ఊళ్లోనే ఉద్యోగం! | Rising Hyderabad Costs Push Job Seekers Toward Towns Near Hometowns | Sakshi
Sakshi News home page

ఊళ్లోనే ఉద్యోగం!

Sep 26 2026 4:46 AM | Updated on Sep 26 2026 9:08 AM

Rising Hyderabad Costs Push Job Seekers Toward Towns Near Hometowns

హైదరాబాద్‌లో ఖర్చులు భరించలేం.. సొంతూళ్లకు సమీప పట్టణాల్లో ఉద్యోగాలే నయం 

ఆర్థిక స్థితిగతుల దృష్ట్యా యువతలో పెరుగుతున్న ఈ తరహా ఆలోచన... నైపుణ్యాల కొరతే కారణం 

డిగ్రీ, ఇంజనీరింగ్‌ పట్టభద్రుల్లో 73% మందికి రూ. 35 వేలు దాటని జీతం  

గ్రామానికి 20 కి.మీ.లోపే ఉద్యోగాన్వేషణ..  వారికి రూ. 25 వేల లోపే వేతనాలు 

కేంద్ర కార్మిక శాఖ పీరియాడిక్‌ లేబర్‌ ఫోర్స్‌ సర్వేలో వెల్లడి

డిగ్రీ.. ఇంజనీరింగ్‌.. ఏం చదివినా హైదరాబాద్‌లో ఉద్యోగం బదులు సొంతూళ్లకు దగ్గర్లోని పట్టణాల్లోనే ఏదో ఒక ఉద్యోగం చేసుకోవడమే మంచిదనే ఆలోచన యువతలో పెరుగుతోంది. ఆర్థిక స్థితిగతులే దీనికి ప్రధాన కారణమని కేంద్ర కార్మీక శాఖకు చెందిన పీరియాడిక్‌ లేబర్‌ ఫోర్స్‌ సర్వే స్పష్టం చేసింది. ఉన్నత విద్య పూర్తి చేసిన యువతలో నైపుణ్యాల కొరత ఉండటం ప్రధాన సమస్యగా మారుతోందని.. దీనివల్ల చిన్న కంపెనీల్లోనే ఉద్యోగాలు వస్తున్నాయని యువత చెబుతోంది. ఆయా కంపెనీలు ఇచ్చే తక్కువ వేతనాలతో హైదరాబాద్‌లో జీవించడం కష్టంగా ఉందని సర్వేలో పాల్గొన్న పలువురు తెలిపారు. - సాక్షి, హైదరాబాద్‌

61.4% మంది ఆర్థిక ఇబ్బందుల్లో.. టెన్త్, ఇంటర్‌ పూర్తి చేసిన యువత తక్షణ ఉపాధి చూసుకోవాల్సి వస్తోంది. 15 ఏళ్లు పైబడిన యువతలో 61.4 శాతం మంది ఏదో ఒక ఉద్యోగంలో చేరుతున్నారు. అది కూడా 20 కి.మీ. దూరంలోపే ఉద్యోగం ఉండేలా చూసుకుంటున్నారు. అలాంటి వారికి గరిష్టంగా నెలకు రూ. 25 వేల వేతనం లభిస్తోంది. వారిలో పురుషులు 77.1 శాతం ఉంటే మహిళలు 46.4 శాతం ఉంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 66.5 శాతం, పట్టణ ప్రాంతాల్లో 54.1 శాతం ఇంటర్‌లోపు చదువు పూర్తికాగానే చిన్న ఉద్యోగాల్లోకి వెళ్తున్నారు.

25 ఏళ్లకుపైగా వయసున్న యువతీయువకుల్లో డిగ్రీ, ఇంజనీరింగ్‌ చేసినా 73 శాతం మంది రూ. 35 వేలకు మించిన జీతం పొందలేకపోతున్నారు. కుటుంబ పోషణలో ప్రధాన పాత్ర పోషించాల్సిన బాధ్యత వారిపై ఉంటోంది. దీనికితోడు పట్టణాల్లోని పరిశ్రమలు కూడా యాంత్రీకరణ వైపు మళ్లుతుండటం, మోస్తరు ఆస్పత్రుల్లోనూ నిర్వాహణపరమైన యాంత్రీకరణ కనిపిస్తోంది. ఈ తరహా సాంకేతిక పరిజ్ఞానం స్థానిక యువతలో లోపించడం వల్ల ఉద్యోగాలకు దూరమవుతున్నారనేది సర్వేలో వెల్లడైన అంశం.  

కారణాలేంటి?
సాంకేతిక విద్య పూర్తి చేసిన యువతలో 67 శాతం మంది వర్క్‌ ఫ్రం హోం ఉండే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలనే ఎంచుకుంటున్నారు. వారికి రూ. 4.5 నుంచి రూ. 7 లక్షల మధ్య వార్షిక వేతనం లభిస్తోంది. అయినా ఇదే సరైన ఉద్యోగంగా భావిస్తున్నారు. బహుళజాతి కంపెనీల్లో రూ. 15 లక్షల నుంచి రూ. 30 లక్షల వేతనం లభించాలంటే యువతకు ఏఐ సహా అత్యాధునిక సాంకేతికతపై పట్టు ఉండాలి. 

గ్రామీణ ప్రాంతాల్లో ఇంజనీరింగ్‌ చేసిన విద్యార్థులు ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోలేకపోతున్నారు. ఇంటర్, టెన్త్‌ చదివిన విద్యార్థులు కూడా మారిన పరిస్థితులకు అనుగుణంగా సాంకేతిక నైపుణ్యం పొందడం లేదు. బైపీసీ చేసిన విద్యార్థులు పారామెడికల్‌ సిబ్బందిగా పనిచేయడానికి అవసరమైన సాంకేతికతను అందిపుచ్చుకోవడానికి, యంత్రాల ద్వారా పనిచేయడానికి కనీసం ఐదేళ్లు పడుతోంది. దీనికితోడు ఆంగ్ల భాషపై పట్టులేకపోవడం కూడా యువత ఉపాధి అవకాశాలను దెబ్బతీస్తోంది. 

హైదరాబాద్‌ అంటేనే భయం
రాష్ట్రంలో ఏటా సుమారు 8 లక్షల మంది టెన్త్, ఇంటర్‌ పూర్తి చేస్తున్నారు. 70 వేల మంది ఇంజనీరింగ్‌ పట్టాలు పొందుతున్నారు. మరో లక్ష మంది ఇతర ప్రొఫెషనల్‌ డిప్లొమా, డిగ్రీలు అందుకుంటున్నారు. అయితే తగిన నైపుణ్యం లేనందున వారి వేతనాలు రూ. 35 వేలలోపే పరిమితమవుతున్నాయి. హైదరాబాద్‌లో జీవించేందుకు ఈ జీతాలు వారికి ఏమాత్రం సరిపోవడం లేదు. ఎందుకంటే.. కనీసం రూ. 5 వేలు లేనిదే చిన్న గది కూడా దొరకడం లేదు. అలాగే నెలవారీ ఖర్చులు రూ. 15 వేల దాకా అవుతున్నాయి. ఒకవేళ పేయింగ్‌ హాస్టళ్లలో ఉన్నా నెలకు రూ. 13 వేల వరకూ తీసుకుంటున్నారు.

ఇతర ఖర్చులు కలుపుకుంటే నెలకు మిగిలేది ఏమీ ఉండటం లేదనేది యువత అభిప్రాయం. అదే ఒకవేళ సొంతూళ్లకు సమీపంలోని పట్టణాల్లో తక్కువ జీతంతో కూడిన ఉద్యోగాలైనప్పటికీ ఆ జీతాలతో అప్పుల్లేకుండా జీవించేందుకు సరిపోతుందని సర్వేలో పలువురు యవకులు తెలిపారు. బహుళజాతి కంపెనీలు విస్తరిస్తున్న సమయంలో యువతను నైపుణ్యం దిశగా తీర్చిదిద్దితే తప్ప స్కిల్డ్‌ ఉద్యోగాలు పొందే అవకాశం ఉండదని నిపుణులు అంటున్నారు. ఇటీవల విదేశాల్లో విద్యా విధానం పరిశీలనకు వెళ్లిన ఉపాధ్యాయులు కూడా అక్కడ నైపుణ్యంతో కూడిన విద్యా విధానం ఉందని తెలిపారు. టెన్త్, ఇంటర్‌ పూర్తి చేసినా మంచి వేతనంతో ఉపాధి పొందే అవకాశాలు విదేశాల్లో ఉన్నాయని పేర్కొన్నారు.

ఉద్యోగాలు ఎక్కడ? 
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలు తగ్గిపోయాయి. బహుళజాతి కంపెనీలు వస్తున్నా వాటిలో పనిచేసే నైపుణ్యం యువతకు అందించే విద్యా విధానం లేదు. మరోవైపు హైదరాబాద్‌లో జీవనవ్యయం భారీగా ఉంటోంది. ఇవన్నీ యువతలో నిరాశను పెంచుతున్నాయి. ఏదో ఒక చిన్న ఉద్యోగం అయితే చాలన్న ఆలోచనతో వారు స్వగ్రామాలకు దగ్గర్లో ఉద్యోగాలు వెతుక్కుంటున్నారు. వారి ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చేలా ప్రణాళికలు అవసరం.
– ప్రొఫెసర్‌ హరగోపాల్, సామాజికవేత్త

సిలబస్‌ మార్పులే పరిష్కారం 
టెన్త్, ఇంటర్, ఇంజనీరింగ్‌.. చదువు ఏదైనా అది ఉపాధి అందించేలా ఉండాలి. అందుకోసం సిలబస్‌లో మార్పులు తెస్తున్నాం. అన్ని వర్గాలతోపాటు పరిశ్రమల భాగస్వామ్యంతో సిలబస్‌ రూపకల్పన దీనికి పరిష్కారంగా భావిస్తున్నాం. ఈ మార్పు తర్వాత యువత ఉపాధి అవకాశాలు పెరుగుతాయనే విశ్వాసం ఉంది.
– ప్రొఫెసర్‌ వి. బాలకిష్టారెడ్డి ఉన్నత విద్యామండలి చైర్మన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement