వృద్ధురాలి నుంచి రూ.1.43 కోట్లు కాజేసిన కేటుగాళ్లు
బందరు పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు
కోనేరు సెంటర్ (మచిలీపట్నం):‘మేం ఢిల్లీ పోలీసులం. ఈడీ అధికారులం. సుప్రీంకోర్టు జడ్జి విచారణజరుపుతున్నారు. మీపై డిల్లీలో బ్యాంకు లావాదేవీలకు సంబంధించి నేరం మోపబడింది. కేసు సైతం నమోదైంది. ఇక మీరు తప్పించుకోలేరు. మేం చెప్పినట్లు చేస్తే కేసు నుంచి తప్పుకునేందుకు అవకాశం ఉంటుంది. లేదంటే మీ ఆస్తులు సీజ్ చేసి జైలుకు పంపిస్తాం’ అంటూ సైబర్ నేరగాళ్లు కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన ఓ వృద్ధురాలిని బెదిరించి భారీ మొత్తంలో సొమ్ము కాజేశారు.
మోసపోయామని తెలుసుకున్న బాధితురాలు గురువారం మచిలీపట్నం పోలీసులను ఆశ్రయించి న్యాయం చేయాలని వేడుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పరాసుపేటకు చెందిన వెంపటి అలవేలు మంగమ్మకు జూన్ 10న గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్‌చేసి ఆమెపై ఢిల్లీలో మనీ లాండరింగ్ కేసు నమోదైందని బెదిరించారు.
ఢిల్లీలోని కెనరా బ్యాంకు ఖాతా ద్వారా పెద్ద మొత్తంలో అక్రమంగా లావాదేవీలు జరిగినట్లు చెప్పారు. ఆమెపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు కాగా అరెస్ట్ వారెంట్ జారీ అయినట్లు నమ్మించారు. కేసు సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోందని వీడియో కాల్స్ చేసి చూపించారు. ఈ కేసును సుప్రీంకోర్టు జడ్జి విచారిస్తున్నట్లు ఫేక్ ఫొటో చూపించి నమ్మించారు. ఈ కేసు నుంచి బయటపడాలంటే జరిగిన విషయం ఇతరులకు చెప్పకుండా తాము చెప్పినట్లు చేయాలని కోరారు. ఆమె ఖాతాలో ఉన్న రూ.1,43,50,000ను ఆర్‌టీజీఎస్ ద్వారా వారి ఖాతాల్లోకి జమ చేయించుకున్నారు.
అక్కడితో ఆగకుండా జూలై చివరిలో మరో రూ.95 లక్షలు చెల్లిస్తే కేసు నుంచి పూర్తిగా తప్పుకునేలా చేస్తామని.. లేదంటే ఉన్న ఆస్తులన్నింటిని సీజ్ చేస్తామని హెచ్చరించారు. దీంతో అనుమానం వచ్చిన బాధితురాలు జరిగిన విషయాన్ని అమెరికాలో ఉన్న తన కుమారుడికి చెప్పింది. విషయం తెలుసుకున్న కొడుకు ఇదంతా సైబర్ నేరగాళ్ల పనేనని వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయమని సూచించాడు. దీంతో బాధితురాలు మచిలీపట్నం పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై జగదీష్ తెలిపారు.


