ఆయన పార్టీ ఫిరాయించినట్లు నిర్ధారణ.. శాసనసభ సభ్యత్వానికి అనర్హుడిగా ప్రకటన
అసెంబ్లీ స్పీకర్ జారీ చేసిన ఉత్తర్వులు రద్దు చేస్తూ సీజే ధర్మాసనం సంచలన తీర్పు
2024 ఏప్రిల్ 23 నుంచి ఖైరతాబాద్ నియోజకవర్గ స్థానం ఖాళీగా ఉన్నట్లేనని వెల్లడి
స్పీకర్ కార్యదర్శికి, కేంద్ర ఎన్నికల సంఘానికి తీర్పు ప్రతి పంపాలని రిజిస్ట్రీకి ఆదేశం
అప్పీలుకు వీలుగా తీర్పు అమలు నిలిపివేయాలన్న దానం న్యాయవాది
ఊరటనివ్వని ధర్మాసనం.. రాష్ట్ర చరిత్రలో కోర్టు వేటుపడ్డ తొలి ఎమ్మెల్యేగా నాగేందర్
సాక్షి, హైదరాబాద్: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేస్తూ హైకోర్టు చీఫ్ జస్టిస్ ధర్మాసనం సంచలన తీర్పునిచ్చింది. బీఆర్‌ఎస్ సభ్యుడిగా కొనసాగుతూ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసినందుకు రాజ్యాంగంలోని ఆర్టీకల్ 191 (2), రెడ్‌విత్ పదవ షెడ్యూల్‌లోని పేరా 2 (1)ఏ ప్రకారం 2024 ఏప్రిల్ 23 నుంచి రాష్ట్ర శాసనసభ సభ్యత్వానికి అనర్హుడిగా ప్రకటించింది. దానం పార్టీ మారలేదంటూ మార్చిలో స్పీకర్ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేస్తూ రిట్ పిటిషన్లను అనుమతించింది. బీఆర్‌ఎస్ సభ్యుడిగా ఉంటూ 2024లో కాంగ్రెస్ నుంచి సికింద్రాబాద్ లోక్‌సభ అభ్యర్థిగా దానం నాగేందర్ పోటీ చేశారని హైకోర్టు గుర్తుచేసింది.
సంబంధిత శాసనసభ నియోజకవర్గ స్థానం ఖాళీగా మారినట్లు స్పష్టం చేసింది. ఈ ఉత్తర్వుల ప్రతులను శాసనసభ స్పీకర్ కార్యదర్శికి, కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించాలని రిజిస్ట్రీని ఆదేశించింది. ప్రజాప్రయోజనాల దృష్ట్యా అప్పీలుకు వీలుగా ఉత్తర్వుల అమలును నిలిపివేయాలంటూ దానం తరఫు న్యాయవాది అభ్యర్థించినప్పటికీ దీనిపై ఎలాంటి నిర్ణయం వెలువరించకుండానే ప్రత్యేక ధర్మాసనం విచారణ ముగించింది. పార్టీ మారినట్లు ప్రకటిస్తూ ఓ ఎమ్మెల్యేపై ఉన్నత న్యాయస్థానం అనర్హత వేయడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి.
స్పీకర్ తీర్పును బీఆర్‌ఎస్, బీజేపీ సవాల్ చేయడంతో..
బీఆర్‌ఎస్ నుంచి గెలిచిన దానం నాగేందర్.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్‌లో చేరినందున ఆయనపై అనర్హత వేటు వేయాలంటూ స్పీకర్‌కు బీఆర్‌ఎస్ ఫిర్యాదు చేయడం తెలిసిందే. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈ అంశంపై విచారణ చేపట్టిన స్పీకర్ (ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో) దానం నాగేందర్ చట్టపరంగా పార్టీ మారలేదంటూ తీర్పునిచ్చారు. ఈ తీర్పును సవాల్ చేస్తూ బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన సీజే ధర్మాసనం గత నెల 21న తీర్పు రిజర్వు చేసింది. ఈ పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్ స్పెషల్ బెంచ్ శుక్రవారం కీలక తీర్పు వెలువరించింది. తీర్పు కాపీలో ధర్మాసనం పేర్కొన్న కీలకాంశాలు..
కాంగ్రెస్ నుంచి లోక్‌సభకు..
2023లో బీఆర్‌ఎస్ తరఫున ఎమ్మెల్యేగా గెలిచి.. ఆ తర్వాత 2024లో కాంగ్రెస్ అభ్యర్థిగా సికింద్రాబాద్ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన దానం నాగేందర్ శాసనసభ సభ్యత్వానికి అనర్హుడయ్యారు. 2024 ఏప్రిల్ 23 నుంచి ఆయన అనర్హత వర్తిస్తుంది. దీంతో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న శాసనసభ స్థానం ఖాళీ అయినట్లే.
స్పీకర్ నిర్ణయంపై న్యాయ సమీక్ష..
రాజ్యాంగంలోని పదవ షెడ్యూల్ కింద అసెంబ్లీ స్పీకర్ ట్రిబ్యునల్‌గా వ్యవహరించినప్పుడు ఆయన నిర్ణయాన్ని పూర్తిగా న్యాయ సమీక్ష పరిధికి వెలుపల ఉంచలేం. కిహోటో హోలోహన్ వర్సెస్ జాచిల్లు కేసులో సుప్రీంకోర్టు 1992లో ఇచ్చిన తీర్పు ప్రకారం.. స్పీకర్ నిర్ణయంలో రాజ్యాంగపరమైన నిబంధనల ఉల్లంఘన, దురుద్దేశం, సహజ న్యాయ సూత్రాల ఉల్లంఘన వంటి లోపాలు ఉంటే ఆర్టీకల్ 226 కింద హైకోర్టు జోక్యం చేసుకోవచ్చు.
బయటి చర్యలపైనా అనర్హత..
ఎమ్మెల్యే సభ వెలుపల చేసిన చర్యలను పదవ షెడ్యూల్ కింద పరిశీలించే అధికారం స్పీకర్‌కు లేదన్న అభిప్రాయం సరికాదు (వేరే రాజకీయ పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా పార్టీ సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకున్నట్లు పరిగణించిన పలు సుప్రీంకోర్టు తీర్పులను ధర్మాసనం ప్రస్తావించింది). ముఖ్యంగా డాక్టర్ మహాచంద్ర ప్రసాద్ సింగ్ కేసులో.. ఒక పార్టీ తరఫున ఎన్నికైన ఎమ్మెల్సీ మరో పార్టీ తరఫున పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడం స్వచ్ఛందంగా పార్టీ సభ్యత్వాన్ని వదులుకోవడమేనని సుప్రీంకోర్టు చెప్పిన విషయాన్ని మరవొద్దు.
సభ వెలుపలి అంశాలపైనా..
లోక్‌సభ ఎన్నికల్లో మరో పార్టీ తరఫున పోటీ చేయడం శాసనసభ కార్యకలాపాలను ప్రభావితం చేయదని, టెన్త్ షెడ్యూల్ వర్తించదని స్పీకర్ పేర్కొనడం సరికాదు. ఇలాంటి చర్యలు కూడా టెన్త్ షెడ్యూల్‌లోని పేరా 2(1)(ఏ) పరిధిలోకి వస్తాయి. గతంలో కొండా మురళీధర్‌రావు, ఆర్. భూపతిరెడ్డి, రవి ఎస్.నాయక్, రాజేంద్రసింగ్ రాణా తదితర కేసుల్లోనూ సభ వెలుపల చర్యల ఆధారంగా అనర్హతను పరిశీలించిన విషయం ప్రస్తావనార్హం.
నాలుగు పత్రాలే కీలకం..
ఏలేటి మహేశ్వర్‌రెడ్డి వేసిన పిటిషన్‌లో కీలకంగా నాలుగు పత్రాలను పరిగణనలోకి తీసుకోవాలి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థిగా దానం నాగేందర్ దాఖలు చేసిన ఫారమ్–26, బీఆర్‌ఎస్ నుంచి ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఎన్నికైనట్లు వెలువడిన గెజిట్ నోటిఫికేషన్, 2024 ఏప్రిల్ 23న సికింద్రాబాద్ లోక్‌సభ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా ఆయన దాఖలు చేసిన ఫారమ్–26, కాంగ్రెస్ అభ్యర్థిగా ఆయన పేరున్న ఫారమ్–7ఏ. వాటిని దానం నాగేందర్ తన కౌంటర్‌లో ఖండించలేదు.
మళ్లీ ఆధారాల భారం వేయలేరు..
బీఆర్‌ఎస్ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికైన విషయం, కాంగ్రెస్ తరఫున లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన విషయం, 2024 ఏప్రిల్ 23న కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన విషయం, బీఆర్‌ఎస్ అభ్యర్థికి వ్యతిరేకంగా ప్రచారం చేసిన విషయం వంటి కీలక అంశాలను నాగేందర్ ఖండించలేదు. ఇలాంటి వాస్తవాలు అంగీకరించినప్పుడు మళ్లీ వాటి నిరూపణకు ఆధారాలపై భారం వేయడం సరికాదు.
గెజిట్, అధికారిక పత్రాలకు ప్రాధాన్యం
పిటిషనర్లు సమర్పించిన పత్రాలు ఒరిజినల్ లేదా సర్టీఫైడ్ కాపీలు కావని, వాటికి ఆధార విలువ లేదన్న స్పీకర్ అభిప్రాయం తిరస్కరణీయం. గెజిట్ వంటి అధికారిక పత్రాల ప్రామాణికతపై భారతీయ సాక్ష్య అధినియం 2023లోని సెక్షన్లు 80, 81ను గుర్తుంచుకోవాలి.
బీఆర్‌ఎస్ మౌనం అనర్హతను కాపాడదు..
నాగేందర్‌పై బీఆర్‌ఎస్ క్రమశిక్షణ చర్య తీసుకోలేదని, ఆయన్ను పార్టీ ఎమ్మెల్యేగానే కొనసాగించిందని స్పీకర్ పరిగణనలోకి తీసుకున్నారు. ఈ అంశం అనర్హతను నిర్ధారించకుండా ఉండటానికి కారణం కాదు. పదవ షెడ్యూల్‌లోని పేరా 2 (1) (ఏ) కింద ఒక సభ్యుడు పార్టీ సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదిలేశాడా లేదా అన్నదే ప్రధాన ప్రశ్న. పార్టీ చర్యలు తీసుకున్నా తీసుకోకపోయినా అప్పటికే అమలైన అనర్హతను తొలగించలేవు.
స్పీకర్ ఆదేశం చెల్లదు..
స్పీకర్ నాలుగు అంశాలపై ఇచ్చిన ఉత్తర్వులు రాజ్యాంగపరమైన బాధ్యతలకు విరుద్ధం. చట్టపరంగా చెల్లవు. 1986 నిబంధనలను ఆధారంగా చేసుకొని అనర్హత పిటిషన్లను తిరస్కరించడం కూడా సుప్రీంకోర్టు నిర్దేశించిన న్యాయసూత్రాలకు విరుద్ధం.
2024 ఏప్రిల్ 23 నుంచే..
కాంగ్రెస్ తరఫున సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గానికి 2024 ఏప్రిల్ 23న దానం నామినేషన్ దాఖలు చేసిన తేదీనే ఆయన బీఆర్‌ఎస్ సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదిలిన తేదీగా పరిగణించాలి. అనంతర పరిణామాలు ఆ అనర్హతను తొలగించలేవు. సుప్రీంకోర్టు ‘సుభాష్ దేశాయ్’తీర్పులో చెప్పినట్లుగా.. అనర్హత పార్టీ మార్పు, ఫిరాయింపునకు కారణమైన చర్య జరిగిన తేదీ నుంచే వర్తిస్తుంది.
మా పరిస్థితి ఏమిటో అని కొందరు.. ఏమీ కాదన్న ధీమాలో ఇంకొందరు
బీఆర్‌ఎస్ నుంచి గెలిచిన కాంగ్రెస్‌లో చేరారంటూ కాలే యాదయ్య, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, కడియం శ్రీహరి, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, టి.ప్రకాశ్ గౌడ్, ఎ.గాంధీ, తెల్లం వెంకట్‌రావు, సంజయ్‌కుమార్‌పై దాఖలైన పిటిషన్లలో వాదనలు ఇంకా కొనసాగుతున్నాయి. తమ భవిష్యత్ ఎలా ఉంటుందో అన్న మీమాంస పార్టీ మారినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కొందరు ఎమ్మెల్యేల్లో నెలకొంది. మరికొందరు మాత్రం.. ఎంపీగా పోటీ చేసినందునే ఆయనపై న్యాయస్థానం అనర్హత వేటు వేసిందని, తమపై అలాంటి ఆరోపణ లేదని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.


