మొత్తం పుత్తడి రుణాల్లో 76.5% వాటా.. రూ.4.9 లక్షల కోట్లతో టాప్‌లో తమిళనాడు
భారీగా పెరిగిన సగటు లోన్ మొత్తం.. రూ.5 లక్షలకుపైగా రుణాలు రెండింతలకు..
సాక్షి, స్పెషల్ డెస్క్: రుణ ప్రక్రియ త్వరితగతిన పూర్తి కావడం, తక్కువ పత్రాలు, సౌకర్యవంతమైన నిబంధనలు.. అందుకే జనం గోల్డ్‌లోన్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. పైగా ఇటీవలి కాలంలో పుత్తడి ధర భారీగా పెరిగింది. దీంతో తాకట్టు పెట్టిన పసిడిపై అందుకునే రుణ మొత్తమూ అధికమైంది. అయితే ఆసక్తికర విషయం ఏటంటే భారత్‌లో దక్షిణాది వాసులే అత్యధికంగా బంగారంపై లోన్లు తీసుకుంటున్నారు.
ఖరీదైన రుణాలవైపు..
సగటున ఒక్కో వినియోగదారుడు అందుకున్న రుణ మొత్తం 2023 సెప్టెంబర్‌లో రూ.1.1 లక్షలు ఉంటే.. రెండేళ్లలో రూ.1.64 లక్షలకు చేరింది. రూ.లక్ష లోపు విలువ చేసే రుణ ఖాతాల సంఖ్య తగ్గింది. రూ.లక్షకుపైగా విలువ చేసే రుణ ఖాతాలు దూసుకెళ్లాయి. మొత్తం రుణాల్లో విలువ పరంగా.. రూ.లక్ష లోపు విలువచేసే రుణాల వాటా రెండేళ్లలో 25.9% నుంచి 14.4% పడిపోయింది. అలాగే రూ.5 లక్షలకుపైగా విలువ చేసే రుణాల వాటా దాదాపు రెండింతలైంది. పసిడి విలువ పెరగడమూ ఈ జోరుకు కారణమైంది. దేశవ్యాప్తంగా మొత్తం రిటైల్ రుణాల్లో గోల్డ్‌లోన్స్ అత్యధికంగా 27 శాతం వాటా కైవసం చేసుకున్నాయి.
దేశంలో మొత్తం బంగారు రుణాలు సెపె్టంబర్ నాటికి రూ.14.5 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఇందులో దక్షిణాది రాష్ట్రాల వాటా ఏకంగా 76.55% ఉంది. రూ.4.9 లక్షల కోట్లతో తమిళనాడు తొలి స్థానం కైవసం చేసుకుంది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, కేరళ ఆ తర్వాతి స్థానాల్లో పోటీపడుతున్నాయి. మొత్తం గోల్డ్ లోన్స్‌లో టాప్–10 రాష్ట్రాలు రూ.13.2 లక్షల కోట్లు కైవసం చేసుకోగా, మిగిలిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వాటా కేవలం రూ.1.3 లక్షల కోట్లు మాత్ర మే. అయితే ఈ ఏడాది జూలై–సెప్టెంబర్ మధ్య 3.69 కోట్ల మంది కస్టమర్లు రూ.6 లక్షల కోట్ల విలువ చేసే పసిడి రుణాలు అందుకున్నారు. గతేడాదితో పోలిస్తే రుణ మొత్తం 53%, వినియోగదారుల సంఖ్య 16% పెరగడం విశేషం.


