కేంద్రాన్ని కోరుతూ శాసనసభ ఏకగ్రీవ తీర్మానం
కరువు సహాయక చర్యలు, తాగు, సాగునీటి అవసరాలకు వినియోగిస్తాం
ఎఫ్‌ఆర్‌బీఎం రుణ పరిమితిని జీఎస్‌డీపీలో 3 శాతం నుంచి 3.5 శాతానికి పెంచాలి
వీబీజీ–రామ్‌జీ పథకంలో 125 రోజుల ఉపాధికి అదనంగా మరో 50 రోజులు పని కల్పించాలి
అలాగే 1,500 మెగావాట్ల విద్యుత్ కేటాయించాలి
అసెంబ్లీలో 8 అంశాలతో కూడిన తీర్మానం.. ఆమోదించిన సభ
సాక్షి, హైదరాబాద్: ‘తాగు, సాగునీటి అవసరాలు, కరువు నివారణ చర్యలకు కేంద్ర ప్రభుత్వం రూ.20 వేల కోట్ల ప్రత్యేక సహాయ ప్యాకేజీ మంజూరు చేయాలి. చెరువులు, నీటి వనరుల పునరుజ్జీవం, పురోగతిలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయడానికి వివిధ కేంద్ర పథకాల కింద తగిన సహాయం అందించాలి’ అని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ శాసనసభ ఏకగ్రీవ తీర్మానం చేసింది. శుక్రవారం శాసనసభలో ఎల్‌నినోపై లఘు చర్చ సందర్భంగా సభ్యులు లేవనెత్తిన అంశాలపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ఎనిమిది అంశాలపై తీర్మానం ప్రవేశపెట్టగా, అన్ని రాజకీయ పార్టీలు ఈ తీర్మానానికి మద్దతు ఇవ్వాలని భట్టి కోరారు. అనంతరం సభ్యులు తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు.
తీర్మానంలోని ముఖ్యాంశాలు
⇒ 2026–27 ఆర్థిక సంవత్సరానికి ఎఫ్‌ఆర్‌బీఎం రుణ పరిమితిని జీఎస్‌డీపీలో 3 శాతం నుంచి 3.5 శాతానికి పెంచాలి. తద్వారా ఉపశమన, నివారణ చర్యలకు అవసరమైన అదనపు వ్యయాన్ని రాష్ట్రం భరించేందుకు అవకాశం కల్పించాలి.
⇒ రాష్ట్రానికి అదనంగా 1,500 మెగావాట్ల విద్యుత్ కేటాయించాలి. కేంద్ర విద్యుత్ ఉత్పత్తి సంస్థల్లో కేటాయించకుండా ఉన్న కోటా నుంచి దీన్ని అందించాలి. విండో– ఐ కింద 5 మిలియన్ టన్నుల బొగ్గు లింకేజీ నిర్ధారించి రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు రేక్‌ల లభ్యతను పెంచాలి. విద్యుత్ ట్రాన్స్‌మిషన్ చార్జీలను సడలించి, అవసరమైన సాయం అందించాలి.
⇒ ఎల్‌నినో పరిస్థితులను క్షేత్రస్థాయిలో అంచనా వేసేందుకు కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి బృందాన్ని వీలైనంత త్వరగా రాష్ట్రానికి పంపించాలి. జాతీయ విపత్తు ప్రతిస్పందన నిధి (ఎన్‌డీఆర్‌ఎఫ్) నుంచి తగిన సాయం మంజూరు చేయాలి. రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి (ఎస్‌డీఆర్‌ఎఫ్)లో కేంద్ర వాటాను సత్వరమే విడుదల చేయాలి.
⇒ పంట నష్టం/ఇన్‌పుట్ సబ్సిడీ, తాగునీరు, పశుగ్రాసం, పశు సంపద పరిరక్షణ, భూగర్భ జలాల పునరుద్ధరణ, చెరువులు, ఇతర జలవనరుల పునరుద్ధరణతోపాటు ఉపశమన చర్యలకు తగిన సహాయం అందించాలి.
⇒ వీబీజీ–రామ్‌జీ పథకంలో 125 రోజుల పనిదినాలకు అదనంగా మరో 50 రోజుల ఉపాధి కల్పించాలి. ఈ పథకంపై ఖర్చును మొత్తం కేంద్ర ప్రభుత్వమే భరించాలి. రాష్ట్రంలో అమల్లో ఉన్న 60 రోజుల సీజనల్ సస్పెన్షన్ కాలాన్ని సడలించాలి. గ్రామీణ కుటుంబాలకు ఉపాధి భద్రత కల్పించేందుకు లేబర్ బడ్జెట్‌ను తగినంతగా పెంచాలి.
⇒ రాష్ట్రానికి అవసరమైన ఎరువులను సకాలంలో కేటాయించాలి. ప్రభావిత జిల్లాలకు ముందుగానే రేక్‌ల ద్వారా సరఫరా చేయాలి. పర్ డ్రాప్ మోర్ క్రాప్ (పీడీఎంసీ) కింద కేటాయింపులు పెంచి డ్రిప్ ఇరిగేషన్‌ను వేగంగా విస్తరించాలి. ఎంఐడీహెచ్ కింద కూరగాయల సాగు విస్తీర్ణం పెంపునకు ఆర్థిక సహాయం అందించాలి. ప్రత్యామ్నాయ పంటల విత్తనాలను సబ్సిడీపై సరఫరా చేయాలి.
⇒ రైతులు, బలహీన వర్గాల కుటుంబాలను ఆదుకోవడంతోపాటు తక్షణ సహాయ చర్యలు చేపట్టేందుకు కేంద్ర పథకాలు, కేంద్ర ప్రాయోజిత పథకాల కింద అదనపు ఆర్థిక సాయం అందించాలి. అందుకు అవసరమైన తీరుగా నిబంధనలను సడలించాలి.


