
సాక్షి, సిటీబ్యూరో: భాగ్యనగరంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలను కోవిడ్–19 మార్గదర్శకాల ప్రకారమే జరుపుకోవాలని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి పిలుపునిచ్చింది. గురువారం బేగంబజార్‌లోని బహేతిభవన్‌లో అధ్యక్షుడు జి.రాఘవరెడ్డి, ప్రధాన కార్యదర్శి భగవంతరావ్, ఉపాధ్యక్షుడు రామరాజుల నేతృత్వంలో ఉత్సవ సమితి సమావేశమైంది.
ఈ సందర్భంగా బాలగంగాధర తిలక్ 164వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. తిలక్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల కోవిడ్ మార్గదర్శకాల ప్రకారం భక్తులు మాస్కు ధరించడం, భౌతికదూరం పాటించడం, శానిటైజర్లు ఉపయోగించాలని కోరారు. ప్రతి ఏడాదిలాగానే ఈసారి కూడా ప్రభుత్వం భక్తులకు తగిన ఏర్పాట్లు చేసి సహకరించాలని ఉత్సవ సమితి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.