పక్క రాష్ట్రాల నుంచి చేప పిల్లల కొనుగోలుకు ఏటా.. రూ.90 కోట్ల వ్యయం
రాష్ట్రంలో 500 ఎకరాల్లో 28 చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాలు
21 కేంద్రాలు పూర్తిస్థాయిలో వినియోగానికి అనుకూలం.. ఏటా 120 కోట్ల చేప పిల్లలు ఉత్పత్తి చేసే సామర్థ్యం
కానీ కొన్ని పరిమిత స్థాయిలోనే వినియోగం..ఆక్రమణల్లో మరికొన్ని
సమర్థవంతమైన ప్రణాళిక, పర్యవేక్షణ లోపంతో మత్స్యకారులకు సమస్యలు
కాంట్రాక్టర్ల ద్వారా చేపల కొనుగోలుకు పదేళ్లలో రూ.900 కోట్ల వ్యయం
టెండర్లలో అవినీతి, మత్స్యకారులకు నాణ్యత లేని చేప పిల్లల పంపిణీ ఆరోపణలు
ఉత్పత్తి కేంద్రాలు పునరుద్ధరించి, ట్యాంకులకు మరమ్మతులు చేస్తే ఏటా రూ.70 కోట్లు ఆదా!
10 రకాల చేపలను పెంచుకునే చాన్స్
(గౌటే దేవేందర్)
రాష్ట్రంలో చేప పిల్లల ఉత్పత్తికి వీలుగా సహజసిద్ధమైన వనరులు ఉన్నాయి. చెరువులు, రిజర్వాయర్లు, ప్రభుత్వ అధీనంలో భూములు, ట్యాంకులు, ఉత్పత్తి కేంద్రాలు ఉన్నాయి. మత్స్యకారుల సహకార సంఘాలు ఉన్నాయి. కానీ ఈ వ్యవస్థను పూర్తి స్థాయిలో వినియోగించే సమర్థవంతమైన ప్రణాళిక, పర్యవేక్షణ లేకపోవడం మత్స్యకారుల పాలిట శాపంగా మారుతోంది. ఏటా అవసరమైన చేప పిల్లల కోసం పొరుగు రాష్ట్రాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఉండటం, ఇందుకోసం టెండర్ల ఖరారులో జాప్యం, అవినీతి ఆరోపణలు, నాణ్యత లేని లేదా కల్తీ చేప పిల్లల పంపిణీ, సరైన సమయంలో చెరువుల్లోకి పిల్లలను వదలకపోవడం వంటి సమస్యలు మత్స్యకారులను వేధిస్తున్నాయి.
రాష్ట్రంలోనే వందల ఎకరాల్లో విస్తరించిన ప్రభుత్వ చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాలు ఉన్నప్పటికీ, వాటిని పూర్తి స్థాయిలో వినియోగించకుండా పక్క రాష్ట్రాల నుంచి చేప పిల్లలను ఎందుకు కొనుగోలు చేసి పంపిణీ చేస్తున్నారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. గత పదేళ్లలో దాదాపు రూ.900 కోట్ల మేరకు ప్రభుత్వ నిధులు కాంట్రాక్టర్ల ద్వారా చేప పిల్లల కొనుగోలుకు వెచి్చంచినట్లు అంచనాలు ఉన్నాయి. అంటే ఏటా సగటున రూ.90 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్న పరిస్థితి ఉంది. ఇలా ఒకవైపు భారీ మొత్తంలో ప్రజాధనం ఖర్చు చేస్తుండగా.. మరోవైపు రాష్ట్రంలోని సొంత ఉత్పత్తి కేంద్రాలు మాత్రం నిరుపయోగంగా ఉండటం చర్చనీయాంశంగా మారింది.
పునరుద్ధరణలో నిర్లక్ష్యం!: రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో మొత్తం 28 చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాలు ఉన్నాయి. అయితే వీటిలో 21 కేంద్రాలు చేప పిల్లల ఉత్పత్తికి పూర్తిస్థాయిలో అనుకూలంగా ఉన్నాయి. అయితే వాటిలో కొన్ని పరిమిత స్థాయిలో మాత్రమే ఉపయోగంలో ఉండగా, మరికొన్ని కేంద్రాలు సగం వరకు మాత్రమే వినియోగంలో ఉన్నాయి. ఇంకొన్ని ఆక్రమణలకు గురయ్యాయి. మరికొన్ని కేంద్రాలు నిర్వహణ లోపంతో శిథిలావస్థకు చేరుకున్నాయి.
ట్యాంకులు, మౌలిక వసతులు అందుబాటులో ఉన్నప్పటికీ వాటిని పునరుద్ధరించి వినియోగించడంలో నిర్లక్ష్యం జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. ప్రధానంగా ఎస్సారెస్పీ కింద పోచంపాడులో 240కి పైగా ట్యాంకులు ఉన్నాయి. ఇందులో 80 ట్యాంకుల్లో మాత్రమే చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాలుగా ఉపయోగిస్తున్నారు. మిగతా అనీ ఖాళీగా ఉన్నాయి. తర్వాత స్థానంలో కరీంనగర్, మెదక్ ఉన్నాయి. ఈ కేంద్రాలు కేవలం పేరుకే ఉన్నవి కావు. వీటికి భారీ స్థాయిలో చేప పిల్లలను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది. మొత్తం దాదాపు 500 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఉత్పత్తి కేంద్రాలను పూర్తి స్థాయిలో వినియోగంలోకి తెస్తే ప్రతి ఏటా 120 కోట్లకు పైగా చేప పిల్లలను ఉత్పత్తి చేసే అవకాశం ఉందనే అంచనాలు ఉన్నాయి.
మెదక్ కేంద్రం.. సగానికి పైగా ఆక్రమణ!
రాష్ట్రంలోని చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాల్లో మెదక్ కేంద్రం పరిస్థితి ప్రత్యేకంగా చర్చనీయాంశంగా మారింది. 15.35 ఎకరాల్లో 116 ట్యాంకులున్నాయి. 4 బ్రూడర్, 4 సెగ్రిగేషన్ ప్యాన్స్ ఉండగా మరమ్మతులు లేకపోవడంతో శిథిలావస్థకు చేరుకున్నాయి. ఇప్పుడు కేలం 21 ట్యాంకులు, 3 బ్రూడర్లు మాత్రమే పని చేస్తున్నాయి. 1961లో నిర్మించిన వీటికి మరమ్మతులు లేక నిరుపయోగంగా మారడంతో సగానికి పైగా భూమి ఆక్రమణకు గురైనట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంపై అధికారులు విచారణకు ఆదేశించినట్లు సమాచారం.
ప్రతి కేంద్రానికి 3 అధికారులు.. రాష్ట్రానికి సరిపడా ఉత్పత్తి!
ఉత్పత్తి కేంద్రాల నిర్వహణకు సిబ్బంది కొరత కూడా ప్రధాన సమస్యగా మారింది. ప్రతి కేంద్రానికి కనీసం ముగ్గురు చొప్పున ప్రత్యేక సిబ్బంది లేదా అధికారులు నియమించి, వారి పర్యవేక్షణలో ఉత్పత్తి కార్యక్రమాలను నిర్వహిస్తే రాష్ట్రానికి అవసరమైన స్థాయిలో చేప పిల్లలను ఉత్పత్తి చేయవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉత్పత్తి లక్ష్యాలు, నీటి నాణ్యత, చేప పిల్లల పెంపకం, ఆహారం, వ్యాధుల నియంత్రణ, పంపిణీ తదితర అంశాలను నిరంతరం పర్యవేక్షించే వ్యవస్థ ఉంటే ప్రైవేట్ కాంట్రాక్టర్లపై ఆధారపడాల్సిన అవసరం తగ్గుతుందని, ప్రభుత్వ కేంద్రాల్లోనే శాస్త్రీయ పద్ధతుల్లో చేప పిల్లల ఉత్పత్తి చేపట్టి పర్యవేక్షిస్తే నాణ్యత పెరుగుతుందని అంటున్నారు.
ఒక్కసారి పెట్టుబడి.. ఏటా ప్రయోజనం
ప్రభుత్వ చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాలన్నింటినీ ఒకేసారి పూర్తిస్థాయిలో పునరుద్ధరించి, అవసరమైన ట్యాంకులకు మరమ్మతులు చేసి, నీటి వసతులు కలి్పస్తే వాటిని ప్రతి ఏడాదీ వినియోగించుకోవచ్చు. తద్వారా ప్రస్తుతం కాంట్రాక్టర్ల ద్వారా చేప పిల్లలను కొనుగోలు చేయడానికి వెచి్చస్తున్న భారీ మొత్తంలో గణనీయమైన మొత్తాన్ని ఆదా చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రతి ఏడాది సుమారు రూ.70 కోట్లకు పైగా ప్రభుత్వానికి ఆదా అయ్యే అవకాశం ఉందనే అంచనాలు ఉన్నాయి. ఒక్కసారి మౌలిక వసతులపై పెట్టుబడి పెట్టి కేంద్రాలను పునరుద్ధరిస్తే.. ఆ తర్వాత ప్రతి ఏడాది చేప పిల్లల ఉత్పత్తి ద్వారా ప్రభుత్వానికి ఆర్థిక ప్రయోజనం చేకూరడమే కాకుండా, మత్స్యకారులకు కూడా సమయానికి నాణ్యమైన చేప పిల్లలు అందుబాటులోకి వస్తాయని అంటున్నారు.
రెండు, మూడురకాల చేపపిల్లలే..
ఏటా చేప పిల్లల కొనుగోలు కోసం వెచి్చస్తున్న మొత్తాన్ని ఉత్పత్తి కేంద్రాల పునరుద్ధరణకు, సిబ్బంది నియామకానికి, ఆధునిక సాంకేతికతకు ఉపయోగించి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదన్న ప్రశ్న తలెత్తుతోంది. మరోవైపు ఇన్ని కోట్లు పెట్టినా.. పంపిణీ చేస్తున్న చేప పిల్లలు రెండు, మూడు ప్రధాన రకాలకే పరిమితమవుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. అదే ప్రభుత్వ ఉత్పత్తి కేంద్రాలను శాస్త్రీయంగా అభివృద్ధి చేస్తే సుమారు 10 రకాల చేపలను పెంచే అవకాశం ఉంటుంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నీటి వనరులు, చెరువుల స్వభావం, మత్స్యకారుల అవసరాలకు అనుగుణంగా వివిధ రకాల చేప పిల్లలను ఉత్పత్తి చేసేందుకు అవకాశం ఉంటుంది.
దీంతో చెరువుల్లో చేపల వైవిధ్యం పెరగడమే కాకుండా మత్స్యకారులకు మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా ఉత్పత్తి చేసుకునే అవకాశం లభిస్తుంది. ప్రభుత్వం తక్షణం చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాలపై సమగ్ర సర్వే నిర్వహించాలని, ఎక్కడెక్కడ భూములు ఆక్రమణకు గురయ్యాయి? ఎన్ని ట్యాంకులు అందుబాటులో ఉన్నాయి? ఎన్ని పని చేస్తున్నాయి? ఎక్కడ మరమ్మతులు అవసరం? ఎంత ఉత్పత్తి సామర్థ్యం ఉంది? వంటి అంశాలను గుర్తించాలనే డిమాండ్లు విని్పస్తున్నాయి. చేప పిల్లల ఉత్పత్తి విషయంలో ప్రభుత్వం దశలవారీగా బయటి కొనుగోళ్లు, కాంట్రాక్టర్లపై ఆధారపడే విధానాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు గట్టిగా విని్పస్తున్నాయి.
ఎస్సారెస్పీ కింద ఉన్న పోచంపాడులో చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాలు. ఒకే దగ్గర 240కి పైగా కేంద్రాలు.. వాటిలో 80 కేంద్రాల్లో మాత్రమే ఉత్పత్తి చేస్తున్నారు.


