సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు

Sep 22 2026 5:22 AM | Updated on Sep 22 2026 5:22 AM

సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు

దసరా మహోత్సవాలు ఘనంగా నిర్వహించాలి ఏఐ సాంకేతికతతో భక్తుల భద్రతకు భరోసా సమీక్ష సమావేశంలో దేవదాయ శాఖ కార్యదర్శి కె.కన్నబాబు

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): ఇంద్రకీలాద్రిపై అక్టోబర్‌ 10 నుంచి ప్రారంభమయ్యే దసరా మహోత్సవాలను గతంలో కంటే ఘనంగా, అన్ని శాఖల సమన్వయంతో భక్తుల కోసం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు దేవదాయ శాఖ కార్యదర్శి కె.కన్నబాబు తెలిపారు. ఏఐ సాంకేతికతను అనుసంధానం చేసి భక్తుల భద్రతకు మరింత భరోసా కల్పించడంతో పాటు, ఆధ్యాత్మిక వాతావరణంలో అమ్మవారి దర్శనం త్వరగా, సౌకర్యవంతంగా లభించేలా పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. సోమవారం కలెక్టరేట్‌ ఏవీఎస్‌ రెడ్డి హాల్‌లో జరిగిన సమీక్ష సమావేశంలో కె.కన్నబాబు, కలెక్టర్‌ జి.లక్ష్మీశ, సీపీ రాజశేఖరబాబు, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్‌ ధ్యానచంద్ర, దేవదాయ శాఖ కమిషనర్‌ కె.రామచంద్రమోహన్‌, దుర్గగుడి ఈవో వీకే శీనా నాయక్‌ తదితరులు పాల్గొన్నారు. ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకుంటూ చేస్తున్న ఏర్పాట్లపై చర్చించారు. ఏఐ ఆధారిత ప్రత్యేక మొబైల్‌ అప్లికేషన్‌, అందుబాటులో ఉన్న సేవలను పరిశీలించారు. క్యూలో భక్తులకు అమ్మవారి దర్శనానికి ఎంత సమయం పడుతుందో ఎప్పటికప్పుడు తెలియజేసేలా ప్రతి 200 మీటర్లకు చేస్తున్న ఏర్పాట్లతో పాటు డిజిటల్‌ స్క్రీన్లు, ఏఐ కెమెరాలు, డ్రోన్ల సేవలు తదితరాలపై చర్చించారు. 22 పార్కింగ్‌ ప్రాంతాలతో మూడు హోల్డింగ్‌ ఏరియాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకునేలా చేస్తున్న ఏర్పాట్లతో పాటు స్మార్ట్‌ లడ్డూ వెండింగ్‌ మెషీన్ల ఏర్పాటుపైనా చర్చించారు.

వసతులపై ప్రత్యేక దృష్టి

ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని క్యూలు, దర్శన మార్గాలు, తాగునీరు, మరుగుదొడ్లు, వైద్య సేవలు, పారిశుద్ధ్యం, రవాణా తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఉచిత దర్శనాల విషయంలో భక్తులకు ఇబ్బంది కలగ కుండా ఏర్పాట్లు చేయడంతో పాటు, భక్తులకు ప్రసాదాల పంపిణీకి అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. భక్తుల భద్రత, సౌకర్యాల విషయంలో ఎక్కడా లోటుపాట్లు లేకుండా నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. దుర్గాఘాట్‌ సమీపంలో 24 గంటలు పనిచేసే కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసి.. క్షేత్రస్థాయి నుంచి అందే సమాచారాన్ని సమన్వయం చేస్తూ, తక్షణమే స్పందించేలా సిబ్బందిని అందుబాటులో ఉంచాలన్నారు. సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వీఐపీ, ప్రొటోకాల్‌ దర్శనాలు, జనరల్‌ పబ్లిక్‌కు ప్రత్యేక దర్శనాలకు చేస్తున్న ఏర్పాట్లు, వివిధ రకాల పాస్‌ల జారీ, విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధులకు బ్యాటరీ వాహనాల ఏర్పాటు, అన్న ప్రసాదం, లడ్డూ ప్రసాదం పంపిణీ తదితరాలకు చేస్తున్న ఏర్పాట్లను ఆలయ అధికారులు వివరించారు. ఇతర ఏర్పాట్లను కలెక్టర్‌ లక్ష్మీశ వివరించారు. మొత్తంమీద 20 లక్షల వరకు భక్తులు వచ్చినా ఏ ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సమావేశంలో వైదిక కమిటీ సభ్యులు ఎల్‌.దుర్గా ప్రసాద్‌, కె.రవికుమార్‌, ఆలయ ఈఈలు ఎల్‌.రమాదేవి, బి.రాంబాబు, డీవీ భాస్కర్‌, ఏఈవో ఎన్‌.రమేష్‌ బాబు, డా. కె.గంగాధర్‌, పి.చంద్రశేఖర్‌, వీఎంసీ చీఫ్‌ఇంజినీర్‌ పి.సత్యకుమారి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement