
మహారాష్ట్రలో చేసినట్లే బిహార్‌లో చేయాలనుకుంటున్నారు
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ధ్వజం
భువనేశ్వర్: గత ఏడాది మహారాష్ట్రలో చేసినట్లుగానే ఈసారి బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికలను హైజాక్ చేయడానికి బీజేపీ కుట్రలు సాగిస్తోందని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఎన్నికల సంఘం ఎన్నికల విధులు పక్కనపెట్టి కేవలం బీజేపీ ప్రయోజనాల కోసం పని చేస్తోందని మండిపడ్డారు. శుక్రవారం ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘సంవిధాన్ బచావో సమావేశ్’లో రాహుల్ గాంధీ ప్రసంగించారు.
బిహార్ శాసనసభ ఎన్నికలను కబ్జా చేయకుండా బీజేపీని అడ్డుకోవాలని విపక్ష ‘ఇండియా’ కూటమి నిర్ణయించినట్లు చెప్పారు. మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ విచ్చలవిడిగా అక్రమాలకు పాల్పడి అధికారంలోకి వచ్చిందని, బిహార్‌లో ఆ పార్టీ ఆటలు సాగనివ్వబోమని హెచ్చరించారు. మహారాష్ట్రలో ఎన్నికల ముందు కొత్తగా కోటి మంది ఓటర్లను ఎందుకు చేరి్పంచారో చెప్పాలని డిమాండ్ చేస్తే ఎన్నికల సంఘం సమాధానం ఇవ్వడం లేదని విమర్శించారు.
బడా బాబుల సేవలో మోదీ సర్కారు
భారత రాజ్యాంగంపై బీజేపీ దాడి చేస్తోందని రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. కేవలం ఐదారుగురు పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసమే నరేంద్ర మోదీ ప్రభుత్వం పని చేస్తోందని, పేదలను ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆక్షేపించారు. ఈ దేశం కేవలం అదానీ, అంబానీ లేదా బిలియనీర్లకే చెందుతుందని రాజ్యాంగంలో ఎక్కడా రాసిపెట్టి లేదని స్పష్టంచేశారు. పేదలను కొట్టి పెద్దలకు పెట్టడమే మోదీ సర్కారు విధానంగా మారిపోయిందని దుయ్యబట్టారు.
ఒడిశాలోని పూరీలో అదానీ కుటుంబం కోసం జగన్నాథ రథయాత్ర మధ్యలో నిలిపేశారని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఒడిశాలో వనరులను బడా కంపెనీలకు ఇష్టానుసారంగా కట్టబెడుతున్నారని చెప్పారు. జల్, జంగిల్, జమీన్(నీరు, అడవులు, భూమి) గిరిజనులకే చెందాలని డిమాండ్ చేశారు. బీజేపీ ప్రభుత్వ విధానాల వల్ల సర్వం కోల్పోతున్న బాధితులకు అండగా ఉంటామని, వారి తరఫున పోరాటం సాగిస్తామని హామీ ఇచ్చారు.
లౌకికవాదం, సామ్యవాదం
తొలగించే కుట్ర: ఖర్గే రాజ్యాంగం నుంచి లౌకికవాదం, సామ్యవాదం అనే పదాలు తొలగించేందుకు నరేంద్ర మోదీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. ‘సంవిధాన్ బచావో సమావేశ్’లో ఆయన మాట్లాడారు. బీజేపీ పాలనలో గిరిజనులు, దళితులు, మహిళలు, యువతకు భద్రత లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు.