నడిరోడ్డుపైనే వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై తెలుగుదేశం గూండాల దాడులు శాంతిర్యాలీలో బస్‌పైకి ఎక్కి నిరసన తెలిపిన వైఎస్సార్ సీపీ నేతలు ఏడీసీపీ గుణ్ణం రామకృష్ణ ఓవరాక్షన్ కృష్ణలంక పీఎస్‌లో నాయకుల నిర్బంధం
కార్యకర్తలపై లాఠీఛార్జ్
పోలీసుల చేతుల్లో లాఠీలు తీసుకుని టీడీపీ గూండాల దాడులు
డీఎస్సీ ఉద్యోగుల ముసుగులో రౌడీలు
మంగళవారం శ్రీ 22 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026
ఖాకీల అండతో
నిరసన.. విజయవాడలో శాప్ కార్యాలయం వద్ద బస్ పైకి ఎక్కి నిరసన తెలుపుతున్న వైఎస్సార్ సీపీ నేతలు దేవినేని అవినాష్, జక్కంపూడి రాజా తదితరులు
సాక్షి ప్రతినిధి, విజయవాడ/ వన్‌టౌన్: రౌడీయిజాన్ని అడ్డుకోవాల్సిన పోలీసులే రౌడీలకు కాపలా కాస్తే.. అది కచ్చితంగా విజయవాడ అవుతుంది. సోమవారం శాప్ కార్యాలయం వద్ద యువగళం ప్రతినిధుల పేరుతో గంజాయి, రౌడీ బ్యాచ్‌లు అరాచకం చేస్తుంటే పోలీసులు చోద్యం చూశారు. ఏకంగా పోలీసుల వద్ద లాఠీలు తీసుకుని వైఎస్సార్ సీపీ నేతలపై దాడులకు తెగబడితే వారు అడ్డుకునే ప్రయత్నం కూడా చేయకపోవడంతో విజయవాడ పోలీసులు ప్రభుత్వం చేతిలో ఎలా కీలుబొమ్మలుగా మారారో అర్ధమవుతుంది.
శాంతియుత నిరసనకు పిలుపు
కూటమి ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీలో అడుగడుగున జరిగిన అక్రమాలను సాక్ష్యాధారాలతో సహా వైఎస్సార్ సీపీ ఇటీవల బయటపెట్టింది. క్రీడా కోటాలో కేటాయించిన ఉద్యోగాలు పూర్తిగా అవినీతిమయంగా మారిన వైనాన్ని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పూర్తి సాక్ష్యాలతో మీడియాకు వివరించిన విషయం తెలిసిందే. క్రీడా కోటాలో జరిగిన నియామకాలపై దర్యాప్తు చేయాలని కోరుతూ సోమవారం రెడ్‌సర్కిల్ నుంచి విజయవాడ ఎంజీ రోడ్డులోని ఏపీ క్రీడాప్రాధికార సంస్థ (శాప్) కార్యాలయం వద్ద శాంతియుత నిరసనకు వైఎస్సార్ సీపీ పిలుపునిచ్చింది. ఉమ్మడి కృష్ణా జిల్లానే కాకుండా చుట్టుపక్కల జిల్లాల నుంచి భారీగా యువత, విద్యార్థులు, క్రీడాకారులు విజయవాడలోని శాప్ కార్యాలయానికి పోటెత్తారు.
నిరసన కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ప్రభుత్వం శతవిధాల ప్రయత్నించింది. నిరసనకు అనుమతి లేదంటూ బెదిరింపులకు పాల్పడింది. వివిధ ప్రాంతాల్లో పార్టీ నేతలను అనేక మందిని పోలీసు స్టేషన్లకు తరలించారు.
రౌడీలకు రక్షణగా పోలీసులు
ఎక్కడైనా పోలీసులను చూస్తే రౌడీలు, గంజాయిబ్యాచ్‌లు వంద అడుగులు దూరంలోనే పరుగులు తీస్తుంటారు. కానీ ఇందిరాగాంధీ స్టేడియం వద్ద వైఎస్సార్ సీపీపై దాడి చేయటానికి టీడీపీ ప్రత్యేకంగా కొంతమంది రౌడీలను, గంజాయి బ్యాచ్‌ను, యువగళం నేతలపేరిట కొందరిని తీసుకొచ్చి దాడులు చేయిస్తున్న క్రమంలో పోలీసులు వారికి రక్షణగా నిలబడ్డారు.
టీడీపీ కార్యకర్తలకు ఎలా అనుమతిచ్చారో..
ప్రదర్శనలకు అనుమతి లేదని చెప్పిన పోలీసులు అక్కడ టీడీపీ కార్యకర్తలను ఎలా అనుమతించారో చెప్పాల్సి ఉంటుంది. డీఎస్సీ టీచర్లు కూర్చోవడానికి టెంట్లు, డీజేలకు అనుమతివ్వడం ప్రశ్నార్థకంగా మారింది.
బస్‌పైకి ఎక్కి నిరసన
స్టేడియం వద్ద పార్టీ శ్రేణులను తరలించటానికి పోలీసులు బస్సులను ఏర్పాటు చేశారు. పోలీసులు పార్టీ నేతలపై లాఠీచార్జ్‌కు ఉపక్రమించటంతో నేతలు జక్కంపూడి రాజా, దేవినేని అవినాష్, నాగార్జునయాదవ్, పేర్ని కిట్టు, అంజిరెడ్డి తదితరులు బస్సుపైకెక్కి తమ నిరసనను తెలియజేశారు. బస్సును, పైన ఉన్న నేతలను కృష్ణలంక పోలీసుస్టేషన్‌కు తరలించారు.
ఎన్ని అడ్డంకులు కల్పించినా..!
ఎన్ని అడ్డంకులు కల్పించినా ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు సుధాకరబాబు ఒక్కసారిగా తన అనుచరులతో ఎంజీ రోడ్డు మీదకు చేరుకొని అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి ఊరేగింపుగా బయలుదేరారు. .ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు గౌతంరెడ్డి, నేతలు విశ్వనాథ రవి తదితరులు ఎంజీరోడ్డుకు చేరుకొని కలెక్టర్ కార్యాలయం నుంచి ఊరేగింపుగా స్టేడియం వద్దకు చేరుకున్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రి జోగి రమేష్, తిరువూరు ఇన్‌చార్జి నల్లగట్ల స్వామిదాసు, జగ్గయ్యపేట ఇన్‌చార్జి తన్నీరు నాగేశ్వరరావు, నందిగామ ఇన్ చార్జి మొండితోక జగన్మోహనరావు, ఎమ్మెల్సీలు ఎండీ రుహుల్లా, అరుణకుమార్, మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, రాష్ట్ర అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ ఆసిఫ్, రాష్ట్ర అధికార ప్రతినిధి బండి నాగేంద్రపుణ్యశీల, పోతిన మహేష్, విద్యార్థ్ధి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు.
రౌడీలు, పోలీసుల దాడుల్లో పార్టీ కార్యకర్తలు, నాయకులు, యువకులకు తీవ్రగాయాలయ్యాయి. పోలీసుల లాఠీచార్జ్ కారణంగా కొందరు నాయకులు సైతం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పార్టీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు గౌతంరెడ్డి పోలీసుల తీరుతో తీవ్ర ఒత్తిడికి గురై అపస్మారక స్థితికి చేరుకున్నారు. ఆయనను హుటాహుటిన రమేష్ హాస్పటల్‌కు తరలించారు. భవానీపురానికి చెందిన పార్టీ నేత కరీం సైతం తీవ్ర గాయాలపాలు కావటంతో ఆయనను ఆంధ్రా ఆసుపత్రికి తరలించారు. పార్టీ శ్రేణులను అక్కడి నుంచి పంపించివేయడానికి లాఠీచార్జి చేయాలంటూ ఏడీసీపీ గుణ్ణం రామకృష్ణ మైక్ తీసుకుని ఆదేశించారు. ఏసీపీలు, సీఐలు, ఎస్‌ఐలను అరుస్తూ ఇష్టానుసారం పార్టీ నేతలపై దాడులకు తెగబడ్డారు. వికలాంగులను సైతం పక్కకు తోసివేయడంతో వారు తీవ్ర ఇబ్బందులెదుర్కొన్నారు.
శాప్ కార్యాలయం వద్దకు చేరుకున్న వైఎస్సార్ సీపీ నేతలు శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తుంటే ఒక్కసారిగా టీడీపీ రౌడీమూకలు వారిపై తెగబడ్డారు. విచక్షణారహితంగా చేతులతో కుమ్ముతూ భయకంపితులను చేశారు. అంతేకాకుండా పోలీసుల చేతుల్లో ఉన్న లాఠీలను తీసుకొని ఇష్టమొచ్చినట్లుగా పార్టీ నేతలపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. అంతే కాకుండా వైఎస్సార్ సీపీకి చెందిన వికలాంగుడి వద్ద చేతికర్రలను తీసుకొని వాటితోనూ దాడులకు తెగించారు. అయితే ఇదంతా పోలీసుల సమక్షంలోనే వారి ఆధ్వర్యంలోనే జరిగింది.
డీఎస్సీలో ఉద్యోగాలు పొందిన అభ్యర్థులను కొంతమంది టీడీపీ నేతలు ఒక రోజు ముందుగానే నగరానికి తీసుకువచ్చారు. ఆ ముసుగులో వైఎస్సార్ సీపీపై తెగబడే విధంగా వ్యవహరించాలంటూ ఆదివారం ఒక ఫంక్షన్ హాల్‌లో దిశానిర్దేశం చేశారు. వారితో పాటు పలువురు రౌడీమూకలను సైతం టీడీపీ రంగంలోకి దించింది.


