కేప్ కేనర్వాల్: సౌరకుటుంబంలోని బుధగ్రహం వేగంగా కుంచిచుకుపోతున్నట్లు శాస్త్రవేత్తల తాజా అధ్యయనం చెబుతోంది. ద్రాక్షపండు ఎండకు ఎండి ముడుతలుపడి ఎండుద్రాక్షగా మారినట్లు! జర్మనీ ఏరోస్పేస్ సెంటర్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ రీసెర్చ్ తెలిపిన వివరాల ప్రకారం బుధగ్రహం ఇలా కుంచించుకుపోవడం మునుపు వేసిన అంచనా కంటే 30 శాతం ఎక్కువగా ఉంది. గ్రహం వ్యాసం 4900 కిలోమీటర్లతే.. 23 కిలోమీటర్ల మేరకు సైజు తగ్గినట్లు వీరు చెబుతున్నారు. బుధగ్రహ ఉపరితలం చాలా ఎగుడుదిగుడుగా ఉంటుంది.
పైగా దీనిపైకి వచ్చిపడే ఉల్కా/గ్రహ శకలాల కారణంగా ఏర్పడే గుంతలు, వాటి నుంచి ఎగజిమ్మే శిథిలాల కారణంగా రూపురేఖలు నిత్యం మారుతూ ఉంటాయి. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే బుధ గ్రహ పరిశీలన కోసం యూరోప్, జపాన్‌లు కలిసి వారం రోజుల క్రితమే బెపికొలంబో పేరుతో ఒక అంతరిక్ష నౌకను ప్రయోగించడం. ఈ అంతరిక్ష నౌక నవంబరు నెలలో బుధగ్రహం కక్ష్యలో ప్రేవేశించనుంది. బెపీకొలంబలోని లేజర్ పరికరం అంతర్గత శీతలీకరణ కారణంగా గ్రహం ఎంత మేరకు ముడుతలు పడిందో (ఎండుద్రాక్ష చందంగా) లెక్క కట్టనుంది. సౌర కుటుంబంలోని అతి చిన్న గ్రహం బుధుడు సుమారు 450 కోట్ల సంవత్సరాల క్రితం ఉనికిలోకి వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటివరకూ అది నెమ్మదిగా కుంచించుకుపోతూనే ఉంది.


