పద్మాభిషేకం
కృష్ణా జిల్లాకు చెందిన ముగ్గురికి పద్మ పురస్కారాలు
‘కృష్ణా’ ముద్దు బిడ్డలకు
మోపిదేవి/పమిడిముక్కల/గుడ్లవల్లేరు/మచిలీ పట్నం టౌన్/చల్లపల్లి: కృష్ణమ్మ ఒడిలో ‘పద్మాలు’ విరబూశాయి. ఏకంగా మూడు పురస్కారాలు కృష్ణా ముద్దు బిడ్డలకు వరించాయి. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆదివారం పద్మ అవార్డులను ప్రకటించింది. ఇందులో అంతర్జాతీయ క్యాన్సర్ వైద్యుడు డాక్టర్ నోరి దత్తాత్రేయుడికి వైద్య రంగంలో పద్మ భూషణ్, ప్రముఖ సినీ నటుడు గద్దే రాజేంద్రప్రసాద్‌కు కళల రంగంలో పద్మశ్రీ, సాహిత్యం రంగంలో సంస్కృతంలో దిట్ట అయిన వెంకటి కుటుంబ శాస్త్రికి పద్మశ్రీ పురస్కారం లభించింది. దీంతో వారి స్వగ్రామాల్లో సంబరాలు మిన్నంటాయి. వారి పాత మిత్రులు, కుటుంబ సభ్యులు గత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.
పులకించిన తాడంకి..
పమిడిముక్కల మండలంలోని తాడంకి గ్రామ వాసియైన డాక్టర్ నోరి దత్తాత్రేయుడుకి పద్మ భూషణ్ వరించడంతో ఆ గ్రామం పులకించింది. తమ గ్రామంలో పుట్టి పెరిగిన ఆయనకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుకు ఎంపిక చేయడం ఎంతో గర్వంగా ఉందని వారు అంటున్నారు. దత్తాత్రేయుడు 1947 అక్టోబరు 21న జన్మించారు. తండ్రిపేరు సత్యనారాయణ. జిల్లాలోని తోట్లవల్లూరులో ప్రాథమిక విద్యాభ్యాసం, ఉన్నత, పీయూసీ, బీఎస్సీ విద్యను మచిలీపట్నంలోని జైహింద్ హై స్కూల్, ఆంధ్రజాతీయ కళాశాలలో పూర్తి చేశారు. ఆ తర్వాత కర్నూలు వైద్య కళాశాలలో వైద్యశాస్త్రంలో పట్టా పొంది, ఉస్మానియా వైద్య కళాశాలలో పోసు్ట్రగాడ్యుయేషన్ చేశారు. గతంలో ఒకసారి నోరి దత్తాత్రేయుడు మంటాడ వేంటేశ్వరస్వామి ఆలయానికి వచ్చినప్పుడు గ్రామస్తులందరూ వెళ్లి ఆయనను కలిసి పుట్టిన ఇంటి గురించి వివరించినట్లు విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు స్వామి తెలిపారు. దీంతో ఆయన తమతో ఇంటికి వచ్చారని, ఆ సమయంలో గ్రామం తరఫున ఆయనను మాజీ సర్పంచ్ జక్కా శ్రీనివాసరావు, మంటాడ సర్పంచ్ వీరమ్మతో కలిసి సత్కరించినట్లు పేర్కొన్నారు.
టేకుపల్లిలో హర్షాతిరేకాలు
డాక్టర్ వెంపటి కుటుంబశాస్త్రికి పద్మశ్రీ అవార్డు వరించటంపై కృష్ణాజిల్లా, మోపిదేవి మండలం టేకుపల్లి గ్రామంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. వెంపటి జగన్నాథరావు, రాజ్యలక్ష్మి దంపతులకు గల ఏడుగురు సంతానంలో ఆరో సంతానంగా పుట్టిన కుటుంబ శాస్త్రికి తాతగారైన కుటుంబయ్యశాస్రి పేరును పెట్టారు. ఈయన సంస్కృతంలో దిట్ట. ప్రస్తుతం తిరుపతిలో నివాసం ఉంటున్నారు. భారత దేశంలో ఉన్న ప్రముఖ సాంస్కృత విశ్వవిద్యాలయాలు న్యూ ఢిల్లీ రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్, వారణాసి సంపూర్ణానంద సంస్కృత విశ్వవిద్యాలయం, గుజరాత్ శ్రీ సోమనాథ్ సంస్కృత విశ్వవిద్యాలయాలకు ఉపకులపతి (వైస్ చాన్స్‌లర్)గా పనిచేశారు. తెలుగు భాషలాగా సంస్కృత భాషను సులభరతంగా ప్రతి ఒక్కరూ నేర్చుకోవటం ఎలా అనేదానిపై కుటుంబశాస్త్రి విశేష కృషి చేశారు. ఇప్పటికీ టేకుపల్లిలో కుటుంబశాస్త్రి నివాస గృహం ఉంది. ఆయన ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఆ గృహంలోనే ఉంటారు.
టేకుపల్లికి రెండో పద్మశ్రీ..
గతంతో ఇదే టేకుపల్లి గ్రామానికి చెందిన ప్రముఖ గాయకులు స్వర్గీయ ఘంటసాల వెంకటేశ్వరరావుకు పద్మశ్రీ అవార్డు లభించింది. తాజాగా కుటుంబశాస్త్రి కూడా పద్మశ్రీ లభించటంతో మారుమూల గ్రామానికి ప్రత్యేక గుర్తింపు లభించినట్లైంది.
పద్మాభిషేకం
పద్మాభిషేకం
పద్మాభిషేకం
పద్మాభిషేకం


