేశాలు, నిరంతర ప్రయాణాలు, ప్రస్తుతం ఉన్నదానికి రెట్టింపు బృందాన్ని పర్యవేక్షించడం వంటి కఠినమైన షరతులు ఆ ఆఫర్‌లో ఉన్నాయి. చివరకు వారాంతపు సెలవుల్లో కూడా పని చేయాల్సి వస్తుంది.

వచ్చే ఏడాది పిల్లల కోసం ప్లాన్‌ చేస్తున్న ఆ నిపుణుడు మానసిక ప్రశాంతత, ఆరోగ్యం, కుటుంబ జీవితానికి మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తున్నట్లు చెప్పాడు. వారానికి ఐదు రోజులు వ్యాయామం, తల్లిదండ్రులతో గడిపే సమయం ఈ ఒత్తిడి వల్ల కోల్పోవాల్సి వస్తుందని ఆఫర్‌ను తిరస్కరించాడు.

ఈ నిర్ణయం అతడి తండ్రిని తీవ్ర ఆశ్చర్యానికి గురిచేసింది. ‘రూ.20 లక్షల భారీ అదనపు ఆదాయాన్ని ఎవరు వదులుకుంటారు?’ అని ఆయన ప్రశ్నించారు. అయితే, సోషల్ మీడియాలో నెటిజన్ల నుంచి మాత్రం ఈ నిర్ణయానికి విశేష మద్దతు లభించింది. ఒక పరిమితి దాటిన తర్వాత లభించే అదనపు ఆదాయం కంపెనీల జేబుల నుంచి కాదు, ఉద్యోగి వ్యక్తిగత జీవితం, ఆరోగ్యం నుంచే వస్తుందనే నిజం ఈ ఘటనతో మరోసారి రుజువైందని కొందరు చెబుతున్నారు. ఆర్థిక ప్రయోజనాల కంటే జీవన నాణ్యత, మానసిక ఆరోగ్యానికే ఆధునిక యువత ప్రాధాన్యం ఇస్తోందని ఈ ఘటన చెబుతోంది.

ఇదీ చదవండి: 600 దరఖాస్తులు.. 10 ఇంటర్వ్యూలు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement