హ్యూమనాయిడ్ రోబోల భవిష్యత్తుపై టెస్లా అధినేత ఎలాన్ మస్క్ (Elon Musk) సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే 10 సంవత్సరాల్లో ప్రపంచవ్యాప్తంగా కనీసం 100 కోట్ల హ్యూమనాయిడ్ రోబోలు వచ్చే అవకాశం ఉందని ఆయన అన్నారు.
ఒక్కో రోబో సాధారణ మనిషి కంటే కనీసం ఐదు రెట్లు ఎక్కువ ఉత్పాదకత కలిగి ఉంటుందని మస్క్ పేర్కొన్నారు. అలా చూస్తే.. 100 కోట్ల రోబోలు కలిపి చేసే పని ప్రపంచంలోని మొత్తం మానవుల కంటే ఎక్కువగా ఉండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. దీన్నిబట్టి చూస్తే మరో 10 ఏళ్లు మాత్రమే మనిషి ఉద్యోగం చేసుకోవడానికి అవకాశం ఉందని తెలుస్తోంది.
గణనీయంగా పెరగనున్న రోబోలు!
రోబోలు కేవలం పనులను చేయడం మాత్రమే కాకుండా.. ఇతర రోబోలను తయారు చేసే స్థాయికి చేరుకుంటాయని మస్క్ పేర్కొన్నారు. ఇలా ఒక రోబో మరిన్ని రోబోలను తయారు చేస్తే వాటి సంఖ్య చాలా వేగంగా పెరిగే అవకాశం ఉంటుంది. మొదట నెమ్మదిగా ప్రారంభమైన ఈ ప్రక్రియ తర్వాత వేగంగా విస్తరించే అవకాశం ఉందని మస్క్ వివరించారు.
ఒక హ్యూమనాయిడ్ రోబో ఎంత ఉపయోగకరంగా ఉంటుందనేది ప్రధానంగా మూడు విషయాలపై ఆధారపడి ఉంటుందని మస్క్ చెప్పారు. మొదటిది ఏఐ సాఫ్ట్‌వేర్ ఎంత సమర్థంగా పనిచేస్తుంది, రెండోది రోబోలో ఉపయోగించే ఏఐ చిప్ సామర్థ్యం, మూడోది రోబోకు ఉండే మెకానికల్ నైపుణ్యం, ముఖ్యంగా చేతులతో వస్తువులను మనుషుల్లా పట్టుకోవడం, కదిలించడం వంటి సామర్థ్యం. ఈ మూడు అంశాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నందున రోబోల సామర్థ్యం కూడా భారీగా పెరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
టెస్లా 'ఆప్టిమస్'పై లక్ష్యం
టెస్లా ఇప్పటికే ఆప్టిమస్ పేరుతో హ్యూమనాయిడ్ రోబోను అభివృద్ధి చేస్తోంది. ప్రమాదకరమైన, పదేపదే చేయాల్సిన లేదా మనుషులకు విసుగు కలిగించే పనులను ఈ రోబోలు చేయాలనేది టెస్లా లక్ష్యం. భవిష్యత్తులో ఆప్టిమస్ 10 లక్షల ఆప్టిమస్ రోబోలను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ రోబోలు భవిష్యత్తులో టెస్లా కంపెనీ విలువలో చాలా పెద్ద భాగాన్ని ఆక్రమించవచ్చని మస్క్ గతంలో కూడా చెప్పారు.
హ్యూమనాయిడ్ రోబోల విషయంలో చైనా కూడా వేగంగా ముందుకు వెళ్తోంది. బీజింగ్‌లో జరిగిన వరల్డ్ హ్యుమానాయిడ్ రోబోట్ గేమ్స్‌లో రోబోలు మనుషులు నెలకొల్పిన కొన్ని రికార్డులను కూడా అధిగమించాయి. ముఖ్యంగా 100 మీటర్ల పరుగులో రెండు రోబోలు ఉసేన్ బోల్ట్ ప్రపంచ రికార్డు 9.58 సెకన్ల కంటే వేగంగా పరుగెత్తాయి. దీన్నిబట్టి చూస్తే.. హ్యూమనాయిడ్ రోబోల సామర్థ్యం ఎంత వేగంగా అభివృద్ధి చెందుతోందో స్పష్టంగా అర్థమైపోతుంది.
ముందు జాబితాలో చైనా
2026 తొలి ఆరు నెలల్లో ప్రపంచవ్యాప్తంగా సుమారు 19,100 హ్యూమనాయిడ్ రోబోలు షిప్‌మెంట్ అయ్యాయి. గత ఏడాది ఇదే సమయంలో కేవలం 5,100 యూనిట్లు మాత్రమే ఉండగా.. ఏడాది వ్యవధిలో ఈ సంఖ్య మూడు రెట్లకు పైగా పెరిగింది. ఈ ఏడాది మొత్తం షిప్‌మెంట్లు సుమారు 60,000 యూనిట్లకు చేరవచ్చని అంచనా. 2030 నాటికి ఈ సంఖ్య 5 లక్షలకు చేరే అవకాశం ఉందని పరిశోధనా సంస్థలు భావిస్తున్నాయి. ఇందులో చైనా కంపెనీల వాటా 97 శాతానికి పైగా ఉండటం విశేషం.
ఎలాన్ మస్క్ అంచనా నిజమైతే.. రాబోయే దశాబ్దంలో హ్యూమనాయిడ్ రోబోలు పరిశ్రమలు, తయారీ రంగం, ప్రమాదకర పనులు, రోజువారీ సేవలు వంటి అనేక రంగాల్లో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. అయితే.. అదే సమయంలో మనుషుల ఉద్యోగాలపై రోబోల ప్రభావం ఎంత ఉంటుంది? అనే ప్రశ్న కూడా ఎదురవుతోంది. ఒకవైపు రోబోలు ఉత్పాదకతను పెంచగలిగితే.. మరోవైపు కొన్ని పనులకు మానవుల అవసరం తగ్గే అవకాశం ఉంది. అందుకే మస్క్ చేసిన ఈ అంచనా కేవలం టెక్నాలజీ అభివృద్ధి గురించే కాకుండా.. భవిష్యత్తులో మనిషి-రోబో సంబంధం ఎలా ఉండబోతుందనే విషయంపై కూడా పెద్ద చర్చకు దారితీస్తోంది.
Elon Musk says there will be at least a billion humanoid robots within ten years at five times human output, making them "more productive than all humans combined." pic.twitter.com/e5nzBVcJfd
— Catch Up (@CatchUpFeed) September 5, 2026


