‘వెలిగొండ’నూ కొట్టేద్దాం! | Chandrababu Govt preparing for another credit theft with Veligonda Project | Sakshi
Sakshi News home page

‘వెలిగొండ’నూ కొట్టేద్దాం!

Jan 26 2026 5:15 AM | Updated on Jan 26 2026 5:48 AM

Chandrababu Govt preparing for another credit theft with Veligonda Project

వెలిగొండ జంట సొరంగాలు

ప్రాజెక్టును పూర్తి చేయకపోయినా మరో క్రెడిట్‌ చోరీకి సిద్ధమవుతున్న చంద్రబాబు

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలోనే రికార్డు సమయంలో రెండు టన్నెల్స్‌ పనులన్నీ పూర్తి 

కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ రూ.1,046.46 కోట్లు వ్యయం  

దశాబ్దాల కల సాకారం చేస్తూ ప్రాజెక్టు పనులను పరుగులెత్తించిన వైఎస్‌ జగన్‌

శ్రీశైలంలో నీటిమట్టం 841 అడుగులకు చేరగానే సొరంగాల ద్వారా నీటిని తరలించడానికి లైన్‌ క్లియర్‌ 

అయినా నల్లమలసాగర్‌కు నీటిని తరలించడంలో చంద్రబాబు సర్కారు ఘోర వైఫల్యం 

కృష్ణా జలాలు అందుతాయన్న ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్‌ జిల్లాల ప్రజల ఆశలు అడియాశలు

కేవలం రూ.992 కోట్లతో పునరావాసం కల్పించి ఉంటే 2025 ఖరీఫ్‌ సీజన్‌లోనే నల్లమల సాగర్‌కు కృష్ణమ్మ 

వైఎస్‌ జగన్‌కు మంచి పేరొస్తుందనే దుర్బుద్ధితో నిర్వాసితులకు పునరావాసం కల్పించని వైనం 

త్వరలో సందర్శనకు సన్నద్ధం.. జగన్‌ కృషినంతా తన ఖాతాలో వేసుకునే యత్నం 

ఆది నుంచి సీఎం చంద్రబాబు తీరు ఇంతే అంటున్న సాగు నీటి రంగ నిపుణులు

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు మరో క్రెడిట్‌ చోరీకి సిద్ధమవుతున్నారు. విశాఖలో డేటా సెంటర్, భూముల సమగ్ర రీ సర్వే, గత ప్రభుత్వం చేపట్టిన ఇతరత్రా కార్యక్రమాలను తన ఖాతాలో వేసుకోవడానికి పాట్లు పడుతున్న ఆయన చూపు తాజాగా ‘వెలిగొండ’ ప్రాజెక్టుపై పడింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలోనే రికార్డు సమయంలో రెండు టన్నెల్స్‌ పనులన్నీ పూర్తయినప్పటికీ, నల్లమలసాగర్‌కు నీటిని తరలించడంలో ఘోరంగా విఫలమైన చంద్రబాబు సర్కారు.. ఇప్పుడు గత ప్రభుత్వం కృషినంతటినీ తన ఘనతగా చెప్పుకునేందుకు సన్నద్ధమవుతోంది. త్వరలో సీఎం చంద్రబాబు వెలిగొండ సందర్శించి.. పూర్తయిన పనులన్నీ తన ఘనతేనని చాటుకునేందుకు సిద్ధమైపోయారు. 

వాస్తవానికి దశాబ్దాల స్వప్నం వెలిగొండ సాకారమైందని.. శ్రీశైలం నుంచి జంట సొరంగాల ద్వారా కృష్ణా జలాలు నల్లమలసాగర్‌కు చేరడంతో తమ కష్టాలు కడతేరుతాయనుకున్న ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం, వైఎస్సార్‌ జిల్లాల ప్రజల ఆశలను చంద్రబాబు ప్రభుత్వం అడియాశలు చేసింది. ఈ ప్రాజెక్టులో అత్యంత సంక్లిష్టమైన జంట సొరంగాలను (ఆసియాలోనే అతి పొడవైనవి) రికార్డు సమయంలో నాటి సీఎం వైఎస్‌ జగన్‌ పూర్తి చేసి.. 2024 మార్చి 6న జాతికి అంకితం చేశారు. నల్లమలసాగర్‌లో ముంపునకు గురయ్యే 11 గ్రామాల్లోని 7,321 నిర్వా­సిత కుటుంబాలకు పునరావాసం కల్పించడానికి 20­24 నాటికే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కాలనీలను సిద్ధం చేసింది. 

వన్‌ టైమ్‌ సెటిల్‌మెంట్‌ కింద నిర్వాసితులకు పరిహారం చెల్లించి, రూ.992 కోట్లు వ్యయం చేసి, పునరావాసం కల్పించి 2024 సీజన్‌లో శ్రీశైలం ప్రాజెక్టులో నీటిమట్టం 841 అడుగులకు చేరగానే సొరంగాల ద్వారా కృష్ణా జలాలను నల్లమలసాగర్‌కు తరలించి, దుర్భిక్ష ప్రాంతాలను సుభిక్షం చేయడానికి ప్రణాళికను సిద్ధం చేసింది. కేవలం వైఎస్‌ జగన్‌కు మంచి పేరొస్తుందనే దుర్బుద్ధితోనే నల్లమలసాగర్‌ నిర్వాసిత కుటుంబాలకు 20 నెలలుగా పునరావాసం కల్పించకుండా చంద్రబాబు సర్కార్‌ జాప్యం చేస్తోందని సాగు నీటి రంగ నిపుణులు, రైతులు, రైతు సంఘాల నేతలు ఆక్షేపిస్తున్నారు. వెలిగొండ ప్రాజెక్టుపై ఆది నుంచి సీఎం చంద్రబాబుకు ఉన్న కపట ప్రేమ మరోసారి నిరూపితమైందని ఎత్తిచూపుతున్నారు. శ్రీశైలం ప్రాజెక్టులోకి 2024–25లో 1,439 టీఎంసీలు, 2025–26లో 1,936.79 టీఎంసీల ప్రవాహం వచ్చి.. ప్రకాశం బ్యారేజీ మీదుగా సముద్రంలోకి 2024–25­లో 848.96 టీఎంసీలు, 2025–26లో 1,652.12 టీఎంసీలు కలిశాయని ఎత్తి చూపుతున్నారు.  

టీడీపీ హయాంలో నాసిరకంగా పనులు 
వైఎస్సార్‌సీపీ సర్కార్‌ తయారు చేసిన ప్రణాళిక ప్రకారం నిర్వాసితులకు పునరావాసం కల్పించి ఉంటే.. 2025 ఖరీఫ్‌ సీజన్‌లో కృష్ణా వరద జలాలను వెలిగొండ జంట సొరంగాల ద్వారా ఒడిసిపట్టి.. నల్లమలసాగర్‌కు తరలించి ఉంటే తమ ప్రాంతాలు సుభిక్షం అయ్యేవని రైతులు స్పష్టం చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి జంట సొరంగాల ద్వారా నల్లమలసాగర్‌ను అనుసంధానం చేసే ఫీడర్‌ ఛానల్‌ పనులు 2004 నుంచి 2014 మధ్య చేయగా, మిగిలిన పనులను 2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వం అత్యంత నాసిరకంగా చేసింది. దీంతో 2025లో కురిసిన భారీ వర్షాలకు టీడీపీ సర్కార్‌ పనులు చేసిన ప్రాంతాల్లో ఫీడర్‌ చానల్‌ కోతకు గురైంది. ఫలితంగా ఇప్పుడు ఫీడర్‌ ఛానల్‌ బలహీనంగా ఉన్న చోట్ల రిటైనింగ్‌ వాల్, మిగతా ప్రాంతాల్లో కాంక్రీట్‌ లైనింగ్‌ చేసే పనులను రూ.456 కోట్లతో చేపట్టి.. వాటిని అస్మదీయ కాంట్రాక్టర్‌కు కట్టబెట్టడం గమనార్హం.   

వెలిగొండ టన్నెల్స్‌ నుంచి నల్లమలసాగర్‌కు నీటిని తరలించే కాలువ 

చంద్రబాబు సర్కార్‌ దోపిడీని కడిగేసిన కాగ్‌  
ఎన్‌టీఆర్‌కు 1995లో వెన్నుపోటు పొడిచి అధికారాన్ని చేజిక్కించుకున్నాక.. 1996 లోక్‌సభ ఎన్నికల రూపంలో ఎదురైన తొలి గండాన్ని గట్టెక్కేందుకు ఆ ఏడాది మార్చి 5న గొట్టిపడియ వద్ద నాటి సీఎం చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత 1995 నుంచి 2004 వరకు ఈ ప్రాజెక్టు కోసం వెచ్చించింది కేవలం రూ.పది లక్షలు మాత్రమే. అదీ శంకుస్థాపన సందర్భంగా నిర్వహించిన సభ ఏర్పాట్లు, ఖర్చుల కోసం వ్యయం చేశారు. అప్పట్లో చంద్రబాబు పనులు చేపట్టి ఉంటే.. తెలుగుగంగ ప్రాజెక్టుకు కేడబ్ల్యూడీటీ (కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్‌)–2 నీటిని కేటాయించినట్లే వెలిగొండ ప్రాజెక్టుకు నీటి కేటాయింపులు చేసి ఉండేదని సాగు నీటి రంగ నిపుణులు ఎత్తి చూపుతున్నారు. విభజన నేపథ్యంలో 2014లో మళ్లీ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. ప్రజాధనాన్ని దోచుకోవడానికి వెలిగొండ ప్రాజెక్టును ప్రయోగశాలగా మార్చుకున్నారు. 

2014 నుంచి 2019 వరకు రూ.1,414.51 కోట్లు ఖర్చు చేసినా, పనుల్లో ఏమాత్రం ప్రగతి కన్పించక పోవడమే చంద్రబాబు సర్కార్‌ చేసిన దోపిడీకి నిదర్శనం. జీవో–22 (ధరల సర్దుబాటు), జీవో 63 (పనుల పరిమాణం ఆధారంగా బిల్లుల చెల్లింç­³#)ను వర్తింపజేసి.. కాంట్రాక్టర్లకు ఉత్తినే రూ.630.57 కోట్లు  దోచిపెట్టారు. 2017 నాటికే వెలి­గొండను పూర్తి చేస్తామని ప్రకటించి.. టీబీఎం (టన్నెల్‌ బోరింగ్‌ మెషీన్‌)ల మరమ్మతుల కోసం కాంట్రాక్టర్లకు రూ.66.44 కోట్లను ఇచ్చేసి, కమీషన్లు వసూలు చేసుకున్నారు. మరమ్మతు చేయకపోవడం వల్ల టీబీఎంలు ఎందుకూ పనికి రాకుండా పోవడమే అందుకు నిదర్శనం. 2017, 2018, 2019 నాటికి పూర్తి చేస్తామంటూ ఎప్పటికప్పుడు చెబుతూ వచ్చారు. వెలిగొండ ప్రాజెక్టులో చంద్రబాబు దోచేయడాన్ని కం్రప్టోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) కడిగి పారేసింది.  


ఇంజినీరింగ్‌ అద్భుతం.. నల్లమలసాగర్‌  
ప్రకాశం జిల్లాలో విస్తరించిన నల్లమల పర్వత శ్రేణులకు సమాంతరంగా వెలుపల ఉన్న కొండలను వెలిగొండలు అంటారు. వెలిగొండ శ్రేణుల్లో సుంకేశుల, కాకర్ల, గొట్టిపడియ వద్ద కొండల మధ్య ఖాళీ ప్రదేశాల(గ్యాప్‌)ను కలుపుతూ 373.5 మీటర్ల పొడవు, 63.65 మీటర్ల ఎత్తుతో సుంకేశుల డ్యామ్‌.. 587 మీటర్ల పొడవు, 85.9 మీటర్ల ఎత్తుతో గొట్టిపడియ డ్యామ్‌.. 356 మీటర్ల పొడవు, 57 మీటర్ల ఎత్తు­తో కాకర్ల డ్యామ్‌లు నిర్మించడంతో నల్లమల పర్వత శ్రేణులు, వెలిగొండ కొండల మధ్య 62.40 చదరపు కిలోమీటర్ల ప్రదేశంలో 53.85 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో నల్లమలసాగర్‌ సహజ సిద్ధంగా రూపు దిద్దుకుంది. 

ఇదో ఇంజినీరింగ్‌ అద్భుతమని సాగు నీటి రంగ నిపుణులు ప్రశంసిస్తున్నారు. నల్లమలసాగర్‌ పనులను మహానేత వైఎస్‌ పూర్తి చేశారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కొల్లంవాగు ద్వారా రోజుకు 11,583 క్యూసెక్కులు తరలించేలా కొల్లంవాగు కుడి వైపున ఉన్న కొండను తొలచి, రెండు సొరంగాలు (టన్నెల్‌–1 ద్వారా 3001 క్యూసెక్కులు, టన్నెల్‌–2 ద్వారా 8,582 క్యూసెక్కులు) తవి్వ.. ఫీడర్‌ ఛానల్‌ ద్వారా నల్లమలసాగర్‌కు కృష్ణా జలాలను తరలిస్తారు. వెలిగొండ ప్రాజెక్టులో 18.8 కి.మీల పొడవున తవి్వన రెండు సొరంగాలు ఆసియా ఖండంలోనే అతి పెద్ద నీటి పారుదల సొరంగాలు కావడం గమనార్హం.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement