వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో కనిపించని మాజీ మంత్రి
బర్తరఫ్ తర్వాత సైలెంట్.. సీఎల్పీ సమావేశానికీ గైర్హాజరు
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ముగుస్తున్న వేళ మాజీ మంత్రి కొండా సురేఖ అంశం మరోమారు చర్చనీయాంశమవుతోంది. గత సమావేశాల వరకు మంత్రిగా ఉన్న ఆమె వర్షాకాల సమావేశాల ప్రారంభం కంటే ముందు జరిగిన పరిణామాల నేపథ్యంలో మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయ్యారు. ఆ తర్వాత సైలెంట్ అయిపోయిన ఆమె గత ఐదు రోజులుగా జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడం లేదు.
మంత్రిపదవి నుంచి తొలగించిన తర్వాత తాను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని చెప్పినప్పటికీ గురువారం జరిగిన కాంగ్రెస్ శాసనసభాపక్షం (సీఎల్పీ) సమావేశానికి కూడా ఆమె రాలేదు. అసలు ఆమె ఎక్కడ ఉన్నారు? ఏం చేస్తున్నారు? అన్న విషయం కూడా రాజకీయ వర్గాల్లో చర్చకు రావడం లేదు. హైదరాబాద్‌లోని తన నివాసంలోనే ఆమె ఉన్నట్లు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
అయితే, శుక్రవారం గాందీభవన్ వర్గాల్లో జరిగిన చర్చతో ఆమె మరోమారు వార్తల్లో వ్యక్తి అయ్యారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ ఆమెకు ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. జరిగిన విషయాలను పక్కనపెట్టి పార్టీలో మళ్లీ చురుకుగా వ్యవహరించాలని, అసెంబ్లీకి హాజరు కావాలని సురేఖను మీనాక్షి కోరినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో శనివారం జరిగే అసెంబ్లీ సమావేశాలకు ఆమె హాజరవుతారా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది.


