జాతీయ అవార్డుల వేదికను ఎందుకు మార్చారు?
మహారాష్ట్రను ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదు?
కేంద్రంపై ఎమ్మెన్నెస్ చీఫ్ రాజ్‌ఠాక్రే ప్రశ్నాస్త్రాలు
దక్షిణాది రాష్ట్రాలూ గళమెత్తాలని పిలుపు
సాక్షి ముంబై: జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదాన వేదికను గుజరాత్‌లోని కెవాడియాకు తరలించడంపై మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎమ్మెన్నెస్) అధ్యక్షుడు రాజ్ ఠాక్రే తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. 72 ఏళ్లుగా ఢిల్లీలో కొనసాగుతున్న సంప్రదాయాన్ని ఇప్పుడు కొత్తగా మార్చాల్సిన అవసరం ఏమొచ్చిందని నిలదీశారు. కార్యక్రమాన్ని ఢిల్లీ నుంచి తరలించాలనుకుంటే భారతీయ చిత్ర పరిశ్రమకు ప్రధాన కేంద్రంగా ఉన్న ముంబైను ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదని ప్రశ్నించారు.
గుజరాత్‌కు ప్రాధాన్యం ఎందుకు?
ఈనెల 22న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా గుజరాత్‌లోని కెవాడియా (ఏక్తానగర్)లో జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. 1954లో ప్రారంభమైన ఈ అవార్డుల వేడుక ఇన్నేళ్లుగా ఢిల్లీలోనే జరుగుతోంది. తొలిసారిగా రాజధాని వెలుపల కార్యక్రమాన్ని నిర్వహించనుండటంపై రాజ్ ఠాక్రే సామాజిక మాధ్యమం వేదికగా స్పందించారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలపై విమర్శలు గుప్పించారు.
దేశంలోని కీలక కార్యక్రమాలు, ప్రాజెక్టుల విషయంలో గుజరాత్‌కే వరుసగా ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపించారు. దీనివల్ల దేశ అభివృద్ధికి గుజరాతే కేంద్రం అన్న భావనను కల్పించే ప్రయత్నం జరుగుతోందా? అని ప్రశ్నించారు. భారతీయ చిత్ర పరిశ్రమకు పునాది వేసిన దాదాసాహెబ్ ఫాల్కే మహారాష్ట్రకు చెందినవారని రాజ్ ఠాక్రే గుర్తుచేశారు. దేశంలో అత్యధిక చిత్రాల నిర్మాణం జరిగే ప్రాంతాల్లో మహారాష్ట్రతోపాటు తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉన్నాయని పేర్కొన్నారు. అలాంటి రాష్ట్రాల్లో ఏదో ఒకదానిని ఎంపిక చేయకుండా గుజరాత్‌నే ఎందుకు ఎంచుకున్నారని ప్రశ్నించారు.
ఇదీ చదవండి: 'ఐడీ కార్డులు చెక్ చేయండి.. మతాన్ని కాదు'
'‘జాతీయ చలనచిత్ర అవార్డుల వేడుకను ఢిల్లీ నుంచి తరలించాల్సిన అవసరం ఏమిటి? ఒకవేళ అలా తరలించాలనుకుంటే భారతీయ చిత్ర పరిశ్రమకు కేంద్రంగా ఉన్న మహారాష్ట్రను ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదు?’’ అని ఆయన ప్రశ్నించారు. భారతదేశపు ప్రస్తుత స్థాయికి ఏ ఒక్క రాష్ట్రం మాత్రమే కారణం కాదని.. దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు తరతరాలుగా చేసిన కృషి, త్యాగం, శ్రమ ఉన్నాయని పేర్కొన్నారు.
కళాకారులు ప్రశ్నించాలి
ప్రస్తుత పాలకులకు కళలపై ఆసక్తి లేదని, ఎన్నికల్లో విజయం సాధించడమే ప్రధాన లక్ష్యంగా మారిందని రాజ్ ఠాక్రే విమర్శించారు. కళాకారులు అధికారాన్ని పొగడటానికే పరిమితం కాకుండా.. ప్రజలకు సంబంధించిన నిర్ణయాలపై ప్రశ్నించాల్సిన అవసరం ఉందన్నారు. అమెరికాలో ఆస్కార్ అవార్డుల వేడుక లాస్ ఏంజెల్స్‌లో జరుగుతున్న విషయాన్ని ప్రస్తావిస్తూ.. అక్కడి అధ్యక్షులు తమ సొంత రాష్ట్రానికి ఆ కార్యక్రమాన్ని తరలించేందుకు ప్రయత్నించలేదని వ్యాఖ్యానించారు.
దక్షిణాది రాష్ట్రాలు గళమెత్తాలి
జాతీయ చలనచిత్ర అవార్డుల వేడుక తరలింపు విషయంలో మహారాష్ట్రతోపాటు తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు గట్టిగా స్పందించాలని రాజ్ ఠాక్రే కోరారు. ఈ అంశంపై కళాకారులు కూడా తమ అభిప్రాయాలను బహిరంగంగా వెల్లడించాలని పిలుపునిచ్చారు. కాగా, జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదాన వేడుకలను ఢిల్లీ నుంచి గుజరాత్‌కు తరలించడాన్ని శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే కూడా వ్యతిరేకించారు.


