దానం దారెటో? | Danam Nagender MLA Disqualification | Sakshi
Sakshi News home page

దానం దారెటో?

Sep 19 2026 7:40 AM | Updated on Sep 19 2026 7:40 AM

Danam Nagender MLA Disqualification

హైదరాబాద్‌: ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేస్తూ శుక్రవారం హైకోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో ఆయనతో పాటు అభిమానులు, అనుచరులు, కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు షాక్‌కు గురయ్యాయి. తీర్పు వచ్చేటప్పటికే అసెంబ్లీ నుంచి ఇంటికి వచ్చిన దానం రెండు గంటల పాటు లోపలే ఉండిపోయారు. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే మాత్రమే ఆయనను కలిశారు. మరోవైపు దానం నివాసానికి నేతలు, కార్యకర్తలు, అనుచరులు పెద్దగా రాకపోవడం చర్చనీయాంశమైంది. ఇక దానం అనర్హతపై బీఆర్‌ఎస్‌ శ్రేణులు బాణాసంచా కాల్చారు. బీజేపీ శ్రేణులు హర్షం వ్యక్తంచేశాయి. 

కాంగ్రెస్‌లోని కొందరు సైతం ఆనందంగా కనిపించారు. కాగా, ఇటీవల ప్రభుత్వం తీరుపై విమర్శలు చేస్తున్న దానం.. అసెంబ్లీలో శుక్రవారం మాట్లాడుతూ ప్రొటోకాల్‌ పాటించడం లేదని, తన నియోజకవర్గంలో అనర్హులకు ఇళ్లు కేటాయించారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక దానం సీఎం రేవంత్‌ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరేదాకా ఆ విషయం చాలామంది కార్యకర్తలకు తెలియదు. అనుచరులు, కార్యకర్తల అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకోకపోవడంతో చాలామంది బీఆర్‌ఎస్‌ నేతలు ఆయనతో వెళ్లలేదు. ఈ నేపథ్యంలో ఉప ఎన్నిక వస్తే ఎందరు అండగా నిలుస్తారనేది  చర్చనీయాంశమైంది.  

మంత్రి పదవి ఆశిస్తే.. 
2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ తరపున పోటీ చేసిన నాగేందర్‌ 25 వేల మెజార్టీతో గెలిచారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రావడంతో ముందే ఆ పార్టీలో చేరితే మంత్రి పదవి వస్తుందని భావించారు. కానీ, కాంగ్రెస్‌ నుంచి గెలిచినవారికే చాన్స్‌ అనడంతో అవకాశం దక్కలేదు. పైగా కాంగ్రెస్‌ తరఫున ఎంపీగా పోటీ చేయడాన్ని చాలామంది తప్పుబట్టారు. ఇంతదాక వస్తుందని ఊహించని దానం..మళ్లీ బీఆర్‌ఎస్‌లోకి వెళ్లాలనే సూచనలను పట్టించుకోలేదు.

బీఆర్‌ఎస్‌ శ్రేణుల సంబరాలు  
దానంపై అనర్హత వేటు పడడంతో బీఆర్‌ఎస్‌ శ్రేణులు తెలంగాణ భవన్‌ వద్ద బాణాసంచా కాల్చి, స్వీట్లు పంచుకుని ఆనందం వ్యక్తంచేశారు. బీఆర్‌ఎస్‌ ఖైరతాబాద్‌ నియోజకవర్గ ఇంచార్జి మన్నె గోవర్ధన్‌రెడ్డి, మహేష్‌ యాదవ్, మధుకర్‌యాదవ్, వెంకటేష్‌ పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement