సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో ఇవాళ ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకోబోతోంది. అసెంబ్లీ వర్షాకాల సెషన్ నుంచి బీఆర్‌ఎస్ సభ్యులు సస్పెన్షన్‌కు గురైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మాక్ అసెంబ్లీ నిర్వహించాలని ఆ పార్టీ నిర్ణయించింది.
పార్టీ అధికారిక కార్యాలయం తెలంగాణ భవన్‌లో శనివారం ఉదయం బీఆర్‌ఎస్ పార్టీ మాక్ అసెంబ్లీని నిర్వహిస్తోంది. స్పీకర్ పాత్రలో జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావ్ కనిపించబోతున్నారు. అలాగే సీనియర్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్యమంత్రి పాత్ర పోషించబోతున్నారు. పల్లా రాజేశ్వర్, గంగుల కమలాకర్ మంత్రుల పాత్ర పోషిస్తారని సమాచారం. అయితే కీలకమైన ప్రతిపక్ష పాత్ర ఎవరు పోషించబోతున్నారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
సభా కార్యకలాపాలకు పదే పదే అడ్డుపడుతున్నారంటూ బీఆర్‌ఎస్ సభ్యుల్ని స్పీకర్ గడ్డం ప్రసాద్ ఈ సమావేశాల నుంచి సస్పెండ్ చేశారు. అయితే కీలక హామీలు నెరవేర్చకపోవడం, ప్రజా సమస్యలు, పలు కీలక అంశాలపై చర్చకు భయపడే కాంగ్రెస్ ప్రభుత్వం తమను సభలో లేకుండా చేసిందని బీఆర్‌ఎస్ అంటోంది. ఈ క్రమంలోనే మాక్ అసెంబ్లీ ద్వారా రేవంత్ సర్కార్‌ను ట్రోలింగ్ చేస్తుందా? లేదంటే అర్థవంతమైన చర్చ జరుపుతుందా? అనే ఉత్కంఠ కొనసాగుతోంది.
ఇదీ చదవండి: ఇంతకీ ఆమెకు ఏమైంది?.. ఎక్కడ?


