ముందస్తు కార్యాచరణ అమలు చేస్తున్నాం.. | Telangana El-Nino Fffect Water Shortage Power Demand | Sakshi
Sakshi News home page

ముందస్తు కార్యాచరణ అమలు చేస్తున్నాం

Sep 19 2026 7:38 AM | Updated on Sep 19 2026 7:40 AM

Telangana El-Nino Fffect Water Shortage Power Demand

రాష్ట్రంలో వర్షపాతం లోటుతో విద్యుత్‌ డిమాండ్‌ పెరిగింది

ఏడాది పాటు ఎల్‌నినో ప్రభావం ఉంటుందని అంచనా

12 నెలల కాలానికి నీటి భద్రత కార్యక్రమాలు చేపడుతున్నాం

శాసనసభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

సాక్షి, హైదరాబాద్‌: ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో లోటు వర్షపాతం.. ఫలితంగా జలాశయాల్లోకి నీటి ప్రవాహం తగ్గుదల, వ్యవసాయంపై ఒత్తిడి, విద్యుత్‌ డిమాండ్‌ పెరుగుదల వంటి పరిణామాలు తలెత్తాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఈ సమస్య తీవ్రతను ముందుగానే అంచనా వేసి ఏప్రిల్‌ నుంచే వివిధ శాఖల సమన్వయంతో ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టిందన్నారు. శాసనసభలో ఎల్‌నినోపై లఘు చర్చ సందర్భంగా భట్టి మాట్లాడారు.

సెప్టెంబర్‌ 18 నాటికి సాధారణంగా 640 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, ఈ ఏడాది 543 మిల్లీమీటర్లు మాత్రమే నమోదైందన్నారు. ఎల్‌నినో పరిస్థితులు రాబోయే ఏడాది వరకు కొనసాగే అవకాశం ఉన్నందున ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటిని అత్యంత పొదుపుగా వినియోగించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. కృష్ణా బేసిన్‌లోని ప్రధాన, మధ్య తరహా ప్రాజెక్టుల మొత్తం 553 టీఎంసీల సామర్థ్యానికి ప్రస్తుతం 311 టీఎంసీల నీరు మాత్రమే ఉందని, గోదావరి బేసిన్‌లో 255 టీఎంసీలకు గాను 154 టీఎంసీలు ఉన్నాయని తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా 808 టీఎంసీల సామర్థ్యానికి 465 టీఎంసీల నీరు మాత్రమే అందుబాటులో ఉందన్నారు. రిజర్వాయర్లు, చెరువులను నింపేందుకు మహాత్మా గాంధీ కల్వకుర్తి, జవహర్‌ నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, రాజీవ్‌ భీమా, జె.చొక్కారావు దేవాదుల, అలీసాగర్, గుత్ప ఎత్తిపోతల పథకాల ద్వారా చర్యలు చేపట్టామని చెప్పారు. వర్షాలు తగ్గడంతో జలవిద్యుత్‌ ఉత్పత్తి కూడా పడిపోయిందని, గత ఏడాది ఇదే సమయంలో 1,940 మెగావాట్లుగా ఉన్న హైడల్‌ ఉత్పత్తి ఈ ఏడాది 422 మెగావాట్లకు పరిమితమైందని తెలిపారు. సెప్టెంబర్‌ 9న ఉదయం 10.41 గంటలకు తెలంగాణలో 19,543 మెగావాట్ల గరిష్ట విద్యుత్‌ డిమాండ్‌ నమోదైందని, గతేడాది సెప్టెంబర్‌ 9న గరిష్ట డిమాండ్‌ 15,585 మెగావాట్లు కాగా, ఈ ఏడాది దాదాపు 4,000 మెగావాట్ల అదనపు భారం ఏర్పడిందన్నారు.

ప్రాణహిత–చేవెళ్ల కడదామా? వద్దా? 
తుమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల ఎత్తుతో డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును నిర్మించేందుకు తమ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ప్రాజెక్టు నిర్మాణానికి బీజేపీ సహకరిస్తుందా? లేదా? స్పష్టంగా చెప్పాలని డిమాండ్‌ చేశారు. బీజేపీ సభ్యులు ప్రాణహిత–చేవెళ్ల అంశాన్ని ప్రస్తావించడంతో భట్టి స్పందించారు.

కరువుపై కేంద్ర సాయం ఏదీ: మంత్రి పొన్నం ప్రభాకర్‌  
ఎల్‌నినో ప్రభావంతో కరువు పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఏవిధంగా సహకరిస్తుందో బీజేపీ శాసనసభాపక్ష నేత మహేశ్వర్‌రెడ్డి చెప్పాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో నలుగురు బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారని, తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు పూర్తి చేసి ఆదిలాబాద్‌కు నీళ్లు అందించేందుకు సహకరిస్తారా అని మహేశ్వర్‌రెడ్డిని ప్రశ్నించారు.  

ఉపాధి విషయంలో ప్రత్యేక చర్యలు: మంత్రి సీతక్క 
ఎల్‌నినో ప్రభావం తెలంగాణపై తీవ్రంగానే ఉండనున్నందున ఉపాధి విషయంలో ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని మంత్రి సీతక్క తెలిపారు.  లఘు చర్చలో ఆమె మాట్లాడారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో తాగునీటి భద్రత, గ్రామీణ ఉపాధి, నీటి సంరక్షణకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. తక్కువ నీటితో సాగయ్యే పంటల వైపు రైతులను మళ్లించేందుకు ప్రభుత్వం అవగాహన కల్పిస్తోందని చెప్పారు.

రాష్ట్రంలోని 34 జలాశయాలను తాగునీటి సరఫరాకు వినియోగిస్తున్నామని, జలాశయాల్లో నీటి మట్టాలను ప్రతిరోజూ పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. నీటి కొరతను ఎదుర్కొనేందుకు చేతిపంపులు, బావులు, స్థానిక నీటి సరఫరా పథకాలను సిద్ధంగా ఉంచామని, అవసరమైతే బోర్లను అద్దెకు తీసుకుని సమీప వనరుల నుంచి నీటిని తరలించే ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి చెప్పారు. వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపునకు ‘తెలంగాణ జల సిరి’కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఉపాధి హామీ కూలీలకు ఇందిరమ్మ ఆతీ్మయ భరోసా కింద రూ.50 కోట్లను చెల్లించినట్టు సీతక్క తెలిపారు.

జాతీయ విపత్తుగా ప్రకటించాలి: కూనంనేని 
ఎల్‌నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో జాతీయ విపత్తుగా ప్రకటించి రాష్ట్రానికి కేంద్ర ఆర్థిక సహాయాన్ని అందించాలని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు డిమాండ్‌ చేశారు. కరువు జిల్లాలను ప్రకటించి రైతులు, ప్రజలను ఆదుకోవాలని కోరారు. లఘు చర్చలో ఆయన మాట్లాడారు. ఎల్‌నినో నేపథ్యంలో ఈ ఏడాది పాత ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించి కూలీలను ఆదుకోవాలని సూచించారు. రాష్ట్రంలో కరెంట్‌ కోతలపై రైతులు ఆందోళనలను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ ద్వారా ఏపీ కృష్ణా జలాలను అక్రమంగా తరలించుకుంటోందని వస్తున్న ఆరోపణలపై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్‌ చేశారు.  

సీఎం సొంత గ్రామం రైతులకే దిక్కు లేదు.. ఏలేటి 
ఎల్‌నినో ప్రభావంపై డాక్టర్‌ చిన్నారెడ్డి నేతృత్వంలోని నిపుణుల కమిటీ సిఫారసుల మేరకు రూ.802.92 కోట్లను ఖర్చు చేశారా అని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీజేపీఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ప్రశ్నించారు. కమిటీ సిఫారసులను ప్రభుత్వం అమలు చేయలేదని తప్పుబట్టారు. చిన్నారెడ్డిని ప్రణాళిక సంఘం వైస్‌ చైర్మన్‌ పదవి నుంచి తొలగించిన నేపథ్యంలో నిపుణుల కమిటీ ఉందో లేదో తెలపాలని డిమాండ్‌ చేశారు. ప్రత్యామ్నాయ ప్రణాళిక అమలు చేయకపోవడంతో రైతులు నష్టపోయారని విమర్శించారు. వర్షాలు లేక రైతులకు బోరుబావులే దిక్కు అయ్యాయని, కరెంట్‌ ఎక్కడ అని ప్రశ్నించారు. 6–8 గంటలు కూడా సరిగ్గా కరెంట్‌ ఇవ్వడం లేదని విమర్శించారు.

కరువు నేపథ్యంలో రైతుల నుంచి పంట రుణాలు వసూలు చేయకుండా బ్యాంకర్లకు సూచనలు జారీ చేయాలని బీజేపీ సభ్యుడు పాయల్‌ శంకర్‌ సూచించారు. రాష్ట్రంలో ప్రధానమంత్రి పంటల బీమా పథకాన్ని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలోని 100 శాతం ఇళ్లకు మిషన్‌ భగీరథ నీళ్లు వస్తున్నాయని సభలో ప్రభుత్వం ఇచ్చిన సమాధానం పూర్తిగా అవాస్తవమని, కేవలం 40 శాతం ఇళ్లకే వస్తోందని మరో సభ్యులు పాల్వాయి హరీశ్‌బాబు ఆరోపించారు.   

ఇదీ చదవండి: 22ఏ సమస్యల పరిష్కారానికి ఉన్నత స్థాయి కమిటీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement