మహిళల్లో వయసుతో సంబంధం లేకుండా సాధారణంగా కనిపించే సమస్య థైరాయిడ్. ఈ సమస్యను సహజంగా నియంత్రించడంలో సేతు బంధాసన (Setu Bandhasana) చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ‘సేతు’ అంటే వంతెన, ‘బంధ’ అంటే బంధించడం.. ఈ ఆసనంలో శరీరం వంతెన ఆకారంలో ఉండి, గొంతు, మెడ ప్రాంతంపై మృదువైన ఒత్తిడి పడుతుంది. దీని వల్ల థైరాయిడ్ గ్రంథికి రక్త ప్రసరణ మెరుగుపడి, హార్మోన్ల విడుదల సమతుల్యతకు సహాయపడుతుంది. అలాగే ఛాతీ తెరుచుకోవడం వల్ల శ్వాస లోతుగా మారి, ఒత్తిడి తగ్గుతుంది.
ఉపయోగాలు..
థైరాయిడ్ గ్రంథికి రక్త ప్రసరణ పెరుగుతుంది.
హార్మోన్ల అసమతుల్యతను నియంత్రిస్తుంది.
మెటబాలిజం మెరుగై, రువు పెరుగుదల తగ్గుతుంది.
గొంతు, మెడ ప్రాంతం బలపడుతుంది.
అలసట, నిద్రలేమి తగ్గుతాయి.
ఒత్తిడి, ఆందోళన తగ్గించి మనసుకు ప్రశాంతత ఇస్తుంది.
ఎండోక్రైన్ సిస్టమ్ సక్రమంగా పనిచేయడానికి సహాయపడుతుంది.
వెన్ను, నడుము నొప్పులకు ఒక వరం.
జాగ్రత్తలు..
మెడ నొప్పి, వెన్నెముక సమస్యలు ఉన్నవారు డాక్టర్, యోగా గురువు సలహాతో చేయాలి.
గర్భధారణ సమయంలో ఈ ఆసనం చెయ్యొద్దు.
తీవ్రమైన నడుము నొప్పి లేదా స్లిప్ డిస్క్ ఉన్నవారు చెయ్యకపోడం మంచిది.
చేసే విధానం..
స్టెప్ 1: ముందుగా వెల్లకిలా (వెనుక భాగం వెనుకకు ఆనించి) పడుకోవాలి.
స్టెప్ 2: రెండు మోకాళ్లను మడిచి, పాదాలను నేలపై నడుముకు దగ్గరగా ఉంచాలి. చేతులను శరీరానికి పక్కన, అరచేతులు నేలను తాకుతూ ఉండాలి.
స్టెప్ స్టెప్ 3: గాలి పీల్చుకుంటూ, నెమ్మదిగా నడుమును పైకి లేపాలి.
స్టెప్ 4: భుజాలను, చేతులను, పాదాలను బలంగా నేలపై ఆనించి, మీ ఛాతిని గడ్డం వైపు తీసుకురావాలి. ఈ స్థితిలో 15–30 సెకండ్లు సాధారణ శ్వాసతో ఉండాలి.
స్టెప్ 5: శ్వాస విడిచే సమయంలో నెమ్మదిగా నడుమును కిందకు దించి వెన్నెముకను నేలపైకి తీసుకువచ్చి, విశ్రాంతి తీసుకోవాలి.
– పాతర్ల అనిత, యోగాట్రైనర్


