● ఆగ్రహం వ్యక్తం చేసిన రామనపూడి గ్రామ రైతులు
గుడివాడరూరల్: చంద్రబాబునాయుడు ప్రభుత్వం తమను చులకనగా చూస్తోందని, తమ గురించి పట్టించుకోవటం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే... మండలంలోని రామనపూడి గ్రామంలో సాగునీరు లేక పంట పొలాలు ఎండిపోతున్నాయని సోమవారం సాయంత్రం గ్రామంలోని పంట పొలాల వద్ద రైతులు ఆందోళన చేశారు.
ఎండి పోతున్న పంట పొలాలను చూపించి తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇప్పటికే ఎకరాకు రూ.30 వేలకు పైగా ఖర్చు పెట్టి వరిసాగు చేశామని వాపోయారు. గ్రామానికి చెందిన రైతులు మసిముక్కు సత్యనారాయణ యాదవ్, గొరిపర్తి నానీబాలాజీ మాట్లాడుతూ రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం వెంటనే ఎకరాకు రూ.25వేలు నష్టపరిహారం ప్రకటించాలని, లేనిపక్షంలో పోరాటం తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన పలువురు రైతులు పాల్గొన్నారు.


