దేవుడి సిలబస్‌ | Sakshi Editorial On International Literacy Day | Sakshi
Sakshi News home page

దేవుడి సిలబస్‌

Sep 7 2026 12:47 AM | Updated on Sep 7 2026 12:47 AM

Sakshi Editorial On International Literacy Day

దేవునికి తెలిసిన అచ్చులు, హల్లులు చాలా తక్కువ. మొదటి అచ్చు బతుకు. రెండో అచ్చు బతకనివ్వు. ఈ రెండు అచ్చుల మీదనే ఆయన సృష్టిని నిలబెట్టాడు. ఆయన ఇచ్చిన హల్లులు మూడే. మొదటి హల్లు ఆకలి. రెండో హల్లు నొప్పి. మూడో హల్లు ప్రేమ. ఈ ఐదు అక్షరాలను కల్పించడంతో ‘సృష్టి’ అనే పదం పూర్తవుతుంది. అంతకుమించి సిలబస్‌ పెంచదలుచుకోలేదు. అంతలోనే సుఖమైన ఉనికి ఉందని దేవునికి తెలుసు. చూడగా ఈ అక్షరమాలను ప్రకృతి బాగా ఒంటపట్టించుకున్నట్టు ఉంది. ఈ అచ్చులు, హల్లులు వల్లె వేయడంలో దాని నిష్ఠకు తిరుగు కూడా లేదు. అక్షరాలు నేర్చి అది సృష్టించిన పదాలు మధురం. వాటిలో మొదటిది ‘ఇవ్వడం’. అవును... ఇవ్వడం మాత్రమే. చెట్టు తన పండును తాను తినదు. నది తన నీటిని తాను తాగదు. మేఘం వర్షాన్ని తన కోసం కురిపించుకోదు. దేవుడి బడి నుంచి ప్రకృతి సృష్టించిన మరో మాట ఉంది... ‘ఓర్పు’. విత్తనం మొలకెత్తడానికి నెలలు ఆగుతుంది. చెట్టు నరికితే ఓర్పు వహించి మళ్లీ చిగురిస్తుంది. సుదీర్ఘ కరవును ఓర్పుతో ఎదుర్కొని ఒక్క పెనువానతో జవాబు చెప్తుంది. ప్రకృతి నిత్య వ్యవహారిక పదాలు... ‘సహజీవనం’, ‘సమతుల్యత’. మరి ప్రకృతి చేతిలో ఉన్న బుల్లి డిక్షనరీలో ఎంచేతనో ‘ద్వేషం’, ‘అసూయ’ లేవు.

భూమ్మీద దేవుడి అనుక్షణ అవతారమైన ‘బాల్యాని’కి దైవ అక్షరమాలే తెలుసు. నవ్వు, నమ్మకం, మరుపు... ఇవే బోసినోళ్లు పలికే పదాలు. పిల్లలు పలకపై దిద్దే మరోమాట ‘అచ్చెరువు’. చీమ పాకినా, నాలుక తియ్యగా మారినా, చెట్టునీడ చల్లగా ఉన్నా, వేలికి రంగు అంటినా... ఎంత ఆశ్చర్యమో. ఆశ్చర్యపడటం మానేసిన క్షణం నుంచే నిరక్షరాస్యత మొదలవుతుందని పిల్లలకు తెలుసు. ఈ సృష్టిలోని సకారాత్మక, కరుణాత్మక అనంత సంకేతాలను చూస్తూ కన్నులింతింత చేసుకుని ఆశ్చర్యపోవడానికే జీవితకాలం సరిపోదనీ తెలుసు. అందుకే వారి వాచకంలో చాలా పరిమితమైన అర్థాలున్న ‘మతం’, ‘కులం’ అనే మాటలు ఉండవు. మనిషి తన ప్రాథమిక వాచకాన్ని ఎప్పుడు పారేసుకున్నాడోగానీ వాడి అతి తెలివిని కాకులకు పెట్టా... ఎన్నెన్ని పదాలు సొంత అక్షరమాల నుంచి పుట్టించాడో. ‘అధికారం’, ‘లాభం’, ‘మార్కెట్‌’... ఇవే అతని జీవితానికి పునాది అట. ఈ పునాదిని స్థిరపరిచే బడులూ తెరిచాడు. మొదటి బడి రాజకీయం. ఇది బాగా డిమాండ్‌ ఉన్న బడి. ఇందులో మతం, కులం అనే రెండు సబ్జెక్టుల్లో డాక్టరెట్‌ చేయడం నేర్పుతారు. మనిషిని ‘ఓటు’గా మలచాలంటే ఏం చేయాలో క్రాష్‌కోర్సులు ఉంటాయి. రెండో బడి బిజినెస్‌. ఇది సూటూ బూటూ బడి. టీచర్‌ పేరు ‘లాభం’. ప్రతి మనిషిని వస్తువుగా, ప్రతి సంబంధాన్ని లావాదేవీగా చేసే చదువు ఇక్కడ కర్కశంగా నేర్పుతారు. ఆకలికి స్పందన అమ్మకమే అనే గొప్ప సిద్ధాంతాన్ని బీరు పోనీరు. ఇక మూడో బడి సోషల్‌ మీడియా. పది వేళ్లున్న రెండు చేతులున్న ప్రతి మనిషి ఇందులో అడ్మిషన్‌ పొందవచ్చు. ఇది ‘ద్వేషం’ అనే ఉద్గ్రంథం బోధించడానికి మనిషికి సెల్‌ఫోన్లు ఇచ్చి పాయిఖానాల చుట్టూ తిప్పుతూ ఉంటుంది. లావెటరీయే క్లాస్‌రూమ్‌. 

స్కూళ్లు, కాలేజీలు, విశ్వవిద్యాలయాలు ఉన్నంత మాత్రాన మనిషిని అక్షరాస్యుడిగా నమ్మమని జబర్దస్తీ చేస్తే కష్టం. యుద్ధం చేసే పాలకుడు, బాంబు తయారు చేసే సైంటిస్టు, రోగి శవం మీద పేలాలు ఏరుకునే వైద్యుడు, కల్తీ చేసి జనం అనారోగ్యం మీద భూములు కొనే వ్యాపారస్తుడు, అన్యాయానికి వత్తాసు పలికే న్యాయవాది, పేదవాడిపై జులుం చేసే పోలీసు, సాటివాడికి సాయం చేయని శ్రీమంతుడు, ఇంట్లో బుక్‌షెల్ఫ్‌ లేని టీచర్, వంద కోట్లు మంచం కింద దాచే అధికారి... వీరిని అక్షరాస్యులని అనడం దైవ అక్షరమాలకు ద్రోహం చేయడం. గొప్ప సాహిత్యం, సంస్కృతి, కళలు విరాజిల్లి అవి జాతిగా మారి, ఆ జాతి నుంచి మానవీయ సమాజం ఏర్పడినప్పుడు, కళ్లెదుట సిగ్గుతో చితికిపోయే స్థాయిలో ఉన్న హెచ్చుతగ్గులు నశించిపోయినప్పుడు, ప్రకృతీ మనిషీ సమాన వాటాదారులై మనగలిగి నప్పుడు, పౌరుడూ ప్రభుత్వమూ జ్ఞానశీలాలతో వర్ధిల్లినప్పుడు, కల్లాకపటం ఎరుగని గ్రామీణుడి మల్లె... కొండ మనిషి మల్లె ప్రతి మనిషి మారినప్పుడు... మన పిల్లలకు మన సమాజాన్ని చూíపి ‘నేను గర్వపడుతున్నాను’ అని చెప్పగలిగినపుడు నిజమైన అక్షరాస్యత వచ్చినట్టు. సెప్టెంబర్‌ 8... అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం. మన సరైన చదువును మొదలెడదామా? 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement