
ఎస్‌బీఐ రీసెర్చ్ నివేదిక
న్యూఢిల్లీ: రేర్ ఎర్త్ మూలకాలు సహా కీలక ఖనిజాల వెలికితీత, ప్రాసిసెంగ్‌లో రాష్ట్రాల ప్రభుత్వాలు చురుగ్గా పాలుపంచుకోవాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ఒక అధ్యయన నివేదికలో తెలిపింది. ఇది క్రిటికల్ ఖనిజాలకు అదనపు విలువను జోడించే వ్యవస్థపరంగా భారత్ స్వయం సమృద్ధిని సాధించేందుకు, ప్రాంతీయంగా ఆర్థికాభివృద్ధికి గణనీయంగా దోహదపడుతుందని పేర్కొంది.
విద్యుత్ వినియోగాన్ని, డివైజ్‌ల పరిమాణాన్ని తగ్గించగలిగే భౌతిక, రసాయనిక స్వభావాలున్న రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అనేవి నేడు నిర్మాణ, ఎల్రక్టానిక్స్, ఆటోమోటివ్ తదితర రంగాల్లో కీలకంగా మారినట్లు నివేదిక వివరించింది. గత నాలుగేళ్లుగా భారత్ ఏటా సగటున 3.3 కోట్ల డాలర్ల విలువ చేసే రేర్ ఎర్త్ ఎలిమెంట్స్, సంబంధిత ఖనిజాలను దిగుమతి చేసుకుంటోందని తెలిపింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ దిగుమతులు 3.19 కోట్ల డాలర్లకు చేరగా, రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ దిగుమతులు మరింత అధికంగా 24.9 మిలియన్ డాలర్లకు చేరినట్లు నివేదిక పేర్కొంది. లాంథనం, ల్యూటీషియంలాంటివి రేర్ (అరుదైన) ఎర్త్ మూలకాల కోవకు చెందుతాయి. వాస్తవానికి ఇవి పుష్కలంగా ఉన్నప్పటికీ, వెలికితీత ప్రక్రియ చాలా సంక్లిష్టమైన వ్యవహారం కావడంతో రేర్ ఎర్త్ మూలకాలుగా పరిగణిస్తారు.