‘మిస్‌ వరల్డ్‌’ స్పాన్సర్లకు సహకరించాల్సిందే: బాలీవుడ్‌ నటి | Celina Jaitly Slams Miss England Milla Magee Claims Of Pageant Exploitation | Sakshi
Sakshi News home page

‘మిస్‌ వరల్డ్‌’ స్పాన్సర్లకు సహకరించాల్సిందే: బాలీవుడ్‌ నటి

Jun 4 2025 5:41 PM | Updated on Jun 4 2025 5:53 PM

Celina Jaitly Slams Miss England Milla Magee Claims Of Pageant Exploitation

మిస్‌ వరల్డ్‌ ఇండియా పోటీల్లో పాల్గొన్న వారు స్పాన్సర్ల కార్యక్రమాల్లో బలవంతంగా పాల్గొనాల్సి వచ్చిందని, నిర్దిష్ట దుస్తులు ధరించమని ఒత్తిడి చేయడం జరిగిందని మిస్‌ ఇంగ్లాండ్‌ మిల్లా ఆరోపించడం మిస్‌ వరల్డ్‌ పోటీల నుంచి నిష్క్రమించడం తెలిసిందే. ఈ నేపధ్యంలో బాలీవుడ్‌ నటి,  మాజీ మిస్‌ ఇండియా, మిస్‌ యూనివర్స్‌ రన్నరప్, ఐక్యరాజ్యసమితి గుడ్‌విల్‌ అంబాసిడర్‌ దుబాయ్‌ నివాసి సెలీనా జైట్లీ(Celina Jaitly), మిస్‌ ఇంగ్లాండ్‌  మిల్లా మాగీ చేసిన ఆరోపణలపై ఘాటుగా స్పందించారు.

‘సౌందర్య వేదికల విలువను తక్కువగా అంచనా వేయడం బాధాకరం అన్నారామె. ‘అంతర్జాతీయ వేదిక అంటే ప్రొఫెషనలిజం, ఆత్మవిశ్వాసంతో ముందుకు రావడం’’ అంటూ పేర్కొన్నారు.   తాజాగా గల్ఫ్‌ న్యూస్‌కు ప్రత్యేకంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో  సెలీనా జైట్లీ మాట్లాడుతూ  గతంలో మిస్‌ యూనివర్స్‌ పోటీల్లో భారతదేశం తరపున పోటీపడిన తన అనుభవం గుర్తు చేసుకున్నారు.

‘ప్రపంచ మీడియా ముందు మీరు మీ దేశ ప్రతినిధిగా గౌరవంగా ఉండడం ఆవేదన చెందాల్సిన విషయం కాదు, గర్వించదగ్గ విషయం’’ అన్నారు. మిల్లా సిపిఆర్‌ శిక్షణ వంటి అంశాలను ముందుకు తెచ్చి పోటీకి సంబంధించిన మౌలిక అంశాలపై మార్పులు కోరడం సరికాదని సెలీనా అభిప్రాయపడ్డారు.

వచ్చే 2025 చివరి నాటికి సౌందర్య పరిశ్రమ 667 బిలియన్ల డాలర్ల ఆదాయం, ఫ్యాషన్‌ రంగం 1.7 ట్రిలియన్ల విలువను సాధించబోతున్నాయని, ఈ రంగాలు కేవలం అందం గురించి కాక, కోటి మందికి ఉపాధిని అందిస్తున్నాయన్నారు. అంతేకాక సంప్రదాయ సాంస్కృతిక విలువల వ్యక్తీకరణకు వేదికలుగా కూడా నిలుస్తున్నాయనీ చెప్పారామె. భారతదేశ సౌందర్య రాణుల జాబితాలో ఉండడం గర్వంగా ఉందంటూ చెప్పిన జైట్లీ, సుష్మితా సేన్, ఐశ్వర్య రాయ్, లారా దత్తా, ప్రియాంక చోప్రా లాంటి ప్రముఖుల పేర్లు ప్రస్తావించారు. ‘అందాల వేదికలపై వారి విజయాల వల్లే అంతర్జాతీయ బ్రాండ్లు భారతీయ ఆర్ధికవ్యవస్థలోకి అడుగుపెట్టాయి. ఈ వేదికలను తక్కువ చేసి చూడడం బాధాకరం’’ అన్నారు.

మిల్లా చేసిన ఆరోపణల్లో స్పాన్సర్లతో పాల్గొనడం ‘దుర్వినియోగం‘గా వర్ణించడాన్ని సెలీనా ఖండించారు. ‘స్పాన్సర్లతో సహకరించడం సందర్భానుసారంగా దుస్తులు ధరించడం వంటివి ఈ వేదికలో సహజమేనని చెప్పారు. ‘‘ ఇది హెచ్‌ఆర్‌ సెమినార్‌ కాదు, ఇది బ్యూటీ కాంటెస్ట్‌ అని గుర్తుంచుకోవాలి’’ అన్నారామె మిల్లా చేసిన ప్రసంగాల్లో స్పాన్సర్ల కార్యక్రమాలను వ్యభిచారంతో పోల్చడాన్ని తీవ్రంగా తప్పుపట్టిన జైట్లీ, ‘ఇలాంటి భాష వాడటం వృత్తి పరంగా ఆమోదయోగ్యం కాదు. ఇది సాటి మహిళలను తక్కువ చేయడంతో పాటు కోటి మందికి ఉపాధి ఇచ్చే పరిశ్రమలను అవమానించడం కూడా’’ అంటూ మండిపడ్డారు.
‘ఒక సైనికుడి కూతురిగా సుదూర ప్రాంతాల్లో పెరిగాను. బ్యూటీ కాంటెస్ట్‌ వేదికలు నా జీవితాన్నే మార్చాయి. అందాల కిరీటం వల్లనే నేను ఐక్యరాజ్యసమితి, బాలీవుడ్‌ వేదికల వరకూ వెళ్లగలిగాను’’ అంటూ కృతజ్ఞతా పూర్వకంగా మాట్లాడారు. వివాదాలు, తప్పుదోవ పట్టించే విమర్శల నడుమ, సెలీనా జైట్లీ చివరగా ఓ విషయం స్పష్టంగా చెప్పారు. ‘‘ బ్యూటీ కాంటెస్ట్‌లు  కేవలం గ్లామర్‌ కోసమే కాకుండా, కట్టుబాటు, అంకితభావం, దేశ గౌరవం కోసం నిలబడే వేదికలు’’
 

Advertisement
 
Advertisement
Advertisement