నిమ్మకూరులో ఆనందోత్సాహాలు
నిమ్మకూరు(పామర్రు): నటుడు గద్దె రాజేంద్ర ప్రసాద్‌కు పద్మశ్రీ అవార్డు రావటంతో కృష్ణా జిల్లా పామర్రు మండలం నిమ్మకూరు గ్రామంలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. గ్రామంలోని గద్దె నారాయణ, విజయ ఛాముండేశ్వరీ దంపతులకు 1956 జూలై 19వ తేదీన రాజేంద్ర ప్రసాద్ జన్మించారు. నారాయణ నిమ్మకూరు గ్రామంలోని అన్న ఎన్టీఆర్ నివాసంలోనే ఉండేవారు. గ్రామంలోని నందమూరి హరికృష్ణ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తించేవారు. ఇంటి వద్ద ట్యూషన్ చెబుతూ, డ్యాన్సులను కూడా నేర్పిస్తూ ఉండేవారని గ్రామస్తులు తెలిపారు. రాజేంద్ర ప్రసాద్‌కు మూడేళ్ల సమయంలో తండ్రి ఉద్యోగ రీత్యా మరో గ్రామానికి వెళ్లారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులకు రాజేంద్ర ప్రసాద్‌కు మంచి అనుబంధం ఉన్నది.
హరికృష్ణతో ఎక్కువ అనుబంధం..
నిమ్మకూరులో ఉన్న సమయంలో రాజేంద్ర ప్రసాద్‌కు ఎన్టీఆర్ కుమారుడు హరికృష్ణతో ఎక్కువ అనుబంధం ఉండేది. హరికృష్ణ నిమ్మకూరు గ్రామంలో ఎక్కువగా ఉంటూ ఉండేవారని, ఆ సమయంలో తనతో సరదాగా గడిపే వారని రాజేంద్ర ప్రసాద్ నిమ్మకూరు వచ్చిన సమయంలో గుర్తు చేసుకున్నారు. తర్వాత చదువు పూర్తి చేసి సినిమాలో చేరి మంచి నటుడిగా గుర్తింపు పొందారు.


