గణతంత్ర వేడుకలకు సర్వం సిద్ధం
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఎన్టీఆర్ జిల్లా ఏర్పాటైన తర్వాత తొలిసారిగా నగరంలో గణతంత్ర వేడుకలు నిర్వహిస్తున్నారు. అందుకోసం ఇందిరాగాంధీ మునిసిపల్ కార్పొరేషన్ స్టేడియం ముస్తాబైంది. జిల్లాల విభజన తర్వాత ఇప్పటి వరకూ రాష్ట్ర స్థాయి వేడుకలు నగరంలో జరగడంతో జిల్లా స్థాయి వేడుకలు నిర్వహించే అవకాశం దక్కలేదు. ప్రస్తుతం రాష్ట్ర వేడుకలు అమరావతిలో జరుగుతుండటంతో, జిల్లా వేడుకలను పూర్తిస్థాయిలో నిర్వహిస్తున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లను ఆదివారం పోలీస్ కమిషనర్ ఎస్‌వీ రాజశేఖరబాబుతో పాటు జేసీ ఇలక్కియ, ఆర్డీఓ కావూరి చైతన్య తదితరులు ఏర్పాట్లు పరిశీలించి, ట్రయల్ రన్ నిర్వహించారు.
వేడుకల్లో 18 శకటాలు..
జిల్లా అభివృద్ధిని సూచించే విధంగా 18 శకటాలను వేడుకలలో ప్రదర్శించేందుకు సిద్ధం చేశారు. ఈ వేడుకలలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు ప్రజలు పాల్గొనేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. జిల్లా చరిత్రలో మొదటి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారుల సమన్వయంతో స్టేడియంలో ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి.
కార్యక్రమం ఇలా..
ఉదయం 8.30 నిమిషాల నుంచి ఇందిరా గాంధీ మునిసిపల్ కార్పొరేషన్ స్టేడియంలో గణతంత్ర వేడుకలు ప్రారంభమవుతాయి. పోలీస్ కమిషనర్ ఎస్‌వీ రాజశేఖరబాబు 8.56 నిమిషాలకు, కలెక్టర్ జి. లక్ష్మీశ 9.00 గంటలకు స్టేడియానికి చేరుకుంటారు. కలెక్టర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం వివిధ కంటింజెంట్స్ నుంచి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరిస్తారు. తర్వాత కలెక్టర్ గణతంత్ర దినోత్సవ సందేశం అందిస్తారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించి వివిధ శాఖలలో ఉత్తమ సేవలు అందిస్తున్న జిల్లా స్థాయి అధికారులు ఉద్యోగులకు ప్రశంసా పత్రాలను అందజేస్తారు.
ఏర్పాట్లు పూర్తి చేసిన జిల్లా యంత్రాంగం
గణతంత్ర వేడుకలకు సర్వం సిద్ధం


