
న్యూఢిల్లీ: పుల్వామా దాడి(2019)కి పాల్పడిన ఉగ్రవాదులు ఈ-కామర్స్ ప్లాట్‌ఫారం ద్వారా పేలుడు పదార్థాలను సేకరించడం, తరలించడం చేశారని మనీలాండరింగ్, టెర్రర్ ఫైనాన్సింగ్‌ను పర్యవేక్షించే అంతర్ ప్రభుత్వ సంస్థ (ఎఫ్‌ఏటీఎఫ్) తెలిపింది. ఉగ్రవాద సంస్థలు ఇటీవలి కాలంలో డిజిటల్ సాధనాలను, ఆర్థిక సాంకేతిక పరిజ్ఞానాలను విరివిగా వినియోగిస్తున్నాయని, నిధులను సేకరించడం, తరలించడం, నిర్వహించడం మొదలైనవాటికి ఈ-కామర్స్ ప్లాట్‌ఫారంలను ఉపయోగించుకుంటున్నాయని ఎఫ్‌ఏటీఎఫ్ వెల్లడించింది.
2019 నాటి పుల్వామా దాడి, 2022 నాటి గోరఖ్ నాథ్ ఆలయ సంఘటనలు దీనికి ఉదాహరణలుగా నిలిచాయని ఎఫ్‌ఏటీఎఫ్ పేర్కొంది. 2019 పుల్వామా దాడిలో ఈ-కామర్స్ సాయంతో పేలుడు పదార్థాలను సేకరించారని, 2022లో గోరఖ్‌నాథ్ ఆలయంపై జరిగిన దాడి ఘటనలో ఐఎస్‌ఎస్ నిధులు సమకూర్చడానికి ‘పేపాల్’, వీపీఎన్‌లను ఉపయోగించారని ఎఫ్ఏటీఎఫ్ తన రిపోర్టులో వెల్లడించింది. ఫుల్వామా ఉగ్రదాడిలో ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైసెస్ (ఐఈడీ)ల పేలుడు శక్తిని పెంచడానికి ఉపయోగించే కీలకమైన పదార్థాలను ఉగ్రవాద సంస్థలు ఈ కామర్స్ ప్లాట్‌ఫారం అమెజాన్ నుంచి తెప్పించుకున్నాయని తేలింది.
పుల్వామా దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ సిబ్బంది మరణించారు. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మొహమ్మద్ ఈ దాడికి పాల్పడింది.ఈ దాడిలో లాజిస్టిక్స్ కోసం ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లు ప్రత్యేక పాత్ర పోషించాయని పరిశోధకులు చెబుతున్నారు. 2022లో గోరఖ్ నాథ్ ఆలయంపై ఐఎస్‌ఎస్ ప్రేరేపిత వ్యక్తి దాడి చేశాడు. ఈ ఘటనలో పాల్గొన్న నిందితుడు ‘పే పాల్’ సాయంతో రూ. 6.7 లక్షలను విదేశాలకు బదిలీ చేశాడని ఎఫ్ఏటీఎఫ్ తెలిపింది. అలాగే నిందితుడు తాను రహస్యంగా ఉండేందుకు వీపీఎన్ సేవలను వినియోగించుకున్నాడని పేర్కొంది.