సంఘ్‌ పరివార్‌ దేశాన్ని విభజిస్తోంది | Revanth Reddy Says Political Fight Is Between Gandhi And Sangh Parivars | Sakshi
Sakshi News home page

సంఘ్‌ పరివార్‌ దేశాన్ని విభజిస్తోంది

Sep 26 2026 4:19 AM | Updated on Sep 26 2026 4:19 AM

Revanth Reddy Says Political Fight Is Between Gandhi And Sangh Parivars

కేసీ నుంచి ‘ఆర్యదాన్‌ ముహమ్మద్‌–2026 ఉత్తమ ప్రజా సేవకుడు’ పురస్కారాన్ని స్వీకరిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి

దానివల్ల ప్రజాస్వామ్యానికి అతిపెద్ద ముప్పు: సీఎం రేవంత్‌రెడ్డి

దేశ విభజన యత్నాలకు తెరదించాలంటే రాహుల్‌ను ప్రధాని చేయాలి 

కేరళం పర్యటనలో ముఖ్యమంత్రి 

కేసీ వేణుగోపాల్‌ నుంచి ఆర్యదాన్‌ ముహమ్మద్‌ అవార్డు స్వీకరణ

సాక్షి, హైదరాబాద్‌: దేశాన్ని కులమతాలు, ప్రాంతాలు, భాషల పేరుతో విభజించేందుకు సంఘ్‌ పరివార్‌ ప్రయత్నిస్తోందని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. దేశంలో ప్రజాస్వామ్యానికి  ముప్పుగా ఆ సంస్థ పరిణమించిందని దుయ్యబట్టారు. ఈ నేపథ్యంలో దేశంలో రెండు పరివార్‌ల మధ్య నేరుగా రాజకీయ పోరాటం కొనసాగుతోందని.. అందులో ఒకటి సంఘ్‌ పరివార్‌ అయితే.. రెండోది దేశ ఐక్యత కోసం పనిచేస్తున్న గాంధీ పరివార్‌ అని చెప్పారు. దేశాన్ని రక్షించాలన్నా, మన స్వేచ్ఛను కాపాడుకోవాలన్నా, దేశ విభజన ప్రయత్నాలకు తెరదించాలన్నా యావత్‌ దేశమంతా గాంధీ పరివార్‌కు అండగా నిలవాలని.. రాహుల్‌ గాం«దీని ప్రధానమంత్రి అయ్యేలా చూడాలని రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. 

కేరళంకు చెందిన దిగ్గజ కాంగ్రెస్‌ నేత, దివంగత మాజీ మంత్రి ఆర్యదాన్‌ ముహమ్మద్‌ స్మారకార్థం ఏర్పాటైన ఆర్యదాన్‌ ముహమ్మద్‌ ఫౌండేషన్‌ తనకు ప్రకటించిన ఆర్యదాన్‌ ముహమ్మద్‌–2026 ఉత్తమ ప్రజా సేవకుడు పురస్కారాన్ని స్వీకరించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి కేరళం వెళ్లారు. నీలంబూర్‌లో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్‌ అగ్రనేత, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ చేతుల మీదుగా రేవంత్‌రెడ్డి ఈ పురస్కారాన్ని స్వీకరించారు. 

రైతులు, వెనుకబడిన వర్గాలు, సామాన్య ప్రజల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలతోపాటు రేవంత్‌రెడ్డి నాయకత్వం, ప్రజాస్వామ్య విలువలపై ఆయన నిబద్ధతకు గుర్తింపుగా ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. అవార్డు కింద రూ. లక్ష నగదు, ప్రశంసాపత్రం, జ్ఞాపిక అందించారు.  

అవార్డు అందుకోవడం గౌరవంగా ఉంది 
ఈ పురస్కారం అందుకున్న అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ ఆర్యదాన్‌ ముహమ్మద్‌ సేవలను స్మరించుకున్నారు. ఐదు దశాబ్దాలకుపైగా కాంగ్రెస్‌ కోసం పనిచేసిన ఆర్యదాన్‌ ముహమ్మద్‌ కేరళం రాజకీయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారని చెప్పారు. ఆయన పేరిట ఏర్పాటు చేసిన అవార్డును అందుకోవడం ఎంతో గౌరవంగా ఉందన్నారు. 

కేరళం వెలుపల నుంచి ఈ పురస్కారానికి ఎంపికైన తొలి వ్యక్తిగా నిలవడం మరింత ప్రత్యేకమని చెప్పారు. స్వేచ్ఛ, లౌకికవాదం, రాజ్యాంగ విలువలను కాపాడటమే ఆర్యదాన్‌ ముహమ్మద్‌కు ఇచ్చే నిజమైన నివాళి అవుతుందన్నారు. ఈ ఏడాది కేరళం అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ సాధించిన విజయం కొత్త రాజకీయ గాలికి నాంది పలికిందని.. కేరళం నుంచి మొదలైన ఈ రాజకీయ గాలి దేశమంతా తుపానుగా మారాలని రేవంత్‌ పిలుపునిచ్చారు.  

ఓటు హక్కును కాపాడాలి 
దేశంలో ఓట్ల దొంగతనం, పార్టీల దొంగతనం, ఎన్నికల గుర్తుల దొంగతనం, నిధుల దొంగతనం జరుగుతున్నాయంటూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై రేవంత్‌రెడ్డి పరోక్షంగా విమర్శలు చేశారు. యువత భవిష్యత్తును దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ప్రజాస్వామ్యానికి పునాదిగా ఉన్న ఓటు హక్కును కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తనకంటూ వ్యక్తిగత రాజకీయ ఆశలేవీ లేవన్న రేవంత్‌రెడ్డి.. రాహుల్‌ గాం«దీని ప్రధానిగా చూడటమే తన ముందున్న ఏకైక లక్ష్యమని స్పష్టం చేశారు. రాహుల్‌ గాం«దీ, ప్రియాంకా గాంధీ కేరళ నుంచి పార్లమెంట్‌కు ఎన్నిక కావడం తనకు ఈ రాష్ట్రంతో మరింత అనుబంధాన్ని కలి్పంచిందన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement