వయసు 25.. వొంటికి 35.. కారణమేంటి? | Guidelines And Precautions Regarding Biological Aging | Sakshi
Sakshi News home page

వయసు 25.. వొంటికి 35.. కారణమేంటి?

Jun 27 2026 8:26 AM | Updated on Jun 27 2026 8:26 AM

Guidelines And Precautions Regarding Biological Aging

యువతకు షాకిచ్చిన తాజా అధ్యయనం!

‘వయసు కేవలం ఒక సంఖ్య’ అంటారు. కానీ ఇప్పుడు శాస్త్రవేత్తలు చెబుతున్నది మాత్రం అందుకు భిన్నం. క్యాలెండర్‌ మీ వయసు 25 లేదా 30 ఏళ్లు అయినా... మీ శరీరం మాత్రం 35 లేదా 40 ఏళ్ల వ్యక్తిలా పని చేస్తుండచ్చట! తాజాగా వెలువడిన ఓ అధ్యయనం ఈ సంచలన విషయాన్ని వెల్లడించింది.

అమెరికాలోని పరిశోధకులు లక్షలాది మంది ఆరోగ్య వివరాలను విశ్లేషించగా.. నేటి తరం యువత శరీరాలు గత తరాలతో పోలిస్తే మరింత వేగంగా వృద్ధాప్యంలోకి వెళ్తున్నట్లు గుర్తించారు. దీనినే ‘బయోలాజికల్‌ ఏజింగ్‌’ అంటారు. అంటే పుట్టిన తేదీ ప్రకారం వచ్చే వయసు కన్నా శరీరం లోపల జరిగే మార్పుల వల్ల ఎంత వేగంగా ముసలితనం వస్తుందనేదే అసలు విషయం.

వయసుదేముందిలే అని సరిపెట్టుకోవచ్చు అనుకుంటారేమో కానీ ఈ అకాల, అనూహ్య, వేగవంతమైన వృద్ధాప్యం వల్ల 50 ఏళ్లలోపే క్యాన్సర్‌ బారినపడే ప్రమాదం పెరుగుతుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా జీర్ణాశయం, ఊపిరితిత్తులు, గర్భాశయం వంటి అవయవాలకు సంబంధించిన క్యాన్సర్ల బారిన పడే ప్రమాదం కనిపిస్తోందని తెలి΄ారు.

అయితే దీనికి ఇతమిత్థంగా ఇదీ కారణం అని చెప్పలేమనీ, ఫాస్ట్‌ ఫుడ్, ప్రాసెస్డ్‌ ఫుడ్, వ్యాయామం లేకపోవడం, ఊబకాయం, ఒత్తిడి, నిద్రలేమి, కాలుష్యం వంటి అనేక అంశాలు కలిసి శరీరాన్ని వయసు కంటే ముందే బలహీనపరుస్తున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
అలాగని ఇది అంత భయపడాల్సిన విషయం కూడా కాదని నిపుణులు చెబుతున్నారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, సమతులాహారం తీసుకోవడం, తగినంత నిద్రపోవడం, ఒత్తిడిని తగ్గించుకోవడం ద్వారా శరీర వృద్ధాప్య వేగాన్ని కొంతవరకు నియంత్రించే అవకాశం ఉందని సూచిస్తున్నారు.

తరచు నీరు తాగడం వల్ల కూడా వృద్ధాప్య ఛాయలను తగ్గించుకోవచ్చు. వాటర్‌ తాగడం పెరిగితే, మూత్రవిసర్జన, చెమట, పేగు కదలికలతో శరీరంలోని వ్యర్థాలు బయటకు పోతాయి. ఫలితంగా శరీర ఉష్ణోగ్రత సాధారణ స్థితికి చేరుకుంటుంది. చర్మం నిగారింపు సంతరించుకుంటుంది. మనం సాధారణంగా విటమిన్‌ డిని సూర్యరశ్మి ద్వారా పొందుతాం. ఇది వృద్ధాప్య ఛాయలను దూరం చేస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. దీంతో మెరిసే చర్మం మీ సొంతమవుతుంది.

– నిర్వహణ: డి.వి.ఆర్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement