breaking news
Hijack warnings
-
హైజాకర్కు పైలట్ ఝలక్
జుబా: అది దక్షిణ సూడాన్ రాజధాని జుబా.. ఉదయపు వేళ ఒక చిన్న విమానం మెల్లగా గాల్లోకి లేచింది. అది క్రైస్తవ సహాయక బృందానికి చెందిన చిన్న టర్బోప్రాప్ విమానం. సమారిటన్స్ పర్స్ అనే సంస్థకు చెందిన సెస్నా గ్రాండ్ కారవాన్. సుదూర ఈశాన్య ప్రాంతంలోని మైవూట్ కౌంటీకి అత్యవసర వైద్య సామగ్రిని చేరవేయడమే దాని లక్ష్యం. కానీ ఆ ప్రయాణం ఊహించని భయానక మలుపు తీసుకోబోతోందని ఎవరికీ తెలియదు.హైజాకర్ ఎంట్రీటేకాఫ్ కావడానికి ముందే, విమానంలోకి యాసిర్ మహ్మద్ యూసుఫ్ అనే దుండగుడు చొరబడ్డాడు. వెనుక క్యాబిన్లో రహస్యంగా దాక్కున్నాడు. గగనతలంలో విమానం ప్రయాణిస్తుండగా, ఒక్కసారిగా తుపాకీతో బెదిరించి, పైలట్‌ను అదుపులోకి తీసుకున్నాడు. ఆ విమానాన్ని దక్షిణ సూడాన్‌కు సరిహద్దు లేని మధ్య ఆఫ్రికా దేశం చాడ్‌కు పోనివ్వాలని డిమాండ్ చేశాడు.బోల్తా కొట్టించిన పైలట్ హైజాక్ తర్వాత, విమానం గంటల తరబడి గాల్లో చక్కర్లు కొట్టింది. విమానంలో ఇంధనం అయిపోయిందని, రీఫ్యూయలింగ్ తప్పనిసరి అని దుండగుడికి పైలట్ స్పష్టం చేశాడు. హైజాకర్‌ను నమ్మించి, విమానాన్ని ఉత్తర పట్టణమైన వాయు వైపు మళ్లించాడు.హైజాకర్ అరెస్ట్పైలట్ వ్యూహం ఫలించింది. విమానం వాయు పట్టణంలో సురక్షితంగా ల్యాండ్ అయింది. వాయు పట్టణం ఉన్న వెస్ట్రన్ బహర్ ఎల్ గజల్ రాష్ట్ర పోలీసు ప్రతినిధి అయిన సంతినో ఉడోల్ మయెన్ తెలిపిన వివరాల ప్రకారం, విమానం ల్యాండ్ అయిన వెంటనే దుండగుడిని అదుపులోకి తీసుకున్నారు. దుండగుడు దక్షిణ సూడాన్, సూడాన్ మధ్య వివాదాస్పదమైన, చమురు–సంపన్న ప్రాంతమైన అబ్యేయి అడ్మినిస్ట్రేటివ్ ఏరియా నివాసి. జుబా అంతర్జాతీయ విమానాశ్రయంలో పనిచేసే ఒక ఎయిర్ చార్టర్ కంపెనీ లోగో ఉన్న రిఫ్లెక్టివ్ వెస్ట్‌ను ధరించి ఉన్నాడు. అయితే, ఆ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ పాల్ ఆంట్రోబస్, ఆ పేరుతో తమ సంస్థలో ఎవరూ పని చేయడం లేదనడం గమనార్హం. ఈ సంఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. తమను కాపాడిన భద్రతా దళాలకు సమారిటన్స్ పర్స్ ప్రతినిధి మెలిస్సా స్ట్రిక్‌ల్యాండ్ కృతజ్ఞతలు తెలిపారు. -
విమానం హైజాక్ బెదిరింపులు.. రెడ్ అలర్ట్
టీ.నగర్: విమానం హైజాక్ బెదిరింపులు రావడంతో చెన్నై విమానాశ్రయంలో శనివారం రెడ్ అలర్ట్ ప్రకటించారు. కశ్మీర్ పుల్వామాలో ఆత్మాహుతి దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ సిబ్బంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఇందుకు భారత్ ప్రతిగా భారత వైమానిక దళం పాకిస్తాన్లో ఉన్న తీవ్రవాదుల శిబిరాలపై బాం బుల వర్షం కురిపించడంతో అనేక మంది మృతి చెందారు. దీంతో తీవ్రవాదులు భారత్‌లో దాడులు జరపవచ్చని హెచ్చరికలు అందాయి. ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్న విమానాశ్రయాల్లో విమానాలు హైజాక్ చేయనున్నట్లు బెదిరింపులు అందాయి. దీంతో దేశంలోని విమానాశ్రయాలపై దాడులు జరిపేందుకు తీవ్రవాదులు ప్రయత్నించవచ్చని కేంద్ర ప్రభుత్వాన్ని ఇంటెలిజెన్స్ శాఖ హెచ్చరించింది. దీనికి సంబంధించి భారత పౌర విమానయాన శాఖ శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న విమానాశ్రయాల్లో భద్రతను పెంపొందించాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో చెన్నై విమానాశ్రయానికి రెడ్ అలర్ట్ భద్రత కల్పించారు. దీంతో తీవ్ర తనిఖీల అనంతరమే ప్రయాణికులను విమానాశ్రయంలోకి అనుమతిస్తున్నారు. విమానాశ్రయం లోపలికి సందర్శకులను అనుమతించడం లేదు. తదుపరి ప్రకటన విడుదలయ్యేంత వరకు సందర్శకులను అనుమతించకుండా నిషేధం విధించారు. -
విమానాశ్రయాల్లో హైఅలర్ట్
-
విమానాశ్రయాల్లో హైఅలర్ట్
హైజాక్ హెచ్చరికలు శంషాబాద్, చెన్నై, ముంబైల్లో భద్రత పెంపు న్యూఢిల్లీ: శంషాబాద్‌తో పాటు చెన్నై, ముంబై విమానాశ్రయాల్లో హైజాక్‌కు కుట్ర పన్నారంటూ హైదరాబాద్ నుంచి ఓ మహిళ పంపిన ఈమెయిల్ దేశవ్యాప్తంగా కలకలం రేపింది. దీంతో ఈ మూడు విమానాశ్రయాల్లో ఆదివారం హైఅలర్ట్ ప్రకటించారు. గణతంత్ర, స్వాతంత్య్ర దినోత్సవాల సమ యంలో చేపట్టే అత్యున్నత స్థాయి భద్రతా వలయాన్ని కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్ఎఫ్), పోలీసులు ఏర్పాటు చేశారు. ‘మొత్తం 23 మందీ ఇక్కడి నుంచి విడిపోయి మూడు నగరాల్లో విమానాలెక్కి హైజాక్‌కు పాల్పడతారని ఆరుగురు యువకులు చెప్పుకుంటుండగా విన్నాను’ అంటూ హైదరా బాద్‌కు చెందినట్టు భావిస్తున్న ఓ మహిళ శనివారం రాత్రి ముంబై పోలీసులకు ఈ–మె యిల్ పంపించారని సీఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ ఓపీ సింగ్ వెల్లడించారు. ఈ క్రమంలో ఈ మూడు విమానాశ్రయాల్లో అదనపు బలగాలను మోహరించి క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నామన్నారు. ఈమెయిల్ గాలివార్తే అయివుండవచ్చని, కానీ... ముందు జాగ్రత్తగా హైజాక్ లాంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు అవసరమైన అన్ని భద్రతా చర్యలనూ చేపట్టామన్నారు. ‘ఈ వార్త నిజమో కాదో తెలియదు. కానీ... దేశ పౌరురాలిగా ఈ సమాచారాన్ని అధికారులకు చేరవేయడం నా బాధ్యత’అంటూ గుర్తు తెలియని మహిళ ఈమెయిల్లో పేర్కొన్నట్టు సింగ్ తెలిపారు. రంగంలోకి దిగిన ముంబై పోలీసులు వెంటనే సంబంధిత విమానాశ్రయ అధికారులను అప్రమత్తం చేశారన్నారు. సీఐఎస్ఎఫ్ సహా సంఘ విద్రోహక చర్యలను నియంత్రించేందుకు ప్రత్యేక బలగాలు ఆదివారం తెల్లవారుజాము నుంచి అడుగడుగునా తనిఖీలు చేశాయి. వీటితోపాటు దేశంలోని ఇతర విమానాశ్రయాల అధికారులను కూడా అప్రమత్తం చేశాయి. అయితే విమాన రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టినట్టు చెన్నై విమానాశ్రయ అధికారులు తెలిపారు. కాగా, ఈమెయిల్ సమాచారంలో వాస్తవమెంత... అది పంపిన మహిళ ఎవరనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విశాఖలోనూ రెడ్అలర్ట్ గోపాలపట్నం (విశాఖ పశ్చిమ): వీటితోపాటు ఏపీలోని విశాఖపట్నం విమానాశ్రయంలో కూడా రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఆదివారం విశాఖ విమా నాశ్రయంలో సీఐఎస్ఎఫ్ బలగాలతో పాటు ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసులు, సివిల్ పోలీసులు అప్రమత్తమయ్యారు. విమానాశ్రయంలో సందర్శకుల ప్రవేశాన్ని నిషేధించి, గట్టి నిఘా ఏర్పాటు చేశారు.


