వాషింగ్టన్: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, మిషిగన్ డెమోక్రటిక్ సెనేట్ అభ్యర్థి అబ్దుల్ ఎల్-సయెద్ మధ్య మాటల యుద్ధం ముదిరింది. వాన్స్ భార్య, సెకండ్ లేడీ ఉషా వాన్స్‌ను ఉద్దేశించి ఎల్-సయెద్ సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలపై వాన్స్ తీవ్రంగా స్పందించారు. ‘‘నీ నోటితో నా భార్య పేరు ఎత్తొద్దు’’ అంటూ ఘాటు హెచ్చరిక చేశారు.
మిషిగన్‌లో రిపబ్లికన్ సెనేట్ అభ్యర్థి మైక్ రోజర్స్‌కు మద్దతుగా సోమవారం జరిగిన మాగా కంపెనీ ర్యాలీలో జేడీ వాన్స్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఎల్-సయెద్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘నా భార్య పేరును నీ నోటితో ఎత్తొద్దు. నీ స్థాయికి అందనంత దూరంలో ఆమె ఉంది’’ అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఎల్-సయెద్ చాలా చాలా చెడ్డ వ్యక్తి అంటూ విమర్శించారు.
ఎలా మొదలైంది?
ఎల్-సయెద్ గతంలో షరియా చట్టంపై చేసిన వ్యాఖ్యలను వాన్స్ ఇటీవల విమర్శించారు. అమెరికా కార్మిక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నానని చెప్పుకునే ఓ రాజకీయ నాయకుడు షరియా చట్టానికి మద్దతు ఇస్తున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా తన దివంగత తాతను గుర్తుచేసుకున్న వాన్స్.. ‘‘ఇది నా తాతకు తెలిసిన డెమోక్రటిక్ పార్టీ అయితే కాదు’’ అని వ్యాఖ్యానించారు.
దీనిపై స్పందించిన అబ్దుల్ ఎల్-సయెద్ Abdul El Sayed.. వాన్స్ తన తాత గురించి మాట్లాడిన వీడియోను ఎక్స్‌లో షేర్ చేస్తూ ఆయన భార్య ఉషా వాన్స్ పేరును ప్రస్తావించారు. ‘‘జేడీ ఉషాను కూడా తనతో పాటు గతంలోకి తీసుకెళ్లి తాతను కలిపిస్తారా?’’ అంటూ వ్యంగ్యంగా పోస్టు చేశారు. దీనిపై వాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అవతలి వాళ్ల కుటుంబ సభ్యుల గురించి మాట్లాడటం ఎల్-సయెద్‌కు ఓ విచిత్రమైన అలవాటుగా మారిందని విమర్శించారు. ఇకపై తన భార్య పేరును ప్రస్తావించవద్దని హెచ్చరించారు.
‘చాలా చాలా చెడ్డ వ్యక్తి’
ఎల్-సయెద్‌పై వాన్స్ మరిన్ని తీవ్ర ఆరోపణలు చేశారు. ఒకే వర్గం ప్రయోజనాల కోసం మిగిలినవారిని పట్టించుకోని రాజకీయ ధోరణి అమెరికాలో పెరుగుతోందని.. అందుకు ఎల్-సయెద్ ఉదాహరణ అని అన్నారు. తన మతానికి చెందినవారిపట్ల మాత్రమే సానుభూతి చూపుతూ, ఇతరుల సమస్యలను పట్టించుకోరని వాన్స్ ఆరోపించారు. నవంబర్ ఎన్నికల్లో ఎల్-సయెద్ రాజకీయాలను తిరస్కరించి, రిపబ్లికన్ అభ్యర్థి మైక్ రోజర్స్‌కు మద్దతు ఇవ్వాలని మిషిగన్ ఓటర్లను కోరారు.
వాన్స్‌కు ఎల్-సయెద్ కౌంటర్
వాన్స్ చేసిన ‘‘చెడు’’ వ్యాఖ్యలకు ఎల్-సయెద్ కూడా ఘాటుగానే స్పందిస్తూ ట్రంప్ సర్కార్‌పై మండిపడ్డారు. ‘‘పనిచేసే ప్రజల ఆరోగ్య సంరక్షణను తొలగించి బిలియనీర్లకు పన్ను రాయితీలు ఇవ్వడం చెడు. ట్రేడ్ వార్స్, నిజమైన యుద్ధాల వైపు వెళ్తూ ప్రజలపై నిత్యావసర వస్తువులు, ఇంధన ధరల భారాన్ని పెంచడం చెడు. రాజకీయ లబ్ధి కోసం ప్రజలను విభజించడం చెడు’’ అంటూ ఎదురుదాడి చేశారు. రిపబ్లికన్లు తమపై చేస్తున్న విమర్శలను మిషిగన్ ప్రజలు అర్థం చేసుకుంటున్నారని, నవంబర్ ఎన్నికల్లో ఓటుతో సమాధానం చెబుతారని అన్నారు.
షరియా, ఇజ్రాయెల్ అంశాలపై వివాదం
ఎల్-సయెద్‌పై రిపబ్లికన్లు గత కొంతకాలంగా షరియా చట్టం, ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదంపై ఆయన వైఖరిని లక్ష్యంగా చేసుకుంటున్నారు. మిషిగన్‌లోని ఓ సినగాగ్‌పై మార్చిలో జరిగిన దాడి తర్వాత ఎల్-సయెద్ చేసిన ‘‘హింస అనేది ఓ చక్రం’’ వంటి వ్యాఖ్యలు కూడా వివాదాస్పదమయ్యాయి. అయితే ఆ దాడిని, యూదు వ్యతిరేకతను ఆయన ఖండించారు.
అలాగే ఎల్-సయెద్‌కు వామపక్ష రాజకీయ విశ్లేషకుడు హసన్ పైకర్‌తో ఉన్న సంబంధాన్ని కూడా రిపబ్లికన్లు విమర్శిస్తున్నారు. పైకర్ గతంలో అమెరికా ‘‘9/11కు అర్హమైనదే’’ అనే వ్యాఖ్య చేయడం వివాదాస్పదమైంది. విమర్శలు రావడంతో పైకర్ తర్వాత తన వ్యాఖ్య సరికాదని వెనక్కి తీసుకున్నాడు.
మిషిగన్ పోరుపై ఆసక్తి
మిషిగన్ సెనేట్ ఎన్నిక ప్రస్తుతం అమెరికా రాజకీయాల్లో కీలక పోరుగా మారింది. సెనేట్ నియంత్రణను నిర్ణయించే అవకాశం ఉన్న ఆరు కీలక పోటీల్లో మిషిగన్ కూడా ఒకటిగా పరిగణిస్తున్నారు. ఈ నేపథ్యంలో వాన్స్–సయెద్ మధ్య మాటల యుద్ధం మరింత రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది.
అమెరికా సెకండ్ లేడీ ఉషా చిలుకూరి వాన్స్‌కు తెలుగు మూలాలున్నాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి అమెరికాకు వెళ్లిన కుటుంబంలో పుట్టిన ఆమె కాలిఫోర్నియాలో పెరిగారు. యేల్ లా స్కూల్‌లోనే జేడీ వాన్స్‌ను కలిసిన ఉషా.. 2014లో ఆయనను వివాహం చేసుకున్నారు. హిందూ సంప్రదాయంలోనూ వివాహ వేడుక నిర్వహించడం విశేషం. గతంలో డెమోక్రటిక్ పార్టీలో నమోదైన ఉషా.. రిపబ్లికన్ భర్త జేడీ వాన్స్ రాజకీయ ప్రయాణంలో కీలకంగా నిలిచారు.
ఇదీ చదవండి: ఇరాన్ ‘ఖర్గ్’పై ట్రంప్ పోస్ట్.. దానర్థం ఏంటంటే?


