రేవంత్‌ ఏ1.. పొంగులేటి ఏ2! | Harish Rao Slams CM Revanth Reddy Over 22A Lands Dispute | Sakshi
Sakshi News home page

రేవంత్‌ ఏ1.. పొంగులేటి ఏ2!

Sep 12 2026 5:56 AM | Updated on Sep 12 2026 5:56 AM

Harish Rao Slams CM Revanth Reddy Over 22A Lands Dispute

22(ఏ) నిషేధిత భూముల జాబితాలో ఇబ్బంది పడుతున్న బాధితులతో మాట్లాడిస్తున్న హరీశ్‌రావు

 22ఏ భూముల విషయంలో వీరిద్దరూ ముద్దాయిలు

బీఆర్‌ఎస్‌ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ టి.హరీశ్‌రావు

ఒక్క పెన్నుపోటుతో లక్షలాది మంది ప్రజల భూములను నిషేధిత జాబితాలో చేర్చారు  

ఈ జాబితా నుంచి రేవంత్‌ ఇల్లు తొలగించినట్టే ప్రజల ఆస్తులు తొలగించాలి 

రాష్ట్రంలో 30 శాతం కమీషన్ల పాలనపై జ్యుడీషియల్‌ విచారణ జరపాలి 

భూముల దోపిడీ కోసమే 22ఏ నిషేధిత జాబితా: కేటీఆర్‌ 

నిషేధిత భూములపై తెలంగాణ భవన్‌లో పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వం బురద రాజకీయాలు, చిల్లర మాటలు మానుకుని కష్టార్జితమైన ప్రజల భూములను 22ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించాలని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ టి.హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు. దరఖాస్తుల పేరిట ప్రజలను ఆఫీసుల చుట్టూ తిప్పకుండా పారదర్శకంగా నిషేధిత జాబితా నుంచి తొలగించిన భూముల వివరాలను వెల్లడించాని కోరారు. 22ఏ అంశాన్ని అడ్డుపెట్టుకుని సాగుతున్న 30 శాతం కమీషన్ల పాలనపై జ్యుడిషియల్‌ విచారణ జరపాలని, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కేవలం సారీ చెప్పడంతో సరిపెట్టకుండా రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.

 22ఏ వెనుక జరుగుతున్న అవినీతి భాగోతంతో సీఎం రేవంత్‌రెడ్డికి సంబంధం ఉందని ఆరోపించారు. 22ఏ భూముల విషయంలో రేవంత్‌రెడ్డి ప్రథమ ముద్దాయి అయితే పొంగులేటి ఏ2 అని ధ్వజమెత్తారు. అసెంబ్లీ సమావేశాల నుంచి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌ నేపథ్యంలో శుక్రవారం తెలంగాణ భవన్‌లో హరీశ్‌రావు 22ఏ భూములపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీ రామారావుతో పాటు పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచి్చన బాధితులు 22ఏ జాబితాలో తమ భూములను పెట్టడం ద్వారా ఎదుర్కొంటున్న సమస్యలను ఏకరువు పెట్టారు.  

భూమి చుట్టూ రేవంత్‌ పరిభ్రమణం 
‘ఒక్క పెన్నుపోటుతో రాత్రికి రాత్రే తాతలు, తండ్రుల నుంచి లక్షలాది మంది ప్రజలకు సంక్రమించిన భూములను నిషేధిత జాబితాలో పెట్టి వారి జీవితాలను కన్నీళ్ల పాలు చేశారు. కేసీఆర్‌ పాలనలో ప్రజలు కేంద్రంగా ప్రభుత్వం నడిస్తే రేవంత్‌ పాలన మాత్రం భూముల కేంద్రంగా సాగుతోంది. సూర్యుడి చుట్టూ భూమి తిరిగినట్టు.. భూమి చుట్టూ రేవంత్‌ పరిభ్రమణం చేస్తున్నాడు. నిజానికి ప్రభుత్వ, పోరంబోకు, అసైన్డ్, దేవాదాయ, వక్ఫ్, ల్యాండ్‌ సీలింగ్‌ భూములను కాపాడేందుకే 22ఏ నిబంధన తీసుకొచ్చారు. కానీ ప్రస్తుతం ఊళ్లకు ఊళ్లు, కాలనీలు, అపార్ట్‌మెంట్లు, హెచ్‌ఎండీఏ, హుడా వేలం వేసిన భూములను సైతం నిషేధిత జాబితాలో చేర్చారు. ‘నిన్నటివరకు నీ భూమి.. పొద్దున లేస్తే నిషేధిత భూమి’అన్నట్లుగా మార్చారు. 22ఏ జాబితాలో ఉన్న సీఎం రేవంత్‌ ఇల్లును రాత్రికి రాత్రే జాబితా నుంచి తొలగించారు. అదే తరహాలో ప్రజల ఆస్తులను ఎందుకు తొలగించడం లేదు?..’అని హరీశ్‌రావు నిలదీశారు. 

ప్రతి నిర్ణయం వెనుకా భూ వ్యాపారమే 
‘లగచర్ల గిరిజనుల భూములు మొదలుకుని హిల్ట్‌ పాలసీ, హైడ్రా, మూసీ సుందరీకరణ, 22–ఏ వరకు అన్ని అంశాల వెనుక ఎజెండా భూములు కొల్లగొట్టడమే. సీఎం రేవంత్, ఆయన సోదరులు, మంత్రి పొంగులేటి ఆయన కుమారుడు భూములను లక్ష్యంగా చేసుకుని అక్రమాలు, అవినీతి, బెదిరింపులకు పాల్పడుతున్నారు. హెచ్‌సీయూకు చెందిన 400 ఎకరాలను కుదువ పెట్టి భారీ రుణం తెచ్చారు. అలాగే మేడ్చల్‌లో వేల ఎకరాలను తాకట్టు పెట్టి రుణం తెచ్చారు. మూసీ సుందరీకరణ వెనక వేల ఎకరాల భూ వ్యాపారం ఉంది. 

నాదర్‌గుల్‌లో ప్రభుత్వ భూముల వ్యవహారం, పొంగులేటి కుటుంబానికి సంబంధించిన భూముల కబ్జాలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలి. 22–ఏలో ఎన్ని ఎకరాలు చేర్చారు..ఎన్ని ఆస్తులు చేర్చారు.. ఎన్ని తొలగించారు.. ఏ కారణంతో తొలగించారో పూర్తి వివరాలను బహిరంగ పరచాలి..’అని హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు. నాదర్‌గుల్, అబ్దుల్లాపూర్‌మెట్, ఖాజాగూడ, గచి్చ»ౌలి, రాందాస్‌పల్లి, ఖానామెట్‌ తదితర చోట్ల 22ఏను అడ్డుపెట్టుకుని భూ కుంభకోణాలు జరుగుతున్నాయని పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు.  

ప్రభుత్వంలో గజానికో గజదొంగ: కేటీఆర్‌ 
రాష్ట్రంలో భూ దోపిడీ విపరీతంగా జరుగుతోందని కేటీఆర్‌ ఆరోపించారు. ముఖ్యమంత్రి భాగోతాలు బయటపడతాయనే బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను శాసనసభ నుంచి మెడపట్టి గెంటేశారని విమర్శించారు. బీఆర్‌ఎస్‌ హయాంలో 16 లక్షల ఎకరాలు నిషేధిత జాబితాలో ఉండగా, కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక కోటి 16 లక్షల ఎకరాలకు పెంచిందన్నారు. ‘ఈ ప్రభుత్వంలో గజానికో గజదొంగ’తయారయ్యాడని కేటీఆర్‌ ధ్వజమెత్తారు. సీఎం సోదరులు ‘తమ్ముడు.. లెట్స్‌ డూ కుమ్ముడు’అన్నట్టుగా భూములు కొల్లగొడుతున్నారని ఎద్దేవా చేశారు. మంత్రుల ముఠా ‘అలీబాబా అరడజను దొంగలు’గా తయారైందని ఆరోపించారు. బాధితుల పక్షాన బీఆర్‌ఎస్‌ పోరాటం చేస్తుందని భరోసా ఇచ్చారు.

తెలంగాణ భవన్‌కు పోటెత్తిన బాధితులు 
రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాలతో పాటు కరీంనగర్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, భువనగిరి తదితర జిల్లాల నుంచి 22ఏ జాబితా బాధితులు తెలంగాణ భవన్‌కు వచ్చారు. తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను వెల్లడించారు. బ్యాంకు రుణాలు, పిల్లల పెళ్లిళ్లు, చదువులపై 22ఏ అంశం ఎలా ప్రభావం చూపుతుందో వివరించారు. 22ఏ కారణంగా వారసత్వంగా సంక్రమించిన భూమిని తమ వారసులకు ఇవ్వలేకపోతున్నట్లు ఆసిఫాబాద్‌ జిల్లా సిర్పూరుకు చెందిన మల్లయ్య అనే రైతు ఆవేదన వ్యక్తం చేశారు. తన నియోజకవర్గం పరిధిలో గతంలో 22ఏ జాబితాలో ఉన్న భూములను తొలగించేందుకు చేసిన కృషిని ఎల్‌బీ నగర్‌ ఎమ్మెల్యే దేవిరెడ్డి సు«దీర్‌రెడ్డి వివరించారు. కానీ కాంగ్రెస్‌ అధికారంలోకి వచి్చన తర్వాత.. తన నియోజకవర్గం పరిధిలో కొత్తగా 40 కాలనీలను 22ఏ జాబితాలో చేర్చినట్లు ఆయన తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement