డ్రగ్స్‌ నియంత్రణకు సమగ్ర చర్యలు | - | Sakshi
Sakshi News home page

డ్రగ్స్‌ నియంత్రణకు సమగ్ర చర్యలు

Sep 22 2026 5:22 AM | Updated on Sep 22 2026 5:22 AM

చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలో మాదకద్రవ్యాల వినియోగం, అక్రమ విక్రయాలను అరికట్టేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్‌ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. సోమవారం తన చాంబర్లో ఎస్పీ వి.విద్యాసాగర్‌ నాయుడుతో కలిసి ఈగల్‌, పోలీస్‌, విద్య, వైద్య తదితర శాఖల అధికారులతో నార్కోటిక్‌ కో–ఆర్డినేషన్‌ కమిటీ సమావేశం నిర్వహించి డ్రగ్స్‌ నియంత్రణ చర్యలపై సమీక్ష చేశారు. కలెక్టర్‌ మాట్లాడుతూ విద్యాశాఖ అధికారులు సాధారణ తనిఖీలతో పాటు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, విద్యార్థుల ప్రవర్తనలో మార్పులు, తరగతులకు గైర్హాజరు, అనుమానాస్పద స్నేహ సంబంధాలు వంటి అంశాలను గమనించాలన్నారు. విద్యార్థుల్లో మాదకద్రవ్యాల వినియోగానికి సంబంధించిన ప్రాథమిక లక్షణాలను గుర్తించిన వెంటనే వారిపై క్రిమినల్‌ చర్యలకు బదులుగా అవసరమైన సందర్భాల్లో కౌన్సెలింగ్‌, డీ–అడిక్షన్‌ సేవలు అందించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. మాదకద్రవ్యాలతో కలిగే దుష్పరిణామాలపై విద్యార్థుల్లో అవగాహన పెంచేందుకు ప్రభావవంతమైన లఘు వీడియోలను రూపొందించి పాఠశాలలు, కళాశాలల్లో ప్రదర్శించే అంశాన్ని పరిశీలించాలన్నారు. ఎస్పీ వి.విద్యాసాగర్‌ నాయుడు మాట్లాడుతూ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులను మాదకద్రవ్యాల బారిన పడకుండా కాపాడేందుకు పాఠశాలలు, కళాశాలల పరిసర ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సమావేశంలో డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ డెప్యూటీ డైరెక్టర్‌ బడేటి సత్య ప్రకాష్‌, అదనపు ఎస్పీ వి.వి.నాయుడు, స్పెషల్‌ బ్రాంచ్‌ సీఐ సత్యకిషోర్‌, వ్యవసాయ శాఖ జేడీ జ్యోతి రమణి, విద్య, వైద్య, పోలీస్‌, ఈగల్‌ బృందాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement