జియో మెగా ప్లాన్.. ఆకాశంలోకి 1600 ఉపగ్రహాలు! | Reliance Jio To Place 1600 Satellites in 650 KM Orbit Higher Than Elon Musk Starlink | Sakshi
Sakshi News home page

జియో మెగా ప్లాన్.. ఆకాశంలోకి 1600 ఉపగ్రహాలు!

Sep 10 2026 8:44 PM | Updated on Sep 10 2026 8:56 PM

Reliance Jio To Place 1600 Satellites in 650 KM Orbit Higher Than Elon Musk Starlink

రిలయన్స్ జియో తన ప్రతిపాదిత 1,600 ఉపగ్రహాల శాటిలైట్ ఇంటర్నెట్ కాన్‌స్టెలేషన్‌ను భూమికి సమీపంలోని.. లో ఎర్త్ ఆర్బిట్‌ (LEO)లో ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ఈ ఉపగ్రహాలను భూమికి సుమారు 650 కిలోమీటర్ల ఎత్తులో ప్రవేశపెట్టాలని జియో ప్రతిపాదించింది.

రిలయన్స్ జియో శ్రీకారం చుట్టిన ఈ ప్రాజెక్టుకు సాంకేతిక అనుమతి లభించినప్పటికీ, కాన్‌స్టెలేషన్‌కు సంబంధించిన తుది ప్రణాళిక ఇంకా IN-SPACeకు సమర్పించాల్సి ఉంది. అయితే.. జియో ఎంచుకున్న 650 కిలోమీటర్ల కక్ష్య ప్రత్యేకంగా ఆసక్తికరంగా మారింది.

ఎందుకంటే.. ప్రస్తుతం స్పేస్‌ఎక్స్‌కు చెందిన స్టార్‌లింక్ ఉపగ్రహాలు సుమారు 550 కిలోమీటర్ల ఎత్తులో, అమెజాన్ లియో ఉపగ్రహాలు సుమారు 630 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నాయి. వీటితో పోలిస్తే జియో ఉపగ్రహాలు కొంచెం ఎక్కువ ఎత్తులో ఉండనున్నాయి. దీంతో.. తక్కువగా వినియోగిస్తున్న ఆర్బిటల్ బ్యాండ్‌లో పనిచేసే అవకాశం లభించి, భవిష్యత్తులో కక్ష్య స్థానాల సమన్వయం, స్పెక్ట్రమ్‌ సంబంధిత జోక్యాన్ని నిర్వహించడంలో కొంత ప్రయోజనం కలిగే అవకాశం ఉంది.

ఈ ప్రాజెక్టుకు సంబంధించిన సాంకేతిక పరిశీలనను IN-SPACe, ఇస్రో, కేంద్ర టెలికమ్యూనికేషన్స్ శాఖ అధికారులు కలిసి నిర్వహించారు. సాంకేతిక క్లియరెన్స్ ఇప్పటికే లభించినట్లు IN-SPACe అధికారులు వెల్లడించారు. అయితే.. ఉపగ్రహాల తుది సంఖ్య, కక్ష్యల అమరిక, ఇతర సాంకేతిక వివరాలతో కూడిన పూర్తి ప్రణాళిక ఇంకా అధికారికంగా సమర్పించాల్సి ఉంది.

జియో ప్రణాళిక ప్రకారం.. ఈ 1,600 ఉపగ్రహాల LEO కాన్‌స్టెలేషన్‌కు సంబంధించిన పరీక్షా ప్రయోగాలు 2027లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్ట్ విజయవంతమైతే భారత్‌లో శాటిలైట్ ఆధారిత బ్రాడ్‌బ్యాండ్ సేవలకు మరింత పోటీ ఏర్పడే అవకాశం ఉంది. ముఖ్యంగా.. భూభాగంలో ఫైబర్ లేదా మొబైల్ నెట్‌వర్క్‌ అందుబాటులో లేని మారుమూల ప్రాంతాలకు హై-స్పీడ్ ఇంటర్నెట్ అందించడంలో ఇలాంటి LEO ఉపగ్రహ నెట్‌వర్క్‌లు కీలకంగా మారవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement