ఆస్కార్‌ బరిలో గోంధళ్‌  | Marathi Thriller Gondhal Is India Official Entry To Oscars 2027 | Sakshi
Sakshi News home page

ఆస్కార్‌ బరిలో గోంధళ్‌ 

Sep 19 2026 5:03 AM | Updated on Sep 19 2026 5:03 AM

Marathi Thriller Gondhal Is India Official Entry To Oscars 2027

మరాఠి థ్రిల్లర్‌ సినిమా ‘గోంధళ్‌’ ఆస్కార్‌ బరిలో నిలిచింది. వచ్చే ఏడాది మార్చి 14న అమెరికాలోని లాస్‌ ఏంజిల్స్‌లో 99వ ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవం జరగనున్న సంగతి తెలిసిందే (భారతీయ కాలమానం ప్రకారం మార్చి 15). కాగా, బెస్ట్‌ ఇంటర్నేషనల్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ విభాగంలో నామినేషన్  కోసం భారతదేశం నుంచి ‘గోంధళ్‌’ను ఎంపిక చేసినట్లు ఫిల్మ్‌ ఫెడరేషన్  ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌ఎఫ్‌ఐ) ప్రకటించింది.

 ఆస్కార్‌ అవార్డుల్లో భారతదేశం తరఫున అధికారిక ఎంట్రీ కోసం 33 సినిమాలు పోటీ పడ్డాయి. వీటిలో ‘ధురంధర్‌’, ‘ధురంధర్‌: ది రివెంజ్‌’, ‘హక్‌’, ‘హనుమాన్  అంశ్‌’, ‘బోర్డర్‌ 2’, ‘120 బహదూర్‌’, ‘ఇక్కీస్‌’ వంటి 14 హిందీ సినిమాలున్నాయి. అలాగే ‘పెద్ది’, ‘ఇరుముడి’, ‘సింగ్‌ గీతం’, ‘ఇగ్వా (ఇంకా విడుదల కావాల్సి ఉంది)’ వంటి నాలుగు తెలుగు సినిమాలతో పాటుగా, మూకీ చిత్రం ‘గాంధీ టాక్స్‌’ కూడా ఉంది. ఈ చిత్రాలన్నింటినీ దాటుకుని ‘గోంధళ్‌’ మూవీ ఆస్కార్‌ అవార్డుల పోటీకి భారతదేశం తరఫున అధికారిక ఎంట్రీగా ఎంపికైంది.

కథ ఏంటంటే..?
ఇషితా దేశ్‌ముఖ్, యోగేష్‌ సోహోని, అనుజ్‌ ప్రభు, నిషాద్‌ భోయిర్, కిషోర్‌ కదమ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘గోంధళ్‌’. సంతోష్‌ దవఖర్‌ దర్శకత్వంలో దీక్షా దవఖర్‌ నిర్మించిన ఈ చిత్రం 2025 నవంబరు 14న విడుదలైంది. సంప్రదాయం, మోసం, అధికారం, ఆకాంక్షల అంశాల మేళవింపుతో రూపొందిన ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం అందించారు. ఈ చిత్రం కథ విషయానికి వస్తే... మహారాష్ట్రలోని గ్రామీణ ప్రాంతాల్లో కొత్తగా పెళ్లయిన దంపతుల జీవితంలోని అడ్డంకులు తొలగిపోవడానికి రాత్రంతా సంగీతం, నృత్యం, పురాణ కథలతో ‘గోంధళ్‌’ అనే సంప్రదాయ జానపద పూజ నిర్వహిస్తారు. ఈ పూజ నేపథ్యంతోనే ఈ కథ సాగుతుంది. 

ఆనంద్‌ (యోగేష్‌ సోహోని)తో సుమన్  (ఇషితా దేశ్‌ముఖ్‌) వివాహం జరుగుతుంది. కానీ, గతంలోనే గోంధల్‌ ప్రదర్శకుడు సాహెబ్‌రావ్‌    (అనుజ్‌ ప్రభు)ను సుమన్  ప్రేమిస్తుంది. మరి.. ఆ రాత్రి ఏం జరిగింది? అన్నదే ఈ సినిమా కథ. కాగా బెస్ట్‌ ఇంటర్నేషనల్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ విభాగపు నామినేషన్  కోసం గతంలో ‘హరిశ్చంద్రాచి ఫ్యాక్టరీ’, ‘శ్వాస్‌’, ‘కోర్ట్‌’  వంటి మరాఠి చిత్రాలు పోటీలో నిలిచినా నామినేషన్  దక్కలేదు. మరి..‘గోంధళ్‌’కు అయినా ఆస్కార్‌ నామినేషన్  లభిస్తుందా? లెట్స్‌ వెయిట్‌ అండ్‌ సీ. ఈ సంగతి ఇలా ఉంచితే... ‘మదర్‌ ఇండియా’, ‘సలామ్‌ బాంబే’, ‘లగాన్ ’ చిత్రాలు ఆస్కార్‌ అవార్డ్స్‌లోని బెస్ట్‌ ఇంటర్నేషనల్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ విభాగంలో నామినేషన్  పొందినప్పటికీ అవార్డు మాత్రం లభించలేదు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement