ఉత్సవాల్లో తెలుగుదనం..!
సాక్షి, ముంబై: ముంబైతో పాటు ఠాణే, భివండీ, పుణే, షోలాపూర్‌తోపాటు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో తెలుగు ప్రజలు పెద్ద ఎత్తున గణేశోత్సవాలు నిర్వహిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో తెలుగు ప్రజలే సార్వజనిక మండళ్లు ఏర్పాటు చేసి ఉత్సవాలు నిర్వహిస్తుండగా మరి కొన్ని ప్రాంతాల్లో అక్కడున్న స్థానిక మరాఠీ ప్రజలతో మమేకమై ఈ ఉత్సవాలు జరుపుకుంటున్నారు.
మాధవ్ భువన్ సార్వజనిక్ గణేశోత్సవ మండలి
1934లో ప్రారంభమైన ఎన్ఎమ్ జోషీ మార్గ్‌లోని మాధవ్ భువన్ సార్వజనిక్ గణేశోత్సవ మండలి ఈ ఏడాది కూడా ఘనంగా ఉత్సవాలను నిర్వహిస్తోంది. ముఖ్యంగా ఈ మండలిలో తెలుగు ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. దీంతో ఈ వినాయకుని ఉత్సవాలలో మరాఠీ, తెలుగు ప్రజల సంప్రదాయ పద్ధతులు కన్పిస్తాయి. వీరు తమ మండలి గురించి, వినాయకుని ఉత్సవాల గురించి అందరికీ తెలియపరచాలనే ఉద్దేశ్యంతో 2011 లో www.ma-d-ha-v-bh-uva-ng-anes-h-pooja.org అనే వెబ్‌సైట్‌ను కూడా రూపొందించారు. ఈ ఏడాది మొత్తం 11 రోజుల్లో 1,071 పూజలను చేయనున్నట్లు మండలి ఉప కార్యదర్శి గోపినాథ్ మేవరేకర్ తెలిపారు. వీటితోపాటు భక్తులకు అన్నదానం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
భక్తుల నుంచి కానుకల రూపంగా వచ్చిన బంగారంతో వినాయకునికి సంబంధించిన అనేక వస్తువులు రూపొందిస్తున్నారు. మండలి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో 2008లో 1,260 గ్రాముల బంగారంతో స్వర్ణ కిరీటం చేయించినట్లు తెలిపారు. అదేవిధంగా 2009లో స్వర్ణ హస్తాలు (చేతులు), 2010లో 464 గ్రాముల బంగారంతో గోల్డెన్ మోదక్‌ను తయారు చేయించామన్నారు. ఈ ఏడాది 600 గ్రాముల బంగారంతో స్వర్ణ చెవులు తయారు చేయించామన్నారు. ఇలా ప్రతి సంవత్సరం దాదాపు 25 లక్షల మేర ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. ఈ ఉత్సవాలలో 11వ రోజైన ఆదివారం నిమజ్జనంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని మండలి అధ్యక్షులు అమిత్ తలవనేకర్, ప్రధాన కార్యదర్శి విలాస్ బోభాటే, మేనేజింగ్ ట్రస్టీ మోహన్‌దాస్ పి.మాల్యా తదితరులు కోరారు.
ఠాణేలో..
ఠాణేలో తెలుగు ప్రజలు గణేశోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. సుభాష్‌నగర్, హజూరి, సీపీ తలావ్, కిసాన్‌నగర్, శివాజీనగర్ తదితర పరిసరాల్లో తెలుగు ప్రజలు అట్టహాసంగా ఉత్సవాలు జరుపుతున్నారు. సుభాష్‌నగర్ పోక్రాన్ రోడ్డు నంబర్ రెండులోని ‘శ్రీ ఆంధ్ర గణేశ్ మిత్ర మండలి’ ఆధ్వర్యంలో 1967 నుంచి తెలుగు సంస్కృతీ సంప్రదాయాలతో గణేశోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ మండలి ఎవరినుంచీ చందాలు వసూలు చేయకుండా కేవలం మండలి సభ్యులు, తెలుగు ప్రజలు ఇచ్చిన నగదు, సామగ్రితోనే ఉత్సవాలు నిర్వహిస్తుండడం విశేషం. బాల్కుమ్ ప్రాంతంలో నివసించే తూర్పు గోదావరి జిల్లా అమలాపురానికి చెందిన గుత్తుల ధనంజయ్ ఈసారి విగ్రహాన్ని అందజేశారు. ఇక్కడ ఈ ఏడాది ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు తూర్పుగోదావరి జిల్లా ముమ్మడివరం నుంచి బ్రాహ్మణులైన ప్రభాకర్ బృందం ఠాణేకి వచ్చింది. ప్రస్తుతం ఈ మండలికి అధ్యక్షుడిగా గుత్తుల సాహెబ్రావ్, ప్రధాన కార్యదర్శిగా కె.శ్రీను, క్యాషియర్‌గా శ్రీమాన్నారాయణ బాధ్యతలు నిర్వహిస్తున్నారని మండలి సభ్యుడు దాసరి భాస్కర్‌రావ్ ‘సాక్షి’కి తెలిపారు.