‘‘ఇకపై నేను సినిమాల్లో నటించను.. మళ్లీ నటించాలనే ఆలోచన కూడా నాకు లేదు’’ అని కన్నడ సీనియర్ నటుడు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత అనంత్‌నాగ్ తెలిపారు. బెంగళూరులోని యశవంతపురలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ–‘‘సినిమా రంగంలో అనేక మార్పులు వచ్చాయి. నాసిరకం కథలు వస్తున్నాయి. ఇటీవల కథల్లో నాణ్యత లోపించింది. కథ, కథనం కంటే బాక్సాఫీస్ కలెక్షన్లకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు.
నేను ఒప్పుకుని నటించిన ఐదు సినిమాలు పరాజయం చెందాయి. ఆ క్షణం నుంచి ఇకపై సినిమాల్లో నటించరాదని నిర్ణయించుకున్నా. అంతేకానీ నటించకపోవటానికి ఆరోగ్య సమస్యలు ఏమాత్రం లేవు. ప్రస్తుత సమకాలీన దర్శకులతో పని చేయటం ఇష్టం లేదు. మంచి విషయం, ప్రేక్షకులను పట్టించుకోకుండా కేవలం వసూళ్ల కోసమే వెంపర్లాడుతున్న సంస్కృతి ఇండస్ట్రీలో ఉంది’’ అని పేర్కొన్నారు.
ఐదు దశాబ్దాల పాటు సినిమా రంగంలో తనదైన నటనతో ప్రేక్షకులను అలరించిన అనంత్‌నాగ్ తాజా నిర్ణయం ఆయన అభిమానులను తీవ్ర నిరాశ పరిచింది. ఆయన మళ్లీ సినిమాల్లో నటించాలని పలువురు అభి్రపాయ పడుతున్నారు. ఇదిలా ఉంటే... సినిమా రంగానికి అనంత్‌నాగ్ చేసిన విశేష సేవలకుగాను భారత ప్రభుత్వం ఇటీవల దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటించిన విషయం తెలిసిందే.
– ఆనంద రెడ్డి, సాక్షి, యశవంతపుర


