ఏడాదిలో ఉండే 365 రోజుల్లో ప్రకృతి విపత్తులు ఎప్పుడైనా ఏర్పడవచ్చు....
ఒకట్రెండు ఒకే తేదీలో వస్తే.. కాకతాళీయం, యాదృచి్ఛకం అనుకుంటాం...
ఇలా కాకుండా బోలెడన్ని ప్రకృతి విపత్తులు.. 26వ తేదీనే వస్తే...?
ఆశ్చర్యపోవాల్సిందే. తాజాగా నేపాల్‌ను వరద ముంచేసింది కానీ...
గతంలో ఇదే 26వ తేదీ ఎన్ని విపత్తులు వచ్చాయో తెలుసా?
సుమారు 96 ఏళ్లు అవుతోంది.. 26వ తేదీ ప్రకృతి విపత్తులు సంభవించడమనే ఆశ్చర్యకరమైన ఘటనలు చోటు చేసుకోవడం. 1930లో టర్కీని కుదిపేసి 32,700 మంది ప్రాణాలు తీసిన భూకంపం సంభవించింది నవంబరు 26. ఆ తరువాత కూడా అనేకసార్లు నెలలు మారినా విపత్తులు మాత్రం 26వ తేదీనే జరగడం యాదృచి్ఛకం అని కొట్టిపారేయలేమేమో. ప్రకృతి వైపరీత్యాల మాట అలా ఉంటే మానవ తప్పిదాల కారణంగా చోటు చేసుకున్న భారీ దుర్ఘటనల్లో కొన్ని కూడా 26వ తేదీనే చోటు చేసుకున్నాయి. మచ్చుకు కొన్నింటిని చూద్దాం.
ఆగస్టు 26, 2026: నేపాల్‌ను ముంచేసిన మెరుపు వరదలు: హిమాలయ పర్వత శిఖరాల్లో ఓ హిమానీనదం అకస్మాత్తుగా విరిగి కిందకు పడటంతో నేపాల్‌లోని రసువా జిల్లాలో భోటే కోశి నదికి మెరుపు వరద వచ్చింది. దీంతో గ్రామాలు మునిగాయి. రోడ్లు, వంతెనలు కొట్టుకుపోయాయి. జలవిద్యుత్ ప్రాజెక్టులు, ఇతర మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి. ఆగస్టు 31 నాటికి 900 మందికి పైగా మృతి చెందారు. దాదాపు 4,500 మంది గల్లంతయ్యారు.
అక్టోబర్ 26, 2015: హిందూకుష్ భూకంపం: హిందూకుష్ ప్రాంతంలో 7.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. భారతదేశంసహా అఫ్గానిస్తాన్, పాకిస్తాన్, ఉత్తర కొన్ని ప్రాంతాలు ప్రభావితమయ్యాయి. దాదాపు 400 మంది మరణించారు.
మే 26, 2006: యోగ్యకర్త భూకంపం, ఇండోనేíసియా: ఇండోనేíÙయాలోని జావా ద్వీపంలో యోగ్యకర్త సమీపంలో 6.3 తీవ్రతతో భూకంపం వచ్చింది. వేల ఇళ్లు, భవనాలు ధ్వంసమయ్యాయి. 5,700 మందికి పైగా మృతి చెందారు.
జూలై 26, 2005: మహారాష్ట్ర వరదలు: మహారాష్ట్రను భారీ వర్షాలు ముంచెత్తాయి. రాజధాని ముంబైలో ఒకే ఒక్కరోజులో 944 మి.మీ. వర్షం నమోదైంది. రోడ్లు, ఇళ్లు, రైల్వే లైన్లు నీట మునిగాయి. జనజీవనం స్తంభించింది. రాష్ట్రం మొత్తమ్మీద 1,094 మంది మృతి చెందారు.
డిసెంబర్ 26, 2004: సునామీ ప్రళయం...
సుమత్రా తీరం సమీపంలో 9.1 తీవ్రతతో వచ్చిన భూకంపం సునామీగా మారి హిందూ మహాసముద్ర తీర దేశాలపై విరుచుకుపడింది. ఇండోనేసియా, శ్రీలంక, భారతదేశం, థాయిలాండ్ తీవ్రంగా ప్రభావితమయ్యాయి. దాదాపు 2,28,000 మంది మరణించగా మరెందరో గల్లంతయ్యారు. చరిత్రలోనే అత్యంత ప్రాణాంతక విపత్తుల్లో ఒకటిగా ఇది నమోదైంది.
డిసెంబర్ 26, 2003: బామ్ భూకంపం, ఇరాన్: ఇరాన్‌లో 6.6 తీవ్రతతో వచ్చిన భూకంపం చారిత్రక నగరం బామ్, చుట్టుపక్కల గ్రామాలను ధ్వంసం చేసింది. వేల భవనాలు మట్టిదిబ్బలుగా మారాయి. ఈ ప్రకృతి విపత్తులో సుమారు 31,000 మంది ప్రాణాలు కోల్పోయినట్లు గణాంకాలు చెబుతున్నాయి.
మార్చి 25–26, 2002: వరుస భూకంపాలతో అఫ్గానిస్తాన్ అతలాకుతలం: ఉత్తర అఫ్గానిస్తాన్‌లోని బఘ్లాన్ ప్రాంతంలో రాత్రిపూట వరుస భూకంపాలు సంభవించి 1800 మంది ప్రాణాలు బలితీసుకున్నాయి. మట్టి ఇళ్లు కూలిపోగా వేల మంది నిరాశ్రయులయ్యారు.
జనవరి 26, 2001: గుజరాత్ భూకంపం: 2001 జనవరి 26న గుజరాత్‌లో భయంకర భూకంపం సంభవించింది. ఫలితంగా కచ్ ప్రాంతం ధ్వంసమైంది. సుమారు 20,000 మంది ప్రాణాలు కోల్పోగా... 1,66,000 మందికి పైగా గాయపడ్డారు.
జూలై 26, 1963: స్కోప్జే భూకంపం: అప్పటి యుగోస్లేవియాలోని స్కోప్జే నగరంలో 6.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. నగరం ధ్వంసమైంది. 2,00,000 మంది నిరాశ్రయులయ్యారు. 1,070 మంది మృతి చెందారు.
నవంబర్ 26, 1943: లాడిక్ భూకంపం, టర్కీ: టర్కీలోని లాడిక్–సామ్‌సన్–హవ్జా ప్రాంతంలో 7.5 తీవ్రతతో భూకంపం వచ్చింది. టర్కీ ఉత్తర ప్రాంతంలో విస్తృత నష్టం జరిగింది. 4,020 మంది మృతి చెందారు.
డిసెంబర్ 26–27, 1939: ఎర్జింకాన్ భూకంపం, టర్కీ: టరీ్కలోని ఎర్జింకాన్ ప్రాంతంలో 7.8 తీవ్రతతో వచ్చిన భూకంపం 32,700 మంది ప్రాణాలు బలితీసుకుంది. అపారమైన ఆస్తినష్టం నమోదైంది.
మానవ తప్పిదాలు తెచ్చిన విపత్తులు...
→ సెప్టెంబర్ 26, 2023: ఖరాఖోష్ వెడ్డింగ్ హాల్ అగ్నిప్రమాదం...
ఇరాక్‌లోని మోసుల్ సమీపంలోని ఖరాఖోష్‌లోని వెడ్డింగ్ హాల్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. భవనం లోపలే పటాకులు పేల్చడంతో ఈ ప్రమాదం జరిగింది. పైరోటెక్నిక్స్ మండే పదార్థాలను తగలబెట్టాయి. నిండిన హాల్‌లో నిప్పు వేగంగా వ్యాపించింది. 100 మందికి పైగా మృతి చెందారు. పలువురు గాయపడ్డారు.
→ ఆగస్టు 26, 2021: కాబూల్ ఎయిర్‌పోర్ట్ బాంబు పేలుడు
అఫ్గానిస్తాన్‌లోని కాబూల్‌లోని హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో జరిగిన ఆత్మా హుతి దాడిలో 183 మంది మృతి చెందారు. వీరిలో 170 మంది ఆఫ్గాన్ పౌరులు, 13 మంది అమెరికా సైనికులు ఉన్నారు.
→ నవంబర్ 26, 2008: ముంబై ఉగ్రదాడులు
దేశాన్ని కుదిపేసిన అత్యంత భారీ ఉగ్రవాద దాడి ఇది. 2008 నవంబర్ 26 రాత్రి ముంబైలోకి ప్రవేశించిన పది మంది లష్కర్–ఎ–తొయిబా ఉగ్రవాదులు ఏకకాలంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ టెరి్మనస్, తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్ వంటి ప్రాంతాల్లో కాల్పులకు దిగారు. మూడు రోజుల పాటు సాగిన ఈ ఉగ్రదాడిలో భద్రతాదళాలు తొమ్మిది మంది ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. 166 మంది మృతి చెందారు. 300 మందికి పైగా గాయపడ్డారు.
→ మే 26, 1991: లాడా ఎయిర్ ఫ్లైట్ 004 ప్రమాదం
బ్యాంకాక్ నుంచి వియన్నాకు వెళ్తున్న లాడా ఎయిర్ బోయింగ్ 767 విమానం థాయిలాండ్‌లో కూలిపోయింది. ఇంజన్ థ్రస్ట్ రివర్సర్ అనూహ్యంగా విచ్చుకోవడంతో విమానం నియంత్రణ కోల్పోయి ముక్కలైపోయి కూలిపోయింది. ఈ ఘటనలో విమానంలో ఉన్న 223 మంది మృతి చెందారు.
– న్యూఢిల్లీ


