
జాఫర్ ఎక్స్‌ప్రెస్ ఘటనలో పూర్తిగా మాదే పైచేయి
బలూచ్ లిబరేషన్ ఆర్మీ ప్రకటన
సాక్ష్యాధారాలు చూపుతూ సవివరంగా వీడియో విడుదల
ఇస్లామాబాద్: రెండు నెలల క్రితం పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్‌లో జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలును హైజాక్ చేసిన ఉదంతంలో ఆ దేశ ప్రభుత్వం, సైన్యం చెప్పినదంతా అబద్ధమని బలూచిస్తాన్ వేర్పాటువాదుల గ్రూప్ అయిన బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్‌ఏ) సోమవారం ప్రకటించింది. రైలు హైజాక్ ఘటనలో తమదే పైచేయి అని పేర్కొంటూ సాక్ష్యాధారాలతో సవివరంగా ఒక వీడియోను రూపొందించి తాజాగా విడుదలచేసింది.
పాకిస్తాన్‌లో విస్తీర్ణంపరంగా అతిపెద్ద ప్రావిన్స్ అయినప్పటికీ అభివృద్ధిలో ఆమడదూరంలో నిలిచిపోయిన బలూచిస్తాన్ ప్రజలు ఏకమై తమ ప్రాంత స్వయంప్రతిపత్తే లక్ష్యంగా ఉద్యమిస్తున్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో ఉద్యమంలో భాగంగా మార్చి 11వ తేదీన పెషావర్‌కు వెళ్తున్న జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలును వందలాది మంది బలూచ్ సాయుధులు రైలు పట్టాలను పేల్చేశాక హైజాక్ చేయడం తెల్సిందే.
అయితే ఈ ఘటనలో బలూచ్ మిలిటెంట్లను హతమార్చి వందల మంది ప్రయాణికులను కాపాడామని పాకిస్తాన్ ప్రభుత్వం, సైన్యం ప్రకటించాయి. అయితే అదంతా అబద్ధమంటూ 36 నిమిషాల వీడియోను బలూచ్ ఆర్మీ మీడియా విభాగం హక్కాల్ ఒక వీడియోను బయటపెట్టింది. అందులో దాడికి ముందే సుశిక్షితులైన వందలాది మంది బీఎల్‌ఏ ఫైటర్లు షూటింగ్ ప్రాక్టీస్ చేయడం, రైలును హైజాక్ చేశాక ఏ బోగీ జనాలను ఎటువైపు తీసుకెళ్లాలి? ఎవరి బాధ్యతలు ఏమిటి? వంటి వాటితోపాటు బందీలకు ఎలాంటి హానీ తలపెట్టకుండా జాగ్రత్తగా రైలు నుంచి దూరంగా తీసుకెళ్లిన దృశ్యాలు ఆ వీడియోలో కనిపించాయి.
బందీలను చిత్రహింసలకు గురిచేసి కొందరిని చంపేశామన్న పాక్ సైన్యం వాదనల్లో నిజంలేదని బీఎల్‌ఏ ఈ వీడియోతో నిరూపించింది. బందీల్లో 200 మంది పాక్ పోలీసులు, అధికారులు ఉన్నారు. వాళ్లను రెండు రోజులపాటు బంధించిన దృశ్యాలు ఈ వీడియోలో ఉన్నాయి. మహిళలు, వృద్ధులు, చిన్నారులను హింసించారన్న వాదనలో వాస్తవం లేదని ఆ వీడియో చూస్తే తెలుస్తోంది. అసలు దాడి చేయడానికి గల కారణాలు, ఆవశ్యకతను బీఎల్‌ఏ సీనియర్ నేత ఒకరు ఈ వీడియో మొదట్లోనే స్పష్టంచేశారు. ‘‘మా పోరాటం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మా ఉద్యమం కీలకదశకు చేరుకుంటోంది.
ఈ దశలో సంక్షిష్టమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వచి్చంది. మా యువ ఫైటర్లు ఇలాంటి కఠిన నిర్ణయాలను అమలుచేయాల్సి వచి్చంది. ఇలాంటి నిర్ణయాలుకాకుండా మరే ప్రత్యామ్నాయాలు లేవని మా వాళ్లకూ అర్థమైంది. తుపాకీని నిలువరించాలంటే తుపాకీని పట్టుకోవాల్సిందే. తుపాకీ పేలుడు శబ్దం కూడా కొంత దూరం వరకే వినిపిస్తుంది. తన తండ్రి కోసం తనయుడు ప్రాణత్యానికైనా సిద్ధమయితే అదే కొడుకు కోసం తండ్రి కూడా ఎంతకైనా తెగిస్తాడు’’అని ఆయన చెప్పాడు. హైజాక్ ప్రణాళిక రచన, అమలు, ముందుండి నడిపించి ఫిదాయీ ఫైటర్ యూనిట్ మజీద్ బ్రిగేడ్ వివరాలు, ఫొటోలు, సభ్యుల స్పందనలను వీడియోకు జతచేశారు.
పాక్ సైన్యం ప్రతిదాడిచేసినా అత్యల్ప స్థాయిలో తమ వైపు ప్రాణనష్టం జరిగిందంటూ వీరమరణం పొందిన వాళ్లకు నివాళులు అరి్పంచిన దృశ్యాలు ఆ వీడియోలో ఉన్నాయి. 30 గంటలపాటు సైనిక ఆపరేషన్ తర్వాత 33 మంది రెబల్స్‌ను మట్టుబెట్టామని పాక్ సైన్యం ఆనాడు ప్రకటించింది. బందీలను విడిపించే క్రమంలో 23 మంది జవాన్లు, ముగ్గురు రైల్వే ఉద్యోగులు, ఐదుగురు ప్రయాణికులు చనిపోయారని తెలిపింది. అయితే తాము మాత్రం బందీలుగా ఉన్న 214 మంది పాకిస్తాన్ పోలీసులందరినీ చంపేశామని రెబల్స్ ప్రకటించారు.