‘‘టీమ్ 11 ముఖం చూసి ఎవరైనా పెట్టుబడులు పెడతారా? మేము పెట్టుబడులు తెస్తుంటే ఏడుస్తున్నారు...’’
-ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు, మంత్రి లోకేశ్ వ్యాఖ్య..
‘‘దావోస్ వెళ్లింది పెట్టుబడుల కోసమా? లేక చెత్త ఏడుపు గొట్టు రాజకీయం చేయడానికా? అదేదో ఇక్కడే చేస్తే రాష్ట్రానికి కొన్ని కోట్లు అయినా మిగిలేవి కదా రాజా!..’’
- సోషల్ మీడియా ప్రముఖుడు పి.వి.ఎస్.శర్మ జవాబు.
‘‘ఏపీకి పారిశ్రామికవేత్తలు వస్తున్నారంటే దానికి కారణం చంద్రబాబు. ఆయన రేర్ పీస్. చంద్రబాబును మనం అంతా బ్లైండ్‌గా ఫాలో కావాలి. ఆయనకు విజన్ ఉంది’’
- లోకేశ్ ప్రసంగంలో ఇంకో భాగం.
‘‘నిజమే.. పారిశ్రామికవేత్తలు ఏపీకి రావాలంటే 99 పైసలకే ఎకరాలకు ఎకరాలు ఇస్తున్నారు కదా! చంద్రబాబు బ్రాండ్ విలువ ఇంతేనా’’
- సోషల్ మీడియాలో పలువురు సంధించిన వ్యంగ్యాస్త్రం..
‘‘పరిశ్రమలు తేవడానికి లోకేశ్ బాగా కృషి చేస్తున్నారు. ఆయన చొరవ వల్లే గూగుల్ డేటా సెంటర్ వచ్చింది’’
- చంద్రబాబు నాయుడు ప్రశంస..
‘‘విశాఖలో జగన్ తీసుకువచ్చిన అదానీ డేటా సెంటర్‌ను గూగుల్‌గా మార్చి క్రెడిట్ చోరీ చేసి, అదేదో తన కుమారుడి ఘనతగా నిత్యం ప్రచారం చేసుకుంటున్నారుగా’’
- నెటిజన్ల వ్యాఖ్య..
పెట్టుబడుల కోసం ప్రత్యేక విమానంలో దావోస్ వెళ్లిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేశ్‌లు అక్కడ తెలుగు వారితోనో, తెలుగుదేశం వారితోనో ఒక సమావేశం నిర్వహించి ఒకరినొకరు పొగుడుకుంటూ మీడియా ద్వారా ప్రచారం చేసుకున్నారు. సహజంగానే ఈ మాత్రం దానికి దావోస్ వరకు వెళ్లడం దేనికన్న చర్చ వస్తుంది. ఏపీకి రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని, 23 లక్షల కోట్ల ఉద్యోగాలు కూడా వస్తాయని చంద్రబాబు ఒక టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో చెప్పి ఆశ్చర్యపరిచారు. ఇంటర్వ్యూ చేసిన జర్నలిస్టు విస్మయంతో ‘‘23 లక్షల కోట్లా’’ అని అనగానే.. వెంటనే ఒకసారి 20 లక్షల కోట్లు అని, మరోసారి ప్లస్ 22 లక్షల కోట్లు అని చంద్రబాబు అర్థం పర్థం లేకుండా మాట్లాడడం విమర్శలకు గురైంది.
వయోభారం వల్లో, తడబాటు వల్లో లేక ఇంకో కారణమో తెలియదు కానీ.. కొన్నేళ్లుగా చంద్రబాబు మాటల్లో పొంతన ఉండటం లేదన్న అభిప్రాయం బలపడుతోంది. టీడీపీ బ్రిటిష్ వారితో పోరాడిందని చెప్పడం.. హైదరాబాద్‌ను నిర్మించింది, అభివృద్ధి చేసిందీ, ప్రపంచంలోనే నెంబర్ వన్ అయ్యేందీ తన వల్లనేనని పదే పదే చెప్పుకుంటూండటం.. సెల్ ఫోన్లు రావడానికి తానే కారణమని, ప్రపంచంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని మొదట ప్రమోట్ చేసింది తానేనని, 1984 నుంచి ఈ దేశంలో ఐటీకి మారుపేరు తానేనని, రాష్ట్రంలో ప్రాజెక్టులు ప్రారంభించి, తానే పూర్తి చేశానని, త్వరలో ఏపీకి డ్రోన్ టాక్సీలు వస్తున్నాయని, ఒలింపిక్స్‌లో గెలిస్తే నోబెల్ ప్రైజ్ ఇస్తానని.. చిత్రవిచిత్రమైన ప్రకటనలు చేశారీయన.
అసత్యాలు మాట్లాడడంలో చంద్రబాబు దిట్ట అని ఒకప్పుడు రాజకీయ నేతలు అనుకునేవారు. కళ్లార్పకుండా అబద్ధాలు చెప్పగలడని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అసెంబ్లీ సాక్షిగానే ఎద్దేవ చేశారు. ఇప్పుడు అబద్ధాలకు పొంతనలేని అతిశయోక్తులు, అసందర్భ వ్యాఖ్యలు తోడయ్యాయి. సోషల్ మీడియా బలంగా ఉన్న ఈ కాలంలో ఇవన్నీ ఎప్పటికప్పుడు ప్రజలకు తెలిసిపోతూండటం కొసమెరుపు. మభ్యపెట్టేందుకు, బాబే తోపు అనేందుకు ఎల్లో మీడియా బాకాలు ఈనాడు, ఆంధ్రజ్యోతి ఉండనే ఉన్నాయి.
చిత్రమైన విషయం ఏమిటంటే.. చంద్రబాబు కుమారుడు లోకేశ్ కూడా ఇప్పుడ తండ్రి బాట పడుతున్నారు. రెడ్‌బుక్ అంటూ ఇప్పటికే అరాచకాలు సృష్టిస్తున్న లోకేశ్, అహంభావ పూరిత వ్యాఖ్యలు, అబద్దపు ప్రకటనలు చేస్తూ ప్రజలను మభ్య పెట్టాలని చూస్తున్నారన్న విమర్శలూ ఎదుర్కొంటున్నారు. తల్లి, చెల్లి అంటూ అసందర్భంగా అసత్యపు వ్యాఖ్యలు చేస్తూ వికృతానందం పొందుతున్నారని వారు అంటున్నారు. సోషల్ మీడియా లేని రోజుల్లో పత్రికలు, టీవీ చానళ్లను అడ్డు పెట్టుకుని చంద్రబాబు తన బురద రాజకీయాన్ని నడిపి ఉండవచ్చునేమో కానీ.. లోకేశ్ కూడా అదే పంథాలో వెళ్లడం ప్రజలలో చులకనయ్యేందుకు దగ్గరి దారి అవుతుందన్నది స్పష్టం.
ఆంధ్రప్రదేశ్‌కు నిజంగా పెట్టుబడులు వస్తుంటే, పారిశ్రామికవేత్తలు ఉత్సాహం చూపుతుంటే ఎవరూ కాదనరు. మంచిదే.కాని రాని పెట్టుబడులు వచ్చినట్లు చూపించే యత్నం చేయడం, ఉద్యోగాలు వచ్చేస్తున్నాయన్న భ్రమ కల్పించడం లోకేశ్‌కు దీర్ఘకాలంలో నష్టం చేసేవే. తండ్రి 23 లక్షల ఉద్యోగాలని, కొడుకేమో 16 లక్షల ఉద్యోగాలు వస్తాయని తోచిన అంకెలు చెబుతున్నారు. ‘‘99 పైసలకే భూములు ఇచ్చేస్తానని, అది తన ఇష్టం’’ అని అహంభావ దోరణితో మాట్లాడుతున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ వ్యాఖ్యానించారు. చంద్రబాబు, లోకేశ్‌లు బ్రాండ్ ఇమేజీతో కాకుండా బ్యాండ్ మేళంతో దావోస్ వెళ్లినట్లు ఉందని చమత్కరించారు.
అందులో వాస్తవం ఉందన్న భావన కలుగుతుంది అదేకాదు.. ఏదో కంపెనీ పెట్టుబడి పెట్టాలని అనుకుంటే ఈ మెయిల్ పంపి రావద్దని సూచించారంటూ లోకేశ్ అబద్దం చెప్పారని వైసీపీ నేతలు వ్యాఖ్యానించారు. డెబ్బై ఐదేళ్ల వయసులో చలిని లెక్కచేయకుండా రాష్ట్రం కోసం పనిచేస్తున్న వ్యక్తి చంద్రబాబు అని లోకేశ్ చెప్పడం విడ్డూరమే. ఇలాంటి అతిశయోక్తులతో అమాయక జనాన్ని నమ్మిస్తారేమో కాని, కాస్త విజ్ఞత ఉన్నవారంతా నవ్వుకుంటున్నారు. ఇక మాజీ సీఎం జగన్‌ను దూషించడానికి దావోస్ వరకు వెళ్లవలసిన అవసరం ఉందా అని పలువురు ప్రశ్నిస్తున్నారు.
ఈ క్రమంలో చంద్రబాబును ఆయన మామ ఎన్.టి.రామారావు ఏ విధంగా దూషించింది వివరిస్తూ సంబంధిత వీడియోలతోసహా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. విదేశాలకు వెళ్లినప్పుడైనా హుందాగా ఉండవలసిన చంద్రబాబు, లోకేశ్‌లు అది మాని ఏపీ బ్రాండ్‌ను బాగు చేస్తున్నారా? లేక చెడగొడుతున్నారా అన్నది వారే ఆలోచించుకోవాలి. తన దావోస్ పర్యటనలో గత ముఖ్యమంత్రి జగన్ హుందాగా వ్యవహరించిన తీరును గుర్తు చేసుకుంటున్నారు.. టీమ్ 11 ముఖం చూసి పెట్టుబడులు పెడతారా అని లోకేశ్ అంటున్నారని, మరి టీమ్ 164 ముఖం చూసి ఎవరూ ఎందుకు ముందుకు రాలేదని ఒక విశ్లేషకుడు చేసిన వ్యాఖ్యకు జవాబిస్తారా! అంటే దారి ఖర్చులు కూడా రాలేదా?

- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత


