గాజా సంక్షోభాన్ని చల్లార్చే క్రమంలో.. బోర్డు ఆఫ్ పీస్ పేరిట అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న హడావిడి చూస్తున్నదే. ఇప్పటికే ఈ జాబితాలో 35 దేశాలు చేరాయి. రష్యా(చేరుతుందని ట్రంప్ ప్రకటించినా పురోగతి కనిపించడం లేదు), చైనా, జీ7 కూటమిలోని కొన్ని దేశాలు(యూకే, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, కెనడా) ఇంకా చేరలేదు. భారత్ కూడా వాణిజ్య ఒప్పందం ఖరారు కాకపోవడంతో తన వైఖరిని స్పష్టం చేయకుండా దోబుచులాడుతోంది. ఈ క్రమంలో ట్రంప్ ఆహ్వానాన్ని నేరుగా తిరస్కరించింది న్యూజిలాండ్.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ప్రారంభించిన శాంతి మండలికి తొలి షాక్ తగిలింది. ఇందులో చేరాలని ఇచ్చిన ఆహ్వానాన్ని న్యూజిలాండ్ ప్రభుత్వం తిరస్కరించింది. ఈ మేరకు ఆ దేశపు ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతానికి ఇందులో చేరకూడదనే నిర్ణయించుకున్నామని స్పష్టం చేశారాయన.
న్యూజిలాండ్ ఏం చెబుతోంది?
ట్రంప్ ఈ బోర్డును గత వారం ప్రారంభించారు. మొదటగా గాజా ప్రాంతంలో తాత్కాలిక కాల్పుల విరమణను బలపరచడమే లక్ష్యంగా ఉన్నా, భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా విస్తృత పాత్ర పోషించాలనే ఉద్దేశం ఉందని ఆయన పేర్కొన్నారు. మరోవైపు.. న్యూజిలాండ్ విదేశాంగ మంత్రి విన్‌స్టన్ పీటర్స్ స్పందిస్తూ.. ఇది కొత్త సంస్థ. దీని పరిధి, భవిష్యత్తు పాత్రపై స్పష్టత అవసరం ఉంది. అప్పుడే మా నిర్ణయాన్ని కూడా చెప్పగలం అని పేర్కొన్నారు. ఇదే విషయంపైనా ఆయన తన ఎక్స్ ఖాతాలో ఓ సుదీర్ఘమైన పోస్ట్ చేశారు.
‘‘గాజా సమస్యపై ఇప్పటికే ప్రాంతీయ దేశాలు ముందుకు వచ్చి సహకరిస్తున్నాయి. ఇలాంటి సమయంలో న్యూజిలాండ్ పీస్ బోర్డులో చేరడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు. న్యూజిలాండ్ అనేది ఇప్పటికే ఐక్యరాజ్యసమితి స్థాపక సభ్యదేశం. అలాంటప్పుడు ఈ కొత్త బోర్డు చేసే పనులు UN చార్టర్‌కు అనుగుణంగా ఉండాల్సిందే’’ అని విన్‌స్టన్ పీటర్స్ స్పష్టం చేశారు.
ఇప్పటికే ట్రంప్ పీస్ బోర్డులో టర్కీ(తుర్కియే), ఈజిప్ట్, సౌదీ అరేబియా, ఖతార్ వంటి మధ్యప్రాచ్య(Middle East) దేశాలు. అలాగే ఇండోనేషియా వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు సైతం చేరాయి. కానీ, అమెరికాతో మంచి సంబంధాలు ఉన్న దేశాలు సైతం ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తుండడం కొసమెరుపు.
భారత్ ఇంకా ఎందుకు చేరలేదు?
భారత ప్రధాని నరేంద్ర మోదీకి కూడా ట్రంప్ ఆహ్వానం పంపించారు. అయితే భారత్ ఈ బోర్డు విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ బోర్డు అంతర్జాతీయ చట్టబద్ధత, దీర్ఘకాల ప్రభావాలపై స్పష్టత లేకపోవడాన్ని భారత్ తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. పైగా ఈ బోర్డు యూఎన్ చార్టర్‌కు విరుద్ధంగా ఉండే అవకాశం ఉండడం, ఐరాస శాంతి దళాల పనిని బలహీనపర్చవచ్చనే ఆందోళనలను పరిగణనలోకి తీసుకుంటోంది. అన్నింటికీ మించి పాకిస్తాన్ ఈ బోర్డులో చేరడంతో భారత్‌కు ఇది సున్నితమైన అంశంగా మారింది. ఈ క్రమంలో వేచిచూడాలనే ధోరణితో వ్యూహాత్మక వైఖరిని అవలంభిస్తోంది భారత్.


