స్వేచ్ఛగా ..    రెక్కలు విప్పేలా... | Miss World South Sudan Calls For An End To Forced Child Marriage | Sakshi
Sakshi News home page

స్వేచ్ఛగా ..    రెక్కలు విప్పేలా...

May 17 2025 5:52 AM | Updated on May 17 2025 5:52 AM

Miss World South Sudan Calls For An End To Forced Child Marriage

మిస్‌ వరల్డ్‌ 2025

అమ్మాయిలకు చదువు కాదుకదా.. కనీసం వ్యక్తిగత శుభ్రత పాటించే వెసులుబాటు కూడా లేని చోట అందాల పోటీలంటే ఆనందంగా సాగనంపుతారా? పంపరు! అయోమ్‌ టీటో మతీజ్‌కు కూడా తీవ్ర నిరసన ఎదురైంది! అయినా వెనకడుగు వేయకుండా అందాల పోటీలకు అటెండ్‌ అయింది.. మిస్‌ సౌత్‌ సుడాన్‌గా కిరీటం ధరించి మిస్‌ వరల్డ్‌కి పోటీపడ్డానికి హైదరాబాద్‌ చేరుకుంది. తన దేశ పరిస్థితులు, వ్యక్తిగత వివరాలు, తన లక్ష్యం వగైరా ఆమె మాటల్లోనే...

‘‘లా చదివాను. లీగల్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాను. సౌత్‌ సుడాన్‌లో పుట్టాను. కానీ అక్కడి రాజకీయ అనిశ్చితి వల్ల మా అమ్మ మమ్మల్ని తీసుకుని కెనడాకు వలస వచ్చేసింది. అందుకే నేను అక్కడే పెరిగాను. మా నాన్న, ఆయన తరపు, అమ్మ తరపు బంధువులంతా సౌత్‌ సుడాన్‌లోనే ఉండిపోయారు. 

మా అమ్మ కెనడాలో టీచర్‌గా ట్రైన్‌ అయ్యి, మా సొంత దేశంలోని పిల్లలకు మంచి స్కూల్‌ను ఏర్పాటు చేయడానికి తిరిగి సుడాన్‌ వచ్చేసింది. దాదాపు 20 ఏళ్ల తర్వాత 2019లో నేను  మా కుటుంబాన్ని చూడ్డానికి నా సొంత దేశానికి వెళ్లాను. ఎమోషనలే కాదు.. కొంచెం షాక్‌ కూడా అయ్యాను. కెనడాలో నేను ఆస్వాదించిన జీవితం, సౌత్‌ సుడాన్‌లో మా వాళ్లంతా అనుభవిస్తున్న జీవితాన్ని బేరీజు వేసుకుని. అప్పుడే డిసైడ్‌ చేసుకున్నాను నా దేశ ప్రజలకూ ఉన్నత ప్రమాణాల జీవితం అందేలా కృషి చేయాలని! కోవిడ్‌ తర్వాత వచ్చేశాను. సర్వీస్‌ మొదలుపెట్టాను. నా బ్యూటీ విత్‌ పర్పస్‌ అదే!

అందాల పోటీలకు వ్యతిరేకం
అందాల పోటీల పట్ల సౌత్‌ సుడాన్‌లో చాలా వ్యతిరేకత ఉంది. నేను మిస్‌ సౌత్‌ సుడాన్‌ పాజెంట్‌లో పాల్గొంటున్నప్పుడు, ఇప్పుడు కూడా నిరసన ఎదురైంది. కానీ నా దృష్టిలో ఈ పోటీలు స్కిన్‌ షో కాదు. వైవిధ్యమైన సంస్కృతులు, భాషలు, జీవనశైలులను పరిశీలించే, అధ్యయనం చేసే అవకాశాన్నిచ్చే వేదిక. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. సర్దుబాటు, సహనాన్ని నేర్పిస్తుంది.

 ఇవన్నీ కూడా నా సామాజిక బాధ్యతను మెరుగ్గా నిర్వర్తించేందుకు తోడ్పడతాయి. అందుకే నిరసనను ఎదుర్కొని మరీ ఈ పోటీకి వచ్చాను. అంతేకాదు ఈ పోటీలు ఒకరినొకరు తెలుసుకుని, అర్థం చేసుకుని, ఒకరికొకరు సాయం అందించుకునే స్ఫూర్తినీ పంచుతాయి. మహిళలకు అలాంటి స్ఫూర్తి, ప్రేరణ అవసరం. దానికి అందాల పోటీలే కావాలా అంటారేమో! స్త్రీకి స్త్రీయే శత్రువు అనే నానుడి ప్రపంచ వ్యాప్తంగా పాతుకుపోయి.. అది స్త్రీల సహజ లక్షణమనే అభిప్రాయమూ అంతే లోతుగా నాటుకుపోయింది. దాన్ని అబద్ధమని నిరూపిస్తున్నాయి ఈ పోటీలు!

 కొన్ని దేశాల పేర్లే తెలియవు నేనీ కంటెస్ట్‌కి వచ్చేదాకా! అందుకే పట్టుబట్టి మరీ ఈ పోటీకి వచ్చాను. ఇక్కడి వైవిధ్యత, ఆధ్యాత్మికత నన్ను చాలా ఇన్‌స్పైర్‌ చేశాయి. ఈ దేశంలోని వాళ్లను చూస్తే నాకు ఫారినర్స్‌గా అనిపించరు. మా వాళ్లలాగే అనిపిస్తారు. ఎప్పుడో ఎక్కడో తప్పిపోయి.. ఇప్పుడు కలుసుకుంటున్నామేమో అనిపిస్తోంది! తెలంగాణ గురించి చెప్పుకోవాల్సి వస్తే ఇక్కడి ఎడ్యుకేషన్, మెడికల్‌ కేర్‌ గురించి కచ్చితంగా మాట్లాడుకోవాలి. ప్రపంచ ప్రమాణాలతో పోటీపడుతున్నాయి. సౌత్‌ సుడాన్‌ యువత తమ ఉన్నత చదువుల కోసం హైదరాబాద్‌కే వస్తోంది. మా దేశంలోని చాలామంది ప్రజలు ఆరోగ్య అవసరాల కోసం ఇక్కడి హాస్పిటల్స్‌నే ఆశ్రయిస్తున్నారు.

బాల్య వివాహాలు.. బలవంతపు పెళ్లిళ్లు
ప్రపంచంలోని అనేక దేశాల్లాగే సౌత్‌ సుడాన్‌లోనూ పురుషాధిపత్యమే! కొడుకుకేప్రాధాన్యం. అమ్మాయికి వ్యక్తిగత శుభ్రత విషయంలోనూ ఆర్థికపరమైన వెసులుబాటు ఉండదు. బాల్యవివాహాలు, బలంతపు పెళ్లిళ్లు కామన్‌. ఇక చదువుకునే అవకాశమెక్కడిది? నేను ఇక్కడిదాకా రాగలిగాను అంటే మా అమ్మే కారణం. మమ్మల్ని ఆమె కెనడా గనుక తీసుకువెళ్లకపోయుంటే నా పరిస్థితి ఎలా ఉండేదో (ఈ మాట చెబుతున్నప్పుడు ఆమె కళ్లల్లో నీళ్లు). నాకింకా గుర్తు.. ఆమె లగేజ్‌ సర్దుతుంటే ‘మనం ఎక్కడికి వెళ్తున్నాం?’ అని అడిగాను. ‘మీరు స్వేచ్ఛగా మీకు నచ్చింది చదువుకునే చాన్స్‌ ఉన్నచోటికి’ అని చెప్పింది! మేం నలుగురు అక్కచెల్లెళ్లం. మాకొక తమ్ముడు. అందరినీ సింగిల్‌ పేరెంట్‌గానే పెంచింది అమ్మ. 

ఎలాంటి అవకాశాల కోసం అమ్మ మమ్మల్ని కెనడాకు తీసుకెళ్లిందో అలాంటి అవకాశాలనే సౌత్‌ సుడాన్‌లోని అమ్మాయిలకూ కల్పిస్తోంది తాను నడిపిస్తున్న స్కూల్‌ ద్వారా! ఆమె చేస్తున్న ఆ సర్వీస్‌కి నేనూ శాయశక్తుల సాయపడుతున్నాను. మా దేశంలోని యంగ్‌ గర్ల్స్‌కి నేను మెంటర్‌గా ఉండాలి! వాళ్ల కలలను సాకారం చేసుకునేలా నేను తోడ్పడాలి. వాళ్లకు రెక్కలున్నాయనే విషయాన్ని గ్రహించేలా చేయాలి. సాధికారతకు, సామాజిక బాధ్యతకు ఐకాన్స్‌గా ఉండి, తర్వాత తరాలను ఇన్‌స్పైర్‌ చేసేలా వాళ్లను తీర్చిదిద్దాలి. ఇదంత సులువైన జర్నీ కాదు. అయినా ప్రయత్నం వీడను!’’ అంటూ తన జర్నీ గురించి చెప్పారు మిస్‌ సౌత్‌ సూడాన్‌.

మా దేశంలోని యంగ్‌ గర్ల్స్‌కి నేను మెంటర్‌గా  ఉండాలి! వాళ్లు కలలను సాకారం చేసుకునేలా నేను తోడ్పడాలి. వాళ్ళకు రెక్కలున్నాయనే విషయాన్ని గ్రహించేలా చేయాలి. 

– సరస్వతి రమ
ఫొటో: ఎస్‌.ఎస్‌. ఠాకూర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement