మీకు మీరే సర్టీఫికెట్‌ ఇచ్చుకుంటారా? | YS Jagan Straight Questions To CM Chandrababu Over DSC Scam | Sakshi
Sakshi News home page

మీకు మీరే సర్టీఫికెట్‌ ఇచ్చుకుంటారా?

Sep 22 2026 2:40 AM | Updated on Sep 22 2026 2:40 AM

YS Jagan Straight Questions To CM Chandrababu Over DSC Scam

సీఎం చంద్రబాబుపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ ధ్వజం

స్కామ్‌లు చేసిన వాళ్లే.. తమకు తాముగా ఇచ్చుకునే సర్టీఫికెట్లకు విలువ ఏముంటుంది?  

ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానికి ర్యాలీలు చేసే హక్కు కూడా లేదా? 

టీచర్ల ముసుగులో మీ రౌడీలతో దాడులు చేయిస్తారా? 

పోలీసులను అడ్డుపెట్టుకుని స్కామ్‌ను దాచేయలేరు 

ప్రతిపక్షం గొంతును అణిచివేసి వాస్తవాలను కప్పిపుచ్చలేరు 

డీఎస్సీ అక్రమాలకు బాధ్యత వహిస్తూ లోకేశ్‌ రాజీనామా చేయాలి 

డీఎస్సీలో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలి

సాక్షి, అమరావతి: మెగా డీఎస్సీలో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలని వైఎస్సార్‌సీపీ డిమాండ్‌ చేస్తుంటే ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబుకు ఎందుకంత భయమని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సూటిగా ప్రశ్నించారు. మెగా డీఎస్సీలో అక్రమాలు జరిగాయని రుజువులు ఉన్నా.. పారదర్శకంగా జరిగాయంటూ మీకు మీరుగానే సర్టిఫికెట్‌ ఇచ్చుకుంటారా? స్కాములు చేసిన వాళ్లే తమకు తాముగా సర్టిఫికెట్లు ఇచ్చుకుంటే వాటికి విలువ ఏముంటుంది చంద్రబాబూ? అని నిలదీశారు. 

మరొకవైపు డీఎస్సీ అక్రమాలపై మా పార్టీ శ్రేణులు శాంతియుతంగా నిరసన చేస్తుంటే మీ గూండాలను ఊసిగొల్పి మరీ దాడు­లు చేయిస్తారా? ఇది డైవర్షన్‌ పాలిటిక్స్‌ కాదా చంద్రబాబూ..? అని వైఎస్‌ జగన్‌ సూటిగా ప్రశ్నించారు. ‘అసలు సీబీఐ విచారణ అంటే ఎందుకంత భయం..? ఎందుకంత ఉక్రోషం? పారదర్శకంగా జరిగాయంటూ మీరు, మీ కుమారుడు, విద్యా­శాఖ మంత్రి లోకేశ్‌ మీకు మీరుగానే సర్టీఫికెట్‌ ఇచ్చుకుంటారా? స్కామ్‌లు చేసిన వాళ్లే.. తమకు తాముగా ఇచ్చుకునే సర్టీఫికెట్లకు విలువ ఏముంటుంది? ఊరికే డైలాగులు కొట్టడం ఎందుకు? దమ్ముంటే సీబీఐ విచారణకు ఒప్పుకోండి..’ అని నిలదీశారు. 

ఈ మేరకు వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం వ్యవహార శైలిని సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో వైఎస్‌ జగన్‌ సోమవారం ఎండగట్టారు. గతంలో ప్రభుత్వాన్ని అడిగిన ప్రశ్నలను మరోసారి గుర్తు చేస్తూ వాటికి సమాధానాలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. తన పోస్టులో వైఎస్‌ జగన్‌ ఇంకా ఏమన్నారంటే.. 

మీ దిగజారుడుతనానికి నిదర్శనం.. 
ఇవాళ విజయవాడలో జరిగిన ఘటనలు చూస్తే మీ ప్రభుత్వం ఎంతగా దిగజారిపోయిందో అర్థమవుతోంది. సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ విద్యార్థులు, నిరుద్యోగులతో కలిసి మా పార్టీ నాయకులు శాంతియుతంగా ర్యాలీ చేసేందుకు వెళ్తే వారిని అడ్డుకున్నారు, లాఠీలతో కొట్టించారు. టీచర్ల ముసుగులో మీ రౌడీలతో దాడులు చేయించారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానికి ర్యాలీలు చేసే హక్కు కూడా లేదా చంద్రబాబూ? డీఎస్సీలో మీరు స్కామ్‌లు చేశారు కాబట్టే, ఆ అక్రమాలపై ప్రశ్నిస్తూ మిమ్మల్ని, మీ అబ్బాయిని బట్టలిప్పి కడిగేస్తున్నారు. కాబట్టే సమాధానాలు చెప్పలేక, తట్టుకోలేక ఇంతగా దిగజారిపోయి వ్యవహరిస్తున్నారు.  

నిష్పాక్షిక విచారణ ఒక్కటే మార్గం 
టీచర్‌ పోస్టుల కోసం లక్షలమంది యువత సంవత్సరాల తరబడి చదువుతారు. లక్షల రూపాయలు ఖర్చు చేస్తారు. అలాంటప్పుడు వారి కష్టానికి, ప్రతిభకు, న్యాయం జరుగుతుందన్న విశ్వాసం ప్రభుత్వ నియామక వ్యవస్థపై ఉండాలి. మీరు, మీ కుమారుడు లోకేశ్‌ చేసిన స్కామ్‌ల పుణ్యమా అని ఆ విశ్వాసం ఏ నిరుద్యోగికీ, ఏ ఉద్యోగార్థికీ లేకుండా పోయింది. మీ పోలీసుల బారికేడ్లు, మీ లాఠీఛార్జీలు, అరెస్టులు, కౌంటర్‌గా మీరు పెట్టించిన ఫేక్‌ ధర్నాలు పోయిన ఆ విశ్వాసాన్ని తీసుకు వస్తాయా? కేవలం సీబీఐతో జరిగే నిష్పాక్షిక విచారణ మాత్రమే ఆ విశ్వాసాన్ని తిరిగి తీసుకు రాగలదు.  

బాధితులకు న్యాయం జరగాలి..  
పోలీసులను అడ్డుపెట్టుకుని స్కామ్‌ను దాచేయలేరు. ప్రతిపక్షం గొంతును అణిచివేసి వాస్తవాలను దాచలేరు. డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం జరగాలి.. ఉద్యోగాల నియామకాలు పారదర్శకంగా ఉండాలి. దానికోసమే మా పోరాటం. డీఎస్సీ అక్రమాలకు బాధ్యత వహిస్తూ లోకేశ్‌ రాజీనామా చేయాలి. సీబీఐతో విచారణ జరిపించాలి. అంతవరకూ డీఎస్సీ బాధితుల పక్షాన మా గొంతు నినదిస్తూనే ఉంటుంది.

విచారణకు ఎందుకు వెనకాడుతున్నారు..? 
ఏదో ఒక స్కామ్‌ చేసి దొరికినప్పుడల్లా తప్పించుకోవడానికి డైవర్షన్లు చేయడం మీకు అలవాటే. మీ బుద్ధే అంత! మేం అడుగుతున్నది ఏమిటి? లక్షలాది మంది అభ్యర్థుల భవిష్యత్తుతో ముడిపడిన డీఎస్సీ నియామకాల్లో జరిగిన అక్రమాలపై నిష్పాక్షికంగా సీబీఐ విచారణ జరపమంటున్నాం. ఎలాంటి తప్పూ జరగలేదని మీకు అంత నమ్మకం ఉంటే విచారణకు ఎందుకు వెనుకాడుతున్నారు? పైపెచ్చు ఇన్ని ఆధారాలు కనపడుతున్నప్పుడు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement