దగా డీఎస్సీపై దండయాత్ర | YSRCP protests at Collectorates across the state | Sakshi
Sakshi News home page

దగా డీఎస్సీపై దండయాత్ర

Aug 1 2026 5:38 AM | Updated on Aug 1 2026 5:41 AM

YSRCP protests at Collectorates across the state

తిరుపతిలో కలెక్టర్‌కు వినతిపత్రం అందజేస్తున్న వైఎస్సార్‌సీపీ నేతలు

రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద వైఎస్సార్‌సీపీ నిరసనలు

కలెక్టర్లు, జేసీలకు వినతిపత్రాలు అందజేసిన పార్టీ నేతలు 

డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలి.. అవకతవకలకు నైతిక 

బాధ్యత వహిస్తూ మంత్రి లోకేశ్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌  

డీఎస్సీలో నిజాలు నిగ్గు తేలే వరకు ఉద్యమం కొనసాగుతుందని స్పషీ్టకరణ 

ఆగస్టు 3, 4 తేదీల్లో నియోజకవర్గ స్థాయిలో టౌన్‌హాల్‌ మీటింగ్స్‌  

సాక్షి, అమరావతి: డీఎస్సీ–2025 నియామకాల్లో జరిగిన అక్రమాలు, పేపర్‌ లీకేజీ ఆరోపణలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ రాజీనామా చేయాలని, ఈ వ్యవహారంపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని, అన్యాయానికి గురైన అర్హులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ వైఎస్సార్‌సీపీ రాష్ట్రవ్యాప్తంగా పోరాట కార్యక్రమాలు ప్రారంభించింది. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు శుక్రవారం అన్ని జిల్లాల్లో పార్టీ నేతలు కలెక్టరేట్లకు తరలివెళ్లి నిరసన వ్యక్తంచేశారు. అనంతరం కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లు, డీఆర్వోలకు వినతిపత్రాలు అందజేశారు. 

డీఎస్సీ నియామకాల్లో ప్రశ్నపత్రాల లీకేజీ, అడ్డగోలుగా స్పోర్ట్స్‌ కోటా నియామకాలు, నిబంధనల మార్పు, జీవోల మార్పులతో సహా వైఎస్సార్‌సీపీ నాయకులు, బాధిత అభ్యర్థులు ఆధారాలతో సహా వెల్లడిస్తున్న అక్రమాలపై స్వతంత్ర సంస్థతో నిష్పక్షపాతంగా విచారణ జరిపి వాస్తవాలను బయటపెట్టాలని కోరారు. డీఎస్సీ నియామకాలు పారదర్శకంగా జరిగాయని ప్రభుత్వం చెబుతున్నప్పుడు సీబీఐ విచారణకు ఎందుకు వెనుకాడుతోందని ప్రశ్నించారు. డీఎస్సీ నియామకాల్లో అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. డీఎస్సీతోపాటు విద్యార్థులు, నిరుద్యోగ యువత సమస్యలను కూడా వైఎస్సార్‌సీపీ నేతలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. 

పెండింగ్‌లో ఉన్న విద్యాదీవెన, వసతిదీవెన, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ప్రతి నిరుద్యోగికి నెలకు రూ.3వేల నిరుద్యోగ భృతిని చెల్లించాలని డిమాండ్‌ చేశారు. విద్యార్థులు, నిరుద్యోగ యువతకు న్యాయం జరిగే వరకు రాష్ట్రవ్యాప్తంగా పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఉద్యమంలో భాగంగా వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఆగస్టు 3, 4 తేదీల్లో నియోజకవర్గ స్థాయిలో టౌన్‌హాల్‌ మీటింగ్స్‌ నిర్వహించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement