విద్య, వైద్యం ఇక ప్రైవేట్‌కే | Cabinet approves draft bill 2026 | Sakshi
Sakshi News home page

విద్య, వైద్యం ఇక ప్రైవేట్‌కే

Aug 7 2026 5:16 AM | Updated on Aug 7 2026 5:16 AM

Cabinet approves draft bill 2026

పీపీపీ విధానంలో మౌలిక వసతులు 

ముసాయిదా బిల్లు–2026కు కేబినెట్‌ ఆమోదం 

మహిళలు, చిన్నారులపై జరిగే నేరాలపై వేగవంతమైన విచారణకు ఉద్దేశించిన ‘దిశ’ బిల్లు ఉపసంహరణకు పచ్చజెండా 

టీడీపీ కార్యాలయాలకు 2 జిల్లాల్లో మరో 4 ఎకరాలు  

గుంటూరు జిల్లా మోతడకలో రైల్వే లైన్‌ కోసం ల్యాండ్‌ పూలింగ్‌లో 2,344.12 ఎకరాలు 

శాసనసభ, హైకోర్టు భవనాల కన్సల్టెన్సీ ఫీజుల కింద రూ.206.59 కోట్లకు ఓకే 

మీడియాకు మంత్రి పార్థసారథి వెల్లడి      

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం ప్రజలకు విద్య, వైద్యం అందించాల్సిన సామాజిక బాధ్యత నుంచి  తప్పుకొని ప్రైవేట్‌కు అప్పగిస్తోంది. ఇందుకోసం ఏకంగా ప్రభుత్వ ప్రైవేట్‌ భాగస్వామ్య (పీపీపీ) విధానం చట్టం తేవాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన గురువారం సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశం పీపీపీ విధానం – 2026 ముసాయిదా బిల్లుకు ఆమోదం తెలిపింది. మంత్రివర్గం నిర్ణయాలను సమాచార శాఖ మంత్రి కె.పార్థసారథి అనంతరం మీడియాకు వెల్లడించారు. 

రవాణా, లాజిస్టిక్స్, పోర్టులు, విమానాశ్రయాలు, పట్టణ మౌలిక వసతులు, వైద్యం, విద్య, పారిశ్రామికాభివృద్ధి, పునరుత్పాదక ఇంధనం, పర్యాటకం తదితర రంగాల్లో భారీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ఈ నూతన పాలసీని తీసుకొస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో రూ.1.23 లక్షల కోట్ల విలువైన పీపీపీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల పైప్‌లైన్‌లో ఉండగా ప్రైవేట్‌ పెట్టుబడిదారులను ఆకర్షించి వేగంగా పట్టాలెక్కించేందుకు వయబిలిటీ గ్యాప్‌ ఫండింగ్‌ (వీజీఎఫ్‌)పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రూ.1,500 కోట్లను కేటాయించిందని తెలిపారు. కేబినెట్‌లో తీసుకున్న ఇతర నిర్ణయాలు ఇలా.. 

» మహిళలు, చిన్నారులపై జరిగే నేరాలపై వేగవంతమైన దర్యాప్తు, విచారణ నిమిత్తం గతంలో రాష్ట్రపతి ఆమోదం కోసం పంపిన ఆంధ్రప్రదేశ్‌ దిశ బిల్లు క్రిమినల్‌ లా (ఆంధ్రప్రదేశ్‌ సవరణ) బిల్లు, 2019 ఉపసంహరణకు ఆమోదం.  
» శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి మండలం కప్పలబండలో, అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం వలసపల్లెలో  2 ఎకరాల భూమి చొప్పున తెలుగుదేశం పార్టీ  కార్యాలయాల నిర్మాణం కోసం ఏడాదికి రూ.1,000 లీజు చొప్పున 99 ఏళ్లు అప్పగించేందుకు ఆమోదం.  
» శాసనసభ, హైకోర్టు భవనాల కోసం కన్సల్టెన్సీ ఫీజుల కింద రూ.206.59 కోట్లు చెల్లించేందుకు సవరించిన పాలనా అనుమతికి ఆమోదం.  
» 2026–27లో రైతులకు యాన్యుటీల చెల్లింపు కోసం ఆంధ్రప్రదేశ్‌ పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ నుంచి రూ.300 కోట్ల రుణాన్ని పొందేందుకు సీఆర్‌డీఏ కమిషనర్‌కు ఆమోదం. 
» రాజధానిలో ‘అమరావతి ఐ’ అభివృద్ధి టెండర్‌ తిరిగి పిలిచేందుకు అనుమతి.  
» రెండో దశ భూ సమీకరణ కింద పల్నాడు జిల్లా వైకుంఠపురంలో దేవదాయ ఈనాం భూముల వివాదాలను పరిష్కరించేందుకు రూ.122.20 కోట్ల పరిహారం చెల్లించేందుకు ఆమోదం. 
» 2027 గోదావరి పుష్కరాల్లో 238 స్నాన ఘట్టాల పనుల కోసం రూ.210.06 కోట్లతో పరిపాలనా అనుమతికి ఆమోదం.   
» గుంటూరు జిల్లా తాడికొండ మండలం మోతడకలో 2,344.12 ఎకరాల భూమిలో, ఎర్రుపాలెం – నంబూరు మధ్య కొత్త బ్రాడ్‌ గేజ్‌  రైల్వే లైన్, ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌  కోసం గ్రామసభ తీర్మానానికి అనుగుణంగా ల్యాండ్‌ పూలింగ్‌ స్కీమ్‌ చేపట్టేందుకు సీఆర్‌డీఏ కమిషనర్‌కు అనుమతి.  
» శ్రీసత్యసాయి జిల్లా పరిధిలో హంద్రీనీవా సుజల స్రవంతి రెండో దశ  కింద 400.500 కి.మీ నుండి 485.300 కి.మీ వరకు ప్రధాన కాలువకు సంబంధించి మిగిలిపోయిన ఐదు పనులకు రూ. 600.48 కోట్ల అంచనా వ్యయంతో పరిపాలనా అనుమతి మంజూరు.   
» అమరావతి క్వాంటమ్‌ వ్యాలీ టెక్‌ పార్క్‌లోని క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ సెంటర్‌కు ఇరువైపులా ట్విన్‌ ఆఫీస్‌ టవర్స్‌ నిర్మాణాన్ని ఎల్‌–1 బిడ్డర్‌కు ఇచ్చేందుకు ఆమోదం.  
» ఏపీ బల్క్‌ డ్రగ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌.. హడ్కో మంజూరు చేసిన రూ.680.21 కోట్లు టర్మ్‌ రుణం పొందేందుకు ఆమోదం. 
» రాష్ట్రంలో పరిశ్రమల స్థాపన, వాణిజ్య కార్యకలాపాల నిర్వహణను మరింత సులభతరం చేసేందుకు ఆంధ్రప్రదేశ్‌ ఆమ్‌నిబస్‌ (ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌) చట్టం, 2026 రూపకల్పనకు ఆమోదం.  
» ఆక్వా కల్చర్‌ ఫామ్‌లకు యూనిట్‌ రూ.1.50 చొప్పున విద్యుత్‌ రాయితీ 01.06.2026 నుంచి పొడిగించేందుకు ఆమోదం.  
»  నూతన జిల్లాల పరిధికి అనుగుణంగా పట్టణాభివృద్ధి ప్రాధికార సంస్థలను పునర్వ్యవస్థీకరించేందుకు ఆమోదం. దీంతో పట్టణాభివృద్ది సంస్ధలు 21 నుంచి 23కు పెరగనున్నాయి.  
»  నూతన జిల్లాలకు అనుగుణంగా 15 జిల్లా విద్యాశాఖాధికారి పోస్టులను సృష్టించడానికి ఆమోదం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement