ఇస్లామాబాద్: భారత్-యూరోపియన్ యూనియన్ మధ్య ఇటీవల కుదిరిన వాణిజ్య ఒప్పందం కారణంగా దాయాది దేశం పాకిస్తాన్‌కు కొత్త టెన్షన్ మొదలైంది. భారత్, ఈయూ ఒప్పందం పాకిస్తాన్ ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉండటంతో ఆ దేశ నేతలు ఆందోళనకు గురవుతున్నారు. ఈ క్రమంలో పాక్ విదేశాంగ కార్యాలయ ప్రతినిధి కీలక వ్యాఖ్యలు చేశారు.
కాగా, యూరోపియన్ యూనియన్‌కు పాకిస్తాన్ భారీ మొత్తంలో ఎగుమతులు చేస్తోంది. ఈ క్రమంలో వాణిజ్యం విషయంలో 2014లో పాకిస్తాన్‌కు ఈయూ ‘జీఎస్‌పీ+’ హోదాను కూడా ఇచ్చింది. దీని కింద రాయితీ సుంకాల కారణంగా ఐరోపాకు పాకిస్తాన్ టెక్స్‌టైల్స్ ఎగుమతులు 108 శాతం పెరిగాయి. రెండు పక్షాల మధ్య వాణిజ్య విలువ 12 బిలియన్ యూరోలకు చేరువైంది. అయితే, ఈ హోదా గడువు వచ్చే ఏడాది డిసెంబరుతో ముగియనుంది. ఇలాంటి సమయంలో భారత్, ఈయూ మధ్య ఇటీవలే వాణిజ్య ఒప్పందం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఒప్పందం కారణంగా తమ ఎగుమతులపై పడే ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ఈయూ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు పాక్ విదేశాంగ కార్యాలయ ప్రతినిధి తాహిర్ అంద్రాబీ చెప్పుకొచ్చారు.
ఈ సందర్భంగా తాహిర్ అంద్రాబీ ఓ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. భారత్-ఈయూ ఒప్పందం గురించి మాకు తెలిసింది. అందులోని అంశాలను గమనిస్తున్నాం. ఇప్పటి వరకు ఈయూకి పాకిస్తాన్ భారీగా ఎగుమతులు చేస్తోంది. జీఎస్‌పీ+ స్కీం.. ఈయూతో ద్వైపాక్షిక సహకారానికి విజయవంతమైన నమూనాగా నిరూపితమైంది. ఈ ఒప్పందం ద్వారా పాక్ నుంచి ఈయూ దేశాలకు టెక్స్‌టైల్స్ ఎగుమతులు అక్కడి మార్కెట్ అవసరాలను సరసమైన ధరల్లోనే తీరుస్తున్నాయి. గత ఏడాది తమ మధ్య జరిగిన వ్యూహాత్మక చర్చల సందర్భంగా జీఎస్‌పీ+ అంశం చర్చకు వచ్చింది. ఈయూతో దీర్ఘకాలంగా ఉన్న స్నేహపూర్వక, పరస్పర ప్రయోజనకర సంబంధాలను కొనసాగించేందుకు ప్రయత్నిస్తున్నట్లు’ తెలిపారు.
భారత్, ఈయూ డీల్..
ఇదిలా ఉండగా.. భారత్, ఈయూ మధ్య చరిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) కుదిరింది. మదర్ ఆఫ్ ఆల్ డీల్స్‌గా పిలిచే ఈ ఒప్పందాన్ని మంగళవారం ఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఈయూ నేతలు ఉర్సులా వాన్ డెర్ లెయెన్, ఆంటోనియో కోస్టా సంయుక్తంగా ప్రకటించారు. దీంతోపాటు భద్రత, రక్షణ రంగంలో బంధం మరింత బలోపేతం, భారతీయ నిపుణులకు ఐరోపా దేశాల్లో అవకాశాలను కల్పించే ఒప్పందాలూ కుదిరాయి. ఎఫ్‌టీఏపై చర్చలతో ప్రారంభించి మొత్తం 13 ఒప్పందాలను కుదుర్చుకున్నాయి.
ఈ ఒప్పందం కారణంగా ఐరోపా కార్లు, మద్యం భారత్‌లో చౌకగా లభించనున్నాయి. భారతీయ రైతులు, చిన్న పరిశ్రమలవారి ఉత్పత్తులకు ఐరోపా మార్కెట్‌లో విస్తృత అవకాశాలు లభించనున్నాయి. ప్రపంచ జీడీపీలో 25శాతానికి, వాణిజ్యంలో మూడో వంతుకు ఈ ఒప్పందం ప్రాతినిధ్యం వహించనుంది. ఎఫ్‌టీఏతో ఈయూ దేశాలకు భారత్ చేసే 99శాతానికిపైగా ఎగుమతులపై సుంకాలు తగ్గుతాయి. అలాగే ఈయూ భారత్‌కు చేసే 97శాతం ఎగుమతులపై సుంకాలు దిగివస్తాయి. భారత్ నుంచి ఎగుమతి చేసే టెక్స్‌టైల్, దుస్తులు, తోలు ఉత్పత్తులు, హస్త కళలు, పాదరక్షలు, సముద్ర ఉత్పత్తులపై సుంకాలు తగ్గుతాయి. ఐరోపా దేశాల నుంచి వచ్చే మద్యం, ఆటోమొబైల్ ఉత్పత్తులు, రసాయనాలు, ఔషధాలు తదితరాలపై సుంకాలు తగ్గుతాయి.


