తమిళనాడులో కుండపోత వర్షం.. చెన్నై పరిస్థితి దారుణం.. | Heavy Rain Fall In Tamil Nadu And Chennai | Sakshi
Sakshi News home page

తమిళనాడులో కుండపోత వర్షం.. చెన్నై పరిస్థితి దారుణం..

Oct 20 2025 10:43 AM | Updated on Oct 20 2025 10:46 AM

Heavy Rain Fall In Tamil Nadu And Chennai

చెన్నై: తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా చెన్నైలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. చెన్నై విమానాశ్రయంలో రన్‌వేపైకి నీళ్లు చేరడంతో ఎక్కడికక్కడే విమానాలు నిలిచిపోయాయి. విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

ఆదివారం రాత్రి నుంచి తమిళనాడులోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. దీంతో, నగరంలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. తూర్పు తీర రోడ్డు (ECR) వెంబడి ఉన్న వేలచేరి, మేదవాక్కం, పల్లికరణై, నీలంకరై ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా రోడ్లు దెబ్బతిన్నాయి. రహదారులపై నీరు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దక్షిణ చెన్నైలోని అనేక ప్రాంతాల్లో ప్రయాణికులు మోకాలి లోతు నీటితో ఇబ్బంది పడ్డారు. వర్షాల నేపథ్యంలో జాగ్రత్త వహించాలని అధికారులు కోరారు.

మరోవైపు.. భారీ వర్షం నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ అధికారులతో సమావేశం అయ్యారు. ఎప్పటికప్పుడు పరిస్థితులను ఆరా తీశారు. ప్రజలకు అన్ని రకాల సదుపాయాలు అందించాలని ఆదేశించారు. 
 

భారత వాతావరణ శాఖ (IMD) తాజా అంచనా ప్రకారం.. చెన్నై, చెంగల్పట్టు, కడలూరు, తంజావూరు, తిరువారూర్, నాగపట్నం, పుదుచ్చేరి, కారైకల్, పరిసర జిల్లాల్లో రాబోయే కొన్ని గంటల్లో ఉరుములతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అక్టోబర్ 22 వరకు తమిళనాడు తీరప్రాంతంలో వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.

కొండ ప్రాంతాలైన నీలగిరి, కల్లార్, కూనూర్ మధ్య కొండచరియలు విరిగిపడటంతో నీలగిరి మౌంటైన్ రైల్వే (NMR)లో రైలు సర్వీసులు రద్దు చేసింది. చెట్లు కూలిపోవడం వల్ల ఈ మార్గంలో రాకపోకలకు అంతరాయం కలిగిందని దక్షిణ రైల్వే తెలిపింది. అక్టోబర్ 19న మెట్టుపాళయం–ఉదగమండలం (రైలు నం. 56136 మరియు 06171), ఉదగమండలం–మెట్టుపాళయం (రైలు నం. 56137) సహా మూడు రైళ్ల సర్వీసులను నిలిపివేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement