చెన్నై ఎయిర్‌పోర్ట్‌కు రెడ్‌ అలర్ట్‌

Plane Hijack Warings Chennai AirPort Red Alert - Sakshi

టీ.నగర్‌: విమానం హైజాక్‌ బెదిరింపులు రావడంతో చెన్నై విమానాశ్రయంలో శనివారం రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. కశ్మీర్‌ పుల్వామాలో ఆత్మాహుతి దాడిలో 40 మంది సీఆర్‌పీఎఫ్‌ సిబ్బంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఇందుకు భారత్‌ ప్రతిగా భారత వైమానిక దళం పాకిస్తాన్‌లో ఉన్న తీవ్రవాదుల శిబిరాలపై బాం బుల వర్షం కురిపించడంతో అనేక మంది మృతి చెందారు. దీంతో తీవ్రవాదులు భారత్‌లో దాడులు జరపవచ్చని హెచ్చరికలు అందాయి. ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్న విమానాశ్రయాల్లో విమానాలు హైజాక్‌ చేయనున్నట్లు బెదిరింపులు అందాయి. దీంతో దేశంలోని విమానాశ్రయాలపై దాడులు జరిపేందుకు తీవ్రవాదులు ప్రయత్నించవచ్చని కేంద్ర ప్రభుత్వాన్ని ఇంటెలిజెన్స్‌ శాఖ హెచ్చరించింది.

దీనికి సంబంధించి భారత పౌర విమానయాన శాఖ శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న విమానాశ్రయాల్లో భద్రతను పెంపొందించాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో చెన్నై విమానాశ్రయానికి రెడ్‌ అలర్ట్‌ భద్రత కల్పించారు. దీంతో తీవ్ర తనిఖీల అనంతరమే ప్రయాణికులను విమానాశ్రయంలోకి అనుమతిస్తున్నారు. విమానాశ్రయం లోపలికి సందర్శకులను అనుమతించడం లేదు. తదుపరి ప్రకటన విడుదలయ్యేంత వరకు సందర్శకులను అనుమతించకుండా నిషేధం విధించారు.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top